– ప్రతి వారం సమీక్షా సమావేశాలు నిర్వహణ
– సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలి
– పీఎం కుసుమ్ పథకంపైనా ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పీఎం సూర్యఘర్ పథకం అమల్లో స్పష్టమైన పురోగతి కనిపించాల్సిందేనని, ప్రతివారం సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
కలెక్టర్ లక్ష్మీశ గురువారం కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల అమలుపై సమావేశం నిర్వహించారు. మండలాలు, డివిజన్లు, నియోజకవర్గాల వారీగా ప్రగతిని సమీక్షించారు. జనరల్ కేటగిరీలో ఇప్పటివరకు 44,292 దరఖాస్తులు వచ్చాయని.. వీటిలో 44,256 దరఖాస్తులకు సంబంధించి సాంకేతిక సాధ్యత (Feasibility) పరిశీలన పారదర్శకంగా నిర్వహించి, 37,716 దరఖాస్తులకు వెండర్లతో మ్యాప్ చేశామని, వీటిలో 6,228 దరఖాస్తులకు సంబంధించి సింక్రనైజ్డ్ పూర్తయినట్లు అధికారులు వివరించారు. అదేవిధంగా ఎస్‌సీ, ఎస్‌టీ లబ్ధిదారులకు సంబంధించి రూఫ్ టాప్ ఇన్‌స్టలేషన్‌కు 35,445 మందిని తొలిదశలో గుర్తించి, దాదాపు 5 వేల ఇన్‌స్టలేషన్లు అయినట్లు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్టాడుతూ గౌరవ ప్రధాని, గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉపముఖ్యమంతి ఇంధన భద్రత, పొదుపునకు ప్రాధాన్యమిస్తున్నారని, ఈ నేపథ్యంలో పీఎం సూర్యఘర్ పథకాన్ని వడివడిగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషిచేయాలని, స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలని ఆదేశించారు. అదేవిధంగా వ్యవసాయ రంగంలో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తూ రైతులకు సౌర విద్యుత్ ప్రయోజనాలు చేరవేర్చే పీఎం కుసుమ్ పథకంపైనా ప్రత్యేకంగా దృష్టిసారించాలని సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి పథకం అమల్లో స్పష్టమైన పురోగతి సాధించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
సమావేశంలో విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ యు.హనుమయ్య, ఈఈలు శ్రీనివాసరావు, ఏడుకొండలుతో పాటు కోసోల్ ఎనర్జీ, ఎకో రన్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News