-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడను పరిశుభ్రతలో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం నగర పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ కాలనీ, వెటర్నరీ కాలనీ, శ్రీనివాస నగర్ బ్యాంక్ కాలనీ, ఫిలిం కాలనీ, భారతి నగర్, గురునానక్ కాలనీ ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించారు. ఆయా ప్రాంతాలలో పారిశుధ్యం, రహదారుల పరిస్థితి, మరుగుదొడ్ల నిర్వహణ, నిర్మాణ వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలను అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా, ప్రజలకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నగరంలోని ఖాళీ స్థలాలలో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి తక్షణమే తొలగించాలని సూచించారు. ఎక్కడైనా చెత్త పేరుకుపోకుండా శానిటేషన్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు.
ప్రజా మరుగుదొడ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అన్ని మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా అవసరమైన మరమ్మతులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలని సూచించారు.
అలాగే విజయవాడను “గుంతలు లేని నగరం”గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని కమిషనర్ పేర్కొన్నారు. రహదారులపై ఎక్కడైనా గుంతలు కనిపించిన వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రజలకు సురక్షిత ప్రయాణ వాతావరణం కల్పించాలని ఇంజనీరింగ్ సిబ్బందికి సూచించారు.
నగరంలో నిర్మాణ వ్యర్థాలు రోడ్లపై, ఖాళీ ప్రదేశాల్లో వేయకుండా పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ నిర్వహించాలని తెలిపారు. నిర్మాణ వ్యర్థాలను తప్పనిసరిగా ఎక్సల్ ప్లాంట్‌కు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Prajavartha Online Telugu News