-అంగన్వాడీ కార్యకర్తలే ప్రభుత్వ పథకాల అసలైన బలస్తంభాలు
-తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపాల్సిన ఆవశ్యకత ఉంది
-స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేయాలి
-మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ. సూర్య కుమారి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రలో చిన్నారుల చదువులు (అచ్చ) ప్రాజెక్టుతో అంగన్వాడీ కేంద్రాల్లో విద్యా విప్లవానికి నాంది పలుకుతుందని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ. సూర్య కుమారి తెలిపారు.
స్థానిక ఇరిగేషన్ కాంపౌండ్ కార్యాలయంలోని ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్ లో అచ్చ (ఆంధ్రాలో చిన్నారుల చదువులు) ప్రాజెక్ట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ. సూర్య కుమారి లాంఛనంగా పథకాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ. సూర్య కుమారి మాట్లాడుతూ… అంగన్వాడీ కార్యకర్తల సేవలను అభినందిస్తూ, వారి సవాళ్లను, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. రాష్ట్రంలో ఏ పథకం అమలు కావాలన్నా, చిట్టచివరి లబ్ధిదారునికి చేరడంలో అంగన్వాడీ కార్యకర్తలే ప్రధాన భూమిక పోషిస్తారని ఆమె కొనియాడారు. ఒక రోజు అంగన్వాడీ కార్యకర్తగా నేను అని చెపుతూ… సెక్రటరీ హోదాను పక్కన పెట్టి, ఒక రోజు అంగన్వాడీ కార్యకర్త ఎదుర్కొనే రోజువారీ కష్టాలను (పిల్లలను తీసుకురావడం, వంట చేయడం, డేటా అప్లోడ్ చేయడం, తల్లిదండ్రులను ఒప్పించడం) ఆమె కళ్ళకు కట్టినట్లు వివరించారు. మారుతున్న సామాజిక దృక్పథం… గతంలో ఆసుపత్రి ప్రసవాల పట్ల ఉన్న భయాందోళనలు ఇప్పుడు పోయి, నూరు శాతం (100%) ఆసుపత్రి ప్రసవాలు జరుగుతున్నాయని, అదే విధంగా అంగన్వాడీ ల పట్ల కూడా నమ్మకం పెరగాలని ఆకాంక్షించారు.
అంగన్వాడీ సెంటర్లో అక్కడక్కడా మౌలిక సదుపాయాల కొరత (టాయిలెట్లు, తాగునీరు) ఉన్నప్పటికీ మెరుగైన సేవలు అందిస్తున్నారని తెలిపారు. సుమారు 11-12 లక్షల మంది పిల్లలు రావాల్సి ఉండగా, ప్రస్తుతం 8-8.5 లక్షల మందే అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్నారని, ఈ సంఖ్య క్రమేపీ పెరగాలని పేర్కొన్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు (సృజన ఫౌండేషన్, క్రిప్స్ ఫౌండేషన్) విడివిడిగా కాకుండా, ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఒకే రకమైన శిక్షణను (Uniformity) అందించాలని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల ఎదుగుదలలో భాగస్వాములు కావాలని, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంటూ పిల్లలతో సమయం గడపాలని, అది వారి బాధ్యత అని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇండక్షన్ స్టవ్‌ల పంపిణీ వంటి చర్యల ద్వారా అంగన్వాడీ ల పనిభారం తగ్గుతుందని, హెల్పర్లను కూడా విద్యాబోధనలో భాగస్వాములను చేయాలని సూచించారు. అంగన్వాడీ కార్యకర్తలు కేవలం ఐసీడీఎస్ కే పరిమితం కాకుండా ఆశా, ఏఎన్ఎం, గ్రామ సర్పంచ్‌లతో కలిసి పనిచేసి బెస్ట్ అంగన్వాడీ గా నిలవాలని ముఖ్య కార్యదర్శి ఏ. సూర్యకుమారి పిలుపునిచ్చారు.
జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ మాట్లాడుతూ….అంగన్వాడీ చిన్నారుల కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలోని రెండు ఆస్పిరేషన్ బ్లాక్స్ (పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం) మినహాయించి, మిగతా చోట్ల అంగన్వాడీల పనితీరులో గణనీయమైన మార్పు కనిపిస్తోందని చెప్పారు. నీతి ఆయోగ్ సహకారంతో వెనుకబడిన బ్లాక్స్‌లో కూడా అభివృద్ధి సాధిస్తామని, చిన్నారులు మంచి పౌరులుగా ఎదిగేలా తమ టీం మొత్తం కృషి చేస్తుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు సహకరిస్తున్న గేట్స్ ఫౌండేషన్, సుజన ఫౌండేషన్ మరియు ఇతర భాగస్వాములకు జిల్లా కలెక్టర్ డా లక్షిశా కృతజ్ఞతలు తెలియజేశారు.
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎమ్. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ…. రాష్ట్రవ్యాప్తంగా 55,746 అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం, ముందస్తు బాల్య విద్య (Early Childhood Education) వంటి సేవలు అందుతున్నాయన్నారు. 1975 లో ఐసిడిఎస్ (ICDS) ప్రారంభమైనప్పుడు కేవలం పోషకాహారం అందించడమే లక్ష్యంగా ఉండేదని, ముఖ్యంగా రక్తహీనత ఉన్న మహిళలకు, పోషకాహార లోపం ఉన్న పిల్లలకు ప్రాధాన్యత ఇచ్చేవారన్నారు. చిన్నారుల్లో 6 ఏళ్ల లోపు 85% మెదడు అభివృద్ధి చెందుతుందని అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. అందుకే శారీరక,మానసిక ఎదుగుదలకు ఈ వయస్సు చాలా కీలకమని ప్రభుత్వం గుర్తించిందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అంగన్వాడీల ద్వారా అర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ (ECCE) ను బలోపేతం చేస్తున్నామన్నారు.’అచ్చ’ (ఆంధ్రాలో చిన్నారుల చదువు) ప్రాజెక్ట్ ఇది కేవలం ఒక ప్రోగ్రామ్ మాత్రమే కాదని, ఒక మార్పుకు నాంది (Transformative Initiative) అని అన్నారు. అంగన్వాడీల్లో విద్య నాణ్యతను పెంచడం, కార్యకర్తల సామర్థ్యాన్ని పెంపొందించడం ఆటపాటల ద్వారా పిల్లల్లో చదువుపై ఆసక్తి కలిగించేలా ఈ ప్రాజెక్ట్ రూపొందించబడిందన్నారు. కుప్పంలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ఆర్థికంగా, సాంకేతికంగా సహకరిస్తున్న అన్ని సంస్థలకు, ప్రతినిధులకు డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.
క్రిస్ప్ (CRISP) ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి మాజీ ఐఏఎస్ అధికారి రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. క్రిస్ప్ ఫౌండేషన్ ద్వారా దేశంలో 14 రాష్ట్రాల్లో విద్యా సంబంధ కార్యక్రమాల్లో పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కూడా అంగన్వాడీ కేంద్రాల్లోని ప్రీప్రైమరీ లెవల్ విద్యార్ధులకు సంబంధించి సహకారం అందిస్తున్నామన్నారు.
ముందుగా అచ్చ ప్రాజెక్ట్ కు సంబంధించిన లోగో, బ్రోచర్స్ ను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో ఐసీడీఎస్ జాయింట్ డైరెక్టర్ కె. ప్రవీణ, ఆర్జేడీ పి.సుజాత రాణి, ఏడీ స్వరాజ్య లక్ష్మి, ఐసీడీఎస్ డైరెక్టరేట్ కు చెందిన ఉదయలక్ష్మి, రాజా రాణి, ఎన్టీఆర్ జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రుక్సానా భేగం, నోడల్ ఆఫీసర్ సీహెచ్. సాయి గీత, క్రిస్ప్ (CRISP) ఫౌండేషన్ వ్యవస్థాపకులు కే. సంధ్యా రాణి, సుజనా ఫౌండేషన్ కు చెందిన శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన సీడీపీవోలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, వివిధ ఎన్జీవో సంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News