Breaking News

ఖరీఫ్ రైతులకు శుభవార్త.. పంటల కనీస మద్దతు ధరలు పెంపు

– రైతుల ఆదాయం పెంచే దిశగా కేంద్రం కీలక నిర్ణయం
– కేంద్ర ప్రభుత్వానికి మంత్రి అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ రైతాంగ సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు (MSP) రైతులకు భారీ ఊరటనిచ్చే నిర్ణయమని ఆయన అభినందించారు. ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయ వృద్ధి, వ్యవసాయ రంగ బలోపేతం లక్ష్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా రైతుల్లో నూతన నమ్మకాన్ని పెంచుతున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఖరీఫ్ పంటల MSP పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షల 60 వేల కోట్ల భారీ వ్యయాన్ని ఆమోదించడం రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. పెట్టుబడి ఖర్చుకు కనీసం 50 శాతం లాభం జోడించి MSP ధరలు నిర్ణయించడం రైతులకు నిజమైన భరోసా కల్పించే చర్యగా అభివర్ణించారు. రైతు కష్టానికి తగిన గిట్టుబాటు ధర కల్పించాలన్న సంకల్పంతోనే పలు పంటల MSPలను గణనీయంగా పెంచిందని పేర్కొన్నారు. వరి కామన్ రకానికి క్వింటాల్‌కు రూ.72 పెంచి రూ.2441, గ్రేడ్-ఏ వరికి రూ.2461 నిర్ణయించడం రైతులకు లాభదాయకమని తెలిపారు. జొన్నకు రూ.4073, రాగికి రూ.5205, స‌జ్జ‌లకు రూ.2900, ఉలవలకు రూ.8200, మొక్క‌జొన్న‌కు రూ.2410, నువ్వులకు రూ.10,346, సన్‌ఫ్లవర్‌కు రూ.8343, పత్తికి రూ.8667, వేరుశ‌న‌గ‌కు రూ.7517 వరకు MSP పెంపు ప్రకటించడం రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వ్యయభారం, ఎరువులు, విత్తనాలు, కార్మిక ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైతుల ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. రైతు సంక్షేమమే దేశ అభివృద్ధికి పునాది అన్న దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని కొనియాడారు. రాష్ట్రంలోని రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన MSPలను పూర్తిస్థాయిలో పొందేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలు, మార్కెటింగ్ వ్యవస్థ, మద్దతు ధర అమలు ప్రక్రియలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతాంగానికి అండగా నిలుస్తూ వ్యవసాయ రంగాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాలకు రాష్ట్ర రైతుల తరఫున మంత్రి అచ్చెన్నాయుడు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *