-అన్ని పంటలకూ ఉచిత బీమా వర్తింపజేయాలి!
-వాతావరణ ఆధారిత బీమా గడువును ఆగస్టు 31 వరకు పొడిగించాలి!
-ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని రైతాంగ ప్రయోజనాలను కాపాడేందుకు, అన్ని పంటలకు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని మరియు రైతుల వాటా బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడలోని దాసరి భవన్లో నేడు రైతుసంఘ రాష్ట్ర సమితి సమావేశం జి. ఈశ్వరయ్య గారి అధ్యక్షతన జరిగింది. సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆగస్టు 17వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజన్ కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరల స్థిరీకరణ నిధి కింద రూ.1000 కోట్ల కేటాయించి ప్రభుత్వ ఏజెన్సీ ద్వారానే కిలో పొగాకును సగటు ధర రూ. 250,జంగారెడ్డిగూడెం ఏరియాలోని పొగాకును రూ.300లకు తగ్గకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన రొయ్యల మేతల ధరలు పూర్తిగా తగ్గించాలని, రొయ్యలకు మద్దతు ధర ప్రకటించి చట్టబద్ధత కల్పించాలని కోరారు
జూన్ 1 నుండి నేటి వరకు రాష్ట్రంలో సరాసరి వర్షపాతం మైనస్ 45.1% లోటుగా నమోదైందని, ఇది వర్షాధార పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఈశ్వరయ్య పేర్కొన్నారు. రాష్ట్రంలోని 4 జిల్లాల్లో మైనస్ 60% కంటే ఎక్కువ తీవ్ర లోటు ఉండగా, మిగిలిన అన్ని జిల్లాల్లోనూ మైనస్ 20% నుండి మైనస్ 59% వరకు లోటు వర్షపాతం నమోదైందన్నారు. వ్యవసాయ శాఖ నివేదికల ప్రకారం.. ఈ ఖరీఫ్ సాధారణ సాగులో ఇప్పటివరకు కేవలం 12% మాత్రమే సాగు జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
రాష్ట్రంలో వరి తర్వాత అత్యధికంగా సాగు అయ్యే ప్రత్తి, వేరుశనగ పంటలు పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడి ఉన్నాయి. ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు లేక విత్తనాలు వేయడం ఆలస్యమైందని, ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాల్సి వస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతానికి ఈ పంటల వాతావరణ బీమా ప్రీమియం చెల్లింపు గడువు జులై 15తో ముగుస్తుండటంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉందన్నారు.
దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు చెబుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రైతుల మానసిక ఒత్తిడిని, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పంటల బీమా పథకం,వాతావరణ ఆధారిత పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువును ఆగస్టు 31 వరకు పొడిగించాలని కోరారు.
ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి బీమా గడువును పొడిగించేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆగస్టు 17న జరగబోయే డివిజన్ స్థాయి ఆందోళనల్లో రైతులంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని గుజ్జుల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతుసంఘ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎ.కాటమయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం ఉపాధ్యక్షులు ఏ. రామానాయుడు, మల్నీడి యలమందారావు, వి.హనుమారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు డేగా ప్రభకర్, చిరుతల మల్లికార్జున, కె. జగన్నాథం, ఉలవలపూడి రాము, జాతీయ సమితి సభ్యురాలు గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News