Breaking News

శ్రీవాణి ట్రస్ట్‌లో వైసీపీ పాపాలను కడుగుతున్న కూటమి ప్రభుత్వం

-శ్రీవాణి ట్రస్ట్‌లో దళారుల వ్యవస్థను గుర్తించి, అరికట్టింది కూడా కూటమి ప్రభుత్వమే
-వైసీపీ పెద్దలకు హిందూ మతంపై గౌరవం లేదు
-ఆలయాల ధ్వంసం తప్ప, వైసీపీ ప్రభుత్వం ఒక్క కొత్త ఆలయాన్ని కూడా నిర్మించలేదు
-వైసీపీకి రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం నచ్చటం లేదు
-బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీవాణి ట్రస్ట్ పేరుతో గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అవకతవకలను కూటమి ప్రభుత్వం బయటపెడుతోందని బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్ పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ, శ్రీవాణి ట్రస్ట్, వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు, ఇంజనీరింగ్ పనులు, ప్రసాదాల ముడి సరుకుల కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే శ్రీవాణి ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, దాన్ని దోపిడీకి వేదికగా మార్చిందని ఆరోపించారు. ప్రైవేట్ వ్యక్తులు, ట్రావెల్ ఏజెన్సీలకు అనుమతులు ఇచ్చి, భక్తుల విశ్వాసాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. రశీదులు లేకుండా వసూళ్లు జరిపి, స్వామివారి పేరుతో దోపిడీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలు భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకలని, కానీ గత ప్రభుత్వం దేవుడి సొమ్మును దుర్వినియోగం చేస్తూ వ్యవస్థలను భ్రష్టుపట్టించిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీవాణి ట్రస్ట్‌ను ఆన్‌లైన్ విధానంలోకి తీసుకువచ్చి పారదర్శకత తీసుకొచ్చిందని తెలిపారు. ఈ మార్పుల వల్లే అక్రమాలకు పాల్పడుతున్న ట్రావెల్ ఏజెన్సీలు, దళారులను గుర్తించి చర్యలు తీసుకోగలిగామని చెప్పారు. వైసీపీ హయాంలో పెరిగిపోయిన దళారుల వ్యవస్థ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలతో వెలుగులోకి వస్తోందన్నారు. గతంలో అధికార అండతో వ్యవహరించిన మధ్యవర్తులు ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ కాలంలో వీఐపీలకు ప్రాధాన్యం పెరిగి, సామాన్య భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉన్న సందర్భాల్లో కూటమి ప్రభుత్వం వీఐపీ దర్శనాలను తగ్గిస్తూ సామాన్య భక్తులకు అవకాశం కల్పిస్తోందన్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో కొత్తగా దేవాలయాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా భక్తులు కోరిన ప్రాంతాల్లో ఆలయాలు నిర్మిస్తామని, ముఖ్యంగా బీసీ, ఎస్సీ కాలనీల్లో ఆలయాలను నిర్మించి వాటిని ఆధ్యాత్మిక కేంద్రాలతో పాటు విద్యా అవగాహన కేంద్రాలుగా కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

జగన్ మతంపై స్పష్టత ఇవ్వాలి
వైసీపీ నాయకత్వానికి హిందూ ధర్మంపై గౌరవం లేదని బుచ్చి రాంప్రసాద్ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి తన సీబీఐ చార్జిషీట్‌లో క్రిస్టియన్‌గా పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. వివాహ శుభలేఖలు, వైఎస్సార్ అంత్యక్రియలు కూడా క్రిస్టియన్ సంప్రదాయంలో జరిగాయని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం అన్ని మతాలను ఉపయోగించుకుంటూ, బయట హిందూ వేషధారణతో కనిపిస్తూ లోపల హిందూ ధర్మంపై వ్యతిరేక భావన పెంచుతున్నారని ఆరోపించారు. జగన్ తన మతంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వైసీపీ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కంటే ఆలయాల ధ్వంసానికి కారణమైందని విమర్శించారు. శ్రీవాణి ట్రస్ట్ నిధుల లెక్క చెప్పమంటే వైసీపీ నాయకులు స్పందించడం లేదని ప్రశ్నించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.

వైసీపీ హయాంలో తిరుపతిలో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కేటాయించిన తాజ్ హోటల్ స్థలాన్ని రద్దు చేసి, ప్రత్యామ్నాయ స్థలం కేటాయించామని తెలిపారు. ఓరియన్ హోటల్, అన్నమయ్య సెంటర్ పరిసర ప్రాంతాల్లో జరిగిన భూవివాదాలపై విచారణ కొనసాగుతోందని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసిందని, దేవుడికి జరిగిన అపచారానికి ప్రజలే తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. దేవుడి సొమ్మును దుర్వినియోగం చేసిన వారిని భవిష్యత్తులో ప్రజలు మరింత గట్టిగా బుద్ది చెపుతారని అన్నారు.

చంద్రబాబు నాయుడు కి వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఉన్నాయని, అలిపిరి ఘటన నుంచి బయటపడ్డ తర్వాత తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారని గుర్తు చేశారు. సర్వమత సమభావంతో కూటమి ప్రభుత్వం అన్ని మతాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని, తిరుమల పవిత్రతను కాపాడుతూ భక్తులకు జవాబుదారీతనంతో ముందుకు సాగుతోందని బుచ్చి రాంప్రసాద్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *