Breaking News

రొయ్యల ఫీడ్ ధరల పెంపు నిలిపివేత.. మంత్రి అచ్చెన్నాయుడు జోక్యంతో కీలక నిర్ణయం

– రైతుల కష్టాలపై వ్యాపారం చేయొద్దు : ఫీడ్ కంపెనీలకు మంత్రి గట్టి హెచ్చరిక
– ఏకపక్ష ధరల పెంపు అంగీకరించం
– రైతుల ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం : మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆక్వా రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ నిర్ణయాన్నీ కూటమి ప్రభుత్వం సహించదని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రొయ్యల ఫీడ్ ధరలను ఒక్కసారిగా పెంచడం వల్ల రాష్ట్రంలోని వేలాది ఆక్వా రైతులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులు, రైతు సంఘాలు, అధికారులతో బుధవారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందిస్తూ, రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా ధరలు పెంచడం సరైన విధానం కాదన్నారు. ప్రస్తుతం ఆక్వా రంగం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందని, ఇలాంటి సమయంలో రైతులపై అదనపు భారం మోపే చర్యలు తీసుకుంటే ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలు కాపాడటమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

మంత్రి ఆదేశాల నేపథ్యంలో ష్రిమ్ప్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు స్పందిస్తూ, పెంచిన ఫీడ్ ధరల అమలును తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలియజేశారు. ముడి పదార్థాల ధరలు నిరంతరం పెరుగుతున్న కారణంగా ఫీడ్ ధరల సవరణపై ఆలోచించాల్సి వచ్చిందని అసోసియేషన్ పేర్కొన్నప్పటికీ, మంత్రి అచ్చెన్నాయుడు సూచనలు, మార్గదర్శకాలను గౌరవిస్తూ ధరల పెంపును వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. రైతులు, ఫీడ్ తయారీ సంస్థలు, అధికారులు పాల్గొనే ఉమ్మడి సమావేశం ఈ నెల 15న నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అందరి అభిప్రాయాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుని రైతులకు నష్టం కలగకుండా, పరిశ్రమ కూడా కొనసాగగలిగే విధంగా పరస్పర ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆక్వా రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని, రైతుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ఏపీఎస్ఎడియే కో-వైస్ చైర్మన్, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మత్స్యశాఖ కమిషనర్‌తో పాటు ఎస్ఐఎఫ్టి, సిఐబీఏ, సిఐఎఫ్ఏ, సిఐఎఫ్టి, మత్స్య విశ్వవిద్యాలయం ప్రతినిధులు, రొయ్యల రైతులు, ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *