-2025-26 వార్షిక ప్రణాళిక అమలు పురోగతి మరియు 2026-27 ప్రతిపాదిత వార్షిక ప్రణాళికను సమీక్షంచిన మంత్రి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సంకల్పమైన “ఒక కుటుంబం – ఒక వ్యవస్థాపకుడు” అనే లక్ష్యాన్ని సాధించేలా DAY-NRLM కింద వార్షిక ప్రణాళికను సిద్ధం చేయాలని, రైతు ఉత్పత్తి సమాఖ్యలను బలోపేతం చేయాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. గురువారం సెర్ప్ (SERP) కేంద్ర కార్యాలయంలో సెర్ప్ కార్యదర్శి, డైరెక్టర్లు మరియు అదనపు డైరెక్టర్లతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2025-26 వార్షిక ప్రణాళిక అమలు పురోగతిని మరియు 2026-27 ప్రతిపాదిత వార్షిక ప్రణాళికను ఆయన సమీక్షించారు. ఒక కుటుంబం – ఒక వ్యవస్థాపకుడు,రైతు ఉత్పత్తిదారుల సంఘాల (FPOs) బలోపేతం, సూక్ష్మ వ్యాపారాల ప్రోత్సాహం, క్లస్టర్ ఆధారిత పరిశ్రమలు, స్వయం” (SWAYAM) బ్రాండింగ్, వెలుగు మహిళా మార్ట్‌ల బలోపేతం తదితర అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సంకల్పమైన “ఒక కుటుంబం – ఒక వ్యవస్థాపకుడు” అనే లక్ష్యాన్ని సాధించేలా DAY-NRLM కింద వార్షిక ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. FPOల బోర్డు డైరెక్టర్లకు సామర్థ్య పెంపు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని, అలాగే వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు (Value Addition) కోసం FPO స్థాయిలో ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని కోరారు. 2026-27 సంవత్సరంలో 5 లక్షల సూక్ష్మ వ్యాపారాలను (Micro Enterprises) ప్రోత్సహించేందుకు తగిన వ్యూహాన్ని సిద్ధం చేయాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొబ్బరి మరియు పీచు (Coir) క్లస్టర్లు, 3-5 చేనేత క్లస్టర్లు, కళాకారుల (Artisan) క్లస్టర్లు మరియు DAY-NRLM కింద ఇతర నాన్-ఫార్మ్ సూక్ష్మ వ్యాపార క్లస్టర్ల ఏర్పాటు కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (DPRs) సిద్ధం చేయాలని కోరారు. పొదుపు సంఘాల (SHG) మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు “స్వయం” బ్రాండ్ పేరును ప్రాచుర్యంలోకి తీసుకురావాలని, అలాగే అన్ని సంఘాలకు ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ మద్దతు అందించాలని పేర్కొన్నారు. వెలుగు మహిళా మార్ట్‌లను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన వ్యూహాన్ని రూపొందించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు.
Prajavartha Online Telugu News