-పెట్ స్కాన్ రాకతో లెవల్-1 స్థాయికి చేరిన గుంటూరు జీజీహెచ్
-రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి
-క్యాన్సర్ వైద్య సేవల మెరుగుకు, మరణాలు తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం కృషి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్)లోని ‘నాట్కో క్యాన్సర్ సెంటర్’ లెవల్-1 స్థాయికి చేరిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. కూటమి ప్రభుత్వం మంజూరుచేసిన రూ. 18 కోట్లతో క్యాన్సర్ వ్యాధి చికిత్సలో అత్యంత కీలకంగా వ్యవహరించే ‘పెట్ స్కాన్” సేవలను వీరువురు గురువారం గుంటూరు జీజీహెచ్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓఎన్జీసీ వారు దాతృత్వాన్ని ప్రదర్శించి రూ.30 కోట్ల విలువచేసే ‘లినాక్ మెషిన్”ను విరాళం కింద అందజేసేందుకు ముందుకొచ్చిందని వెల్లడించారు. రోగుల అవసరాల్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉన్న ఒక లినాక్ మెషిన్ కు అదనంగా రెండో లినాక్ రేడియేషన్ మెషిన్ ను అందచేసేందుకు ముందుకొచ్చిన ఓఎన్జీసీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. నాట్కో ట్రస్టు వారి దాతృత్వంతో క్యాన్సర్ చికిత్స కోసం అన్ని రకాల వసతులతో భవనాన్ని నిర్మించగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 41 కోట్లతో పేద క్యాన్సర్ రోగుల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక యంత్రాలు/ పరికరాలు సమకూర్చిందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తొలిసారి గా గుంటూరు జీజీహెచ్‌లోనే పెట్ స్కాన్ సౌకర్యం ఏర్పడిందని తెలిపారు.
రెండేళ్లలో అదనంగా 800 పడకలు
కూటమి ప్రభుత్వ పాలనలో ఇప్పటివరకు గుంటూరు జీజీహెచ్ లో అన్ని రకాలుగా కలిపి 800 పడకలు అదనంగా సమకూరాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు. రూ.140 కోట్ల మేర అభివృద్ధి పనులు జరిగాయన్నారు. గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు అత్యాధునిక ఎంసీహెచ్ బ్లాక్ ను నిర్మించారన్నారు. తన విజ్ఞప్తిని పరిగణనలోనికి తీసుకుని ఓఎన్ జీసీ వారు ‘సీఎస్ఆర్ ” కింద రూ.30 కోట్లతో లినాక్ మిషన్ ను అందజేసేందుకు ముందుకొచ్చారని తెలిపారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ పెట్ స్కాన్ వంటి అత్యాధునిక యంత్రాలు/ పరికరాల కొనుగోలు కోసం నిధులు సమకూర్చారని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ నాట్కో క్యాన్సర్ కేంద్రం అభివృద్ధిలో కేంద్ర మంత్రి చంద్రశేఖర్ చొరవ స్ఫూర్తిదాయకమన్నారు.
క్యాన్సర్ కేసులు తగ్గించేందుకు..
ప్రపంచ వ్యాప్తంగా 17.20% మరణాలు క్యాన్సర్ వ్యాధితో జరుగుతుంటే ఇందులో 9.93% మరణాలు దేశంలో జరుగుతున్నాయని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సీఎం శ్రీ చంద్రబాబు ఆదేశాల మేరకు క్యాన్సర్ మరణాల్ని తగ్గించేందుకు, ఉన్నత వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్సీడీ-04 కింద (నాన్ కమ్యూనికబుల్ డీసీజెస్) సర్వే చేస్తూ… ప్రతి ఇంటికీ వెళ్లి ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ కేసుల గుర్తింపునకు సంబంధించి స్క్రీనింగ్ చేస్తున్నామన్నారు. 2.33 కోట్ల మందికి ఓరల్, 1.21 కోట్ల మంది మహిళలకు సర్వైకల్ స్క్రీనింగ్ జరిగిందన్నారు. 70% క్యాన్సర్ జబ్బులను ముందస్తు జాగ్రత్తలతో నివారించవచ్చు అని అన్నారు.
కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రూ.120 కోట్లతో అభివృద్ధి
కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ను రూ. 120 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. రూ.90 కోట్లతో ఇప్పటికే అభివృద్ధి చర్యలు పూర్తయ్యాయన్నారు. కడప, వైజాగ్ లోని క్యాన్సర్ సెంటర్లను కాంప్రహెన్సివ్ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. మలివిడత కింద (ఫేస్-2) అనంతపురం, కాకినాడలో ప్రస్తుతం ఉన్న క్యాన్సర్ వైద్య సేవలను మరింత పటిష్టం చేసేందుకు అత్యాధునిక పరికరాలు (లినాక్, సి.టి స్టిమ్యూలేటర్, హెచ్ఎఆర్ బ్రాకీ, ఇతర ) సమకూరుస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. గుంటూరు జిజిహెచ్ తో సహా మిగిలిన అన్ని ఆసుపత్రల్లో ఓపి, ఐపి కేసులు బాగా పెరిగాయన్నారు. వైద్య సేవల పట్ల ప్రజల్లో విశ్వాసo పెరిగిందన్నారు..
వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం క్యాథలాబ్స్, ఎమ్మారైలు, సి.టి స్కాన్లు
వ్యాధుల నిర్ధారణంలో కీలకంగా వ్యవహరించే యంత్రాలు, పరికరాలను ఆసుపత్రుల్లో సమకూర్చేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఎంపిక చేసిన ప్రభుత్వాసుపత్రుల్లో మూడు క్యాథ్స్ ల్యాబ్స్, ఆరు సి.టి స్కాన్లను కూటమి ప్రభుత్వం సమకూర్చిందన్నారు. మరొకటి పిడుగురాళ్లలోని బోధనాసుపత్రిలో రాబోతుందన్నారు. ఇవికాకుండా ఏడు ఎమ్మారైలను కూడా ఆసుపత్రుల్లో ఏర్పాటుచేసినట్లు తెలిపారు. పెట్ స్కాన్ వైద్య సేవల ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, రామాజంనేయులు, వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రాధికారెడ్డి, గుంటూరు సమగ్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ రమణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News