– మహిళ పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి పలు అంశాలపై చర్చ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేసే క్రమంలో ఎప్పటికప్పుడు వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించడంతో పాటు సమన్వయం చేసుకోవాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం మంత్రి విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో సెర్ప్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే పలు అంశాలపై మంత్రి చర్చించడంతో పాటు సూచనలు కూడా చేశారు. సెర్ప్‌లోని అన్ని స్థాయిల సిబ్బంది KPIs – కీలక పనితీరు సూచికలు ఖరారు చేయడం.. చేతివృత్తులు, కులవృత్తుల వారికి నైపుణ్యం మెరుగుపరుచుకునేలా శిక్షణ యూనిట్ల ఏర్పాటు, తొలి విడతలో 3- 4 జిల్లాల్లో పైలెట్ పద్ధతిలో ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. పాడి పరిశ్రమ ప్రధాన జీవనోపాధిగా ఉన్న అన్ని గ్రామాల్లో పశుగ్రాసం పెంపకం ప్లాట్లను అభివృద్ధి చేయడంతో పాటు ఐదు కంటే ఎక్కువ పాడి పశువులు ఉన్న స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలను గుర్తించి.. పాల సేకరణ, బాట్లింగ్, సొంత బ్రాండ్ మార్కెటింగ్‌పై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఇళ్ల వద్ద పెరటి కోళ్ల పెంపకం కోసం మదర్ హేచరీల ఏర్పాటుకు ప్రోత్సాహకాలపై చర్చించారు. ఎంపిక చేసిన మండలాల్లో పొట్టేళ్ల పెంపకం యూనిట్లను ప్రోత్సహించడం, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) మరియు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) కింద మహిళా సంఘాల సభ్యులందరినీ సంతృప్త స్థాయిలో నమోదు చేయడం, – బ్యాంకుల నుంచి డేటాను సేకరించి సెర్ప్ పోర్టల్‌లో అప్డేట్ చేయడం, నమోదు, క్లెయిమ్‌ల పరిష్కార పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలో హెల్ఫ్ డెస్క్‌ల ఏర్పాటుపై చర్చించారు. పీఎం సూర్య ఘర్ యోజన కింద సోలార్ పవర్ యూనిట్ల ఏర్పాటుకు మహిళలకు సహకారం అందించడంతో పాటు మండల సమాఖ్యలు లేదా గ్రామ సంఘాల ద్వారా విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు ప్రోత్సహించాలని కూడా నిర్ణయించారు. ఈ సమావేశంలో సెర్ప్ అడిషనల్ సీఈవో శ్రీరామ్ నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News