-నగరంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి అర్జీలు స్వీకరించిన మంత్రి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమల విస్తరణ, ఉద్యోగాల కల్పన, ప్రజా సంక్షేమం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
శుక్రవారం స్థానిక బృందావన థియేటర్ పక్కన గల టీడీపి కార్యాలయంలో మంత్రి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాదర్భార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను ఓపిగ్గా ఆలకించిన ఆయన వారి సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకుడు నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, రాబోయే కాలంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తూ పరిశ్రమలు, మౌలిక వసతుల నిర్మాణం వేగంగా కొనసాగుతోందన్నారు.
ఉత్తరాంధ్రలో పోర్టులు, హైవేలు, కొత్త ఎయిర్‌పోర్టులు అభివృద్ధి చెందుతున్నాయని, ఇటీవల అర్సెలర్ మిట్టల్, గూగుల్ డేటా సెంటర్స్, రేర్ ఎర్త్ మినరల్స్‌కు సంబంధించిన ప్రాజెక్టులు అక్కడికి రానున్నాయని చెప్పారు. అలాగే ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి చెందిన ప్రాజెక్టులు రాబోతున్నాయని వెల్లడించారు.
అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు పనులు వేగంగా సాగుతున్నాయని, క్వాంటం కంప్యూటింగ్ రంగంలో కూడా కీలక ప్రణాళికలు అమలవుతున్నాయని తెలిపారు. ప్రకాశం జిల్లాలో కంప్రెస్డ్ గ్యాస్ పరిశ్రమలు, రాయలసీమలో హార్టికల్చర్, ఆటోమొబైల్ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కియా, అపోలో టైర్స్ వంటి సంస్థలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతున్నాయని అన్నారు.
పుట్టపర్తిలో లక్ష కోట్ల పెట్టుబడులతో యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు భూమిపూజ జరగడం రాష్ట్రానికి గర్వకారణమని, కేవలం 15 రోజుల్లో అనుమతులు మంజూరు కావడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని తెలిపారు. అలాగే శ్రీ సిటీ, నెల్లూరు పరిసర ప్రాంతాలు, గన్నవరం, మల్లవల్లి ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు వేగంగా ఏర్పడుతున్నాయని చెప్పారు.
మచిలీపట్నం పోర్టు, ఫిషింగ్ హార్బర్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, పామర్రు, గుడివాడలో ఎంఎస్ఎంఈ పార్కులకు భూముల కేటాయింపులు జరుగుతున్నాయని తెలిపారు.
మచిలీపట్నం–రేపల్లె రైల్వే మార్గం ప్రాజెక్టు విషయమై మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా మ్యాప్ పరిశీలించి ప్రాజెక్టుపై చొరవ చూపారని గుర్తు చేశారు. సుమారు రూ.2800 కోట్ల వ్యయంతో తొలి దశలో రేపల్లె వరకు ట్రాక్ ప్రతిపాదన ముందుకు సాగుతుండటం ఆనందదాయకమన్నారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి కానుందని తెలిపారు. ఈ రైల్వే లైన్ మచిలీపట్నం, అవనిగడ్డ, రేపల్లె ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. భవిష్యత్తులో దీనిని బాపట్ల, గుంటూరు మీదుగా హైదరాబాద్ వరకు విస్తరించే ప్రతిపాదనలు ఉన్నాయని వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, ఆర్థిక అనిశ్చితి దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. దేశ భద్రత, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రజలు పొదుపు చర్యలు పాటించాలని మంత్రి సూచించారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించి సైకిళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించాలని కోరారు. వంటనూనెల వినియోగాన్ని తగ్గించడంతో పాటు ఎలక్ట్రిక్ స్టౌలు, కుక్కర్లు వాడాలని సూచించారు. బంగారం కొనుగోళ్లలో కూడా నియంత్రణ పాటించాలని అన్నారు.
ప్రతి ఇంటిపై సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. సోలార్ వినియోగం పెరిగితే విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు థర్మల్ స్టేషన్లపై ఒత్తిడి కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.
“నా దేశం – నా భద్రత” అనే భావనతో ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, సహాయ కమిషనర్ గోపాలరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, కూటమి నాయకులు లోగిశెట్టి వెంకటస్వామి, ఇలియాజ్ పాషా, తలారి సోమశేఖర్, కే సుశీల, సుబ్రహ్మణ్యం, పలు మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News