Breaking News

బీజేపీ అవకాశవాద రాజకీయాలను కడప ప్రజలు తిప్పికొట్టాలి

-మతోన్మాద శక్తుల కుట్రలు ప్రజలు అప్రమత్తంగా గమనించాలి
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో బీజేపీ, మతోన్మాద శక్తులు అమలు చేస్తున్న అవకాశవాద రాజకీయాలను కడప ప్రజలు అప్రమత్తంగా గమనించాలని, ప్రజల అసలు సమస్యలను పక్కదారి పట్టించే కుట్రలకు లోనుకావద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పేర్కొన్నారు
ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
దేశవ్యాప్తంగా ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడమే బీజేపీ ప్రధాన అజెండాగా మారిందన్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, కేంద్రం ఇచ్చిన హామీల అమలు వంటి కీలక అంశాలపై సమాధానం చెప్పలేని పరిస్థితిలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు మత రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.
2018లో బీజేపీ ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ ఇప్పటివరకు అమలు కాలేదని, కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు హామీ పూర్తిగా గాలిలో కలిసిపోయిందని గుర్తుచేశారు. విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం నిధులు, పరిశ్రమల ఏర్పాటు వంటి అంశాలపై ప్రజలకు సమాధానం చెప్పకుండా మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం దుర్మార్గ రాజకీయమన్నారు.
కడప నగరంలో కావాలనే శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా కొన్ని మతోన్మాద శక్తులు వ్యవహరిస్తున్నాయని తప్పుపట్టారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చంద్రబాబు.. కడపలోని అల్మాస్‌పేట సర్కిల్‌ను టిప్పు సుల్తాన్ సర్కిల్‌గా అభివృద్ధి చేస్తామని బహిరంగ సభలో ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. అనంతరం కడప కార్పొరేషన్ కూడా ఈ అంశంపై చర్చించి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక ప్రతిపాదనలు పంపిందన్నారు.
ఇప్పుడు అదే అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రస్తుతం మతోన్మాద శక్తులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న పరిస్థితిని ఆసరాగా చేసుకొని కొందరు కావాలనే ఉద్రిక్తతలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కడప నగరంలో సామరస్య వాతావరణాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని కడపలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చాలని, అన్ని వర్గాల ప్రజలతో చర్చలు జరిపి మత సామరస్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. కుట్రపూరితంగా ప్రజలను రెచ్చగొట్టే శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైతే దాని పూర్తి బాధ్యత చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానిదేనని ఈశ్వరయ్య హెచ్చరించారు.
ప్రజలు మతం, కులం పేరుతో విడిపోకుండా ప్రజాస్వామ్య, లౌకిక విలువలను కాపాడాలని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపైనే రాజకీయ చర్చలు జరగాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *