– అర్హులైన లబ్ధిదారులకు పూర్తిస్థాయి నగదు రహిత వైద్య సేవలు
– ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అందుబాటులో నాణ్యమైన చికిత్స
– ఇగ్నైట్ సెల్‌ను సందర్శించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డా. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఎంప్యానెల్ చేసిన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నగదు రహిత నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
గురువారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డా. ఎన్టీఆర్ వైద్య సేవ ఇగ్నైట్ సెల్‌ను కలెక్టర్ లక్ష్మీశ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించడంతో పాటు, వైద్య ఖర్చుల భారం నుంచి ఆర్థిక భద్రత కల్పించడం జరుగుతోందన్నారు. జిల్లాలో 5,81,282 (బీపీఎల్) ఆరోగ్య కార్డులు ఉన్నాయని.. 2022, ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 30 వరకు 89,168 సర్జరీలు లేదా \థెరపీలు నిర్వహించినట్లు వివరించారు. డా. ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి 30 ప్రభుత్వ, 66 ప్రైవేటు మొత్తం 96 ఎంప్యానెల్డ్ ఆసుపత్రులు ఉన్నట్లు తెలిపారు. ఈ ఆసుపత్రుల్లో లబ్ధిదారులు ఆరోగ్య సేవలు పొందడంలో వైద్య మిత్రలు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.
కార్యక్రమంలో డా. ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయ అధికారి డా. జె.సుమన్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News