జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం వత్సవాయి గ్రామంలో కేడీసీసీ బ్యాంక్ వత్సవాయి బ్రాంచ్ ఆధ్వర్యంలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఘనంగా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం , జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం మాట్లాడుతూ, కేడీసీసీ సిబ్బంది మరియు సొసైటీ అధ్యక్షుల సహకారంతో ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మండుతున్న ఎండల్లో బాటసారుల దాహార్తిని తీర్చడం కన్నా గొప్ప సేవ మరొకటి లేదని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేడీసీసీ బ్యాంక్ నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఈ కార్యక్రమాలకు ప్రజల నుండి విశేష స్పందన మరియు అభినందనలు లభిస్తున్నాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ, ప్రజల కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం ని ప్రత్యేకంగా అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సమయంలో ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలకు అండగా నిలుస్తూ సేవాభావంతో ముందుకు సాగుతున్న కేడీసీసీ బ్యాంక్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, వత్సవాయి మండల పరిధిలోని వివిధ గ్రామాల సొసైటీ అధ్యక్షులు, కార్యకర్తలు, కేడీసీసీ బ్యాంక్ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News