-నగర అభివృద్ధిపై అధికారులతో సమీక్ష
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం నగర సమగ్ర అభివృద్ధి, సుందరీకరణే ధ్యేయంగా పని చేయాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర మంత్రి శుక్రవారం మధ్యాహ్నం మచిలీపట్నం నగరంలోని రహదారులు భవనాలు శాఖ అతిథి గృహంలో జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్‌తో కలిసి నగర అభివృద్ధిపై పలు శాఖల అధికారులతో సమీక్షించారు.
సమావేశంలో మచిలీపట్నం నగర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రి అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా నగరంలోని డంపింగ్ యార్డ్ నుంచి చెత్త తరలింపు పనుల పురోగతి, నగర పారిశుద్ధ్య నిర్వహణ, రహదారుల అనుసంధానం అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ విస్తరణ, మురుగు నీటి సమస్యల పరిష్కారం, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నగర ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. మచిలీపట్నం వంటి చారిత్రక ప్రాధాన్యత కలిగిన నగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువుల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
నగరంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పారిశుద్ధ్య నిర్వహణపై మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. డంపింగ్ యార్డ్ నుండి పేరుకుపోయిన చెత్తను తరలించే ప్రక్రియ ఏ మేరకు పురోగతిలో ఉందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా చెత్త నిల్వలు లేకుండా త్వరితగతిన తరలింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, చెత్త సేకరణ, తరలింపు ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అలాగే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ పనులను వేగవంతం చేసి నీటి నిల్వ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మచిలీపట్నం నగర సుందరీకరణకు అవసరమైన ప్రతి చర్యను ప్రభుత్వం చేపడుతోందని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
సమావేశంలో నగర కమిషనర్ బాపిరాజు, సహాయ కమిషనర్ గోపాలరావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్డి సుబ్బారావు, బందరు ఆర్టీవో కే సాంబశివరావు, తహసిల్దార్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News