-మాదకద్రవ్యాలు, నేరాల రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యం
-పుష్కరాల నిధులతో శాశ్వత అభివృద్ధి పనులు – స్థానిక సంస్థల ఎన్నికలు అవసరం
-ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి
రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి సమాజంలో పిల్లలు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి వస్తున్న తరుణంలో వారి ప్రవర్తన, పరిస్థితులను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించుకోవాల్సిన అవసరం ఉందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. బుధవారం రూరల్ లో పలు శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న సామాజిక పరిస్థితులు, మాదకద్రవ్యాల ప్రభావంతో నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల పెంపకంలో అత్యంత జాగ్రత్త అవసరమని ఆయన సూచించారు. కోటిపల్లి బస్టాండ్ నుండి టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో రూ.87 లక్షల 45 వేల అంచనా వ్యయంతో నిర్మించనున్న భవన శంకుస్థాపన , ప్రభుత్వ బాలుర పరిశీలన వసతి గృహానికి భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన , శిలాఫలకాన్ని ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.
ఈ వసతి గృహాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఇక్కడ ఆశ్రయం పొందే బాలలకు కౌన్సిలింగ్, శిక్షణ ద్వారా మంచి అలవాట్లు అలవర్చడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించి నేరప్రవృత్తి నివారణకు ఈ కేంద్రం దోహదపడుతుందని తెలిపారు.
రాష్ట్రాన్ని మాదకద్రవ్యాలు, గంజాయి, నేరాల రహితంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా జరిగిన గంజాయి విక్రయాలు, రవాణాను ప్రస్తుతం చాలా వరకు అరికట్టగలిగామని, భవిష్యత్తులో పూర్తిగా నిర్మూలించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆగిపోయిన అభివృద్ధి పనులు, భవనాల నిర్మాణాలు, సీసీ రోడ్లు, రహదారి పనులను ప్రస్తుతం పూర్తి చేస్తున్నామని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. జలజీవన్ మిషన్ కింద గతంలో వినియోగించని నిధులను తిరిగి సాధించి, ఇంటింటికీ తాగునీరు అందించే లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో నీటి కొరత లేకుండా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
రాబోయే పుష్కరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుంభమేళా తరహాలో నిర్వహించాలని నిర్ణయించారని, ఇందుకు కేంద్రం నుంచి కూడా నిధులు అందనున్నాయని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే పుష్కరాల నిర్వహణ మరింత సమర్థవంతంగా చేయవచ్చని, రహదారుల విస్తరణ, బైపాస్ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుదల, ఆక్రమణల తొలగింపు వంటి పనులను శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని అన్నారు. నిధులు వృథా కాకుండా దీర్ఘకాలిక అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్సటి ప్రసాద్, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News