-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యర్థాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం కీలకం అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా మహాత్మా గాంధీ రోడ్, వేముల శ్యామలాదేవి రోడ్, ఏలూరు రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, నూజివీడు రోడ్, అజిత్ సింగ్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల సేకరణ, రహదారుల పరిశుభ్రత, వ్యర్థాల తరలింపు పరిశీలించారు.
అనంతరం అజిత్ సింగ్ నగర్లోని గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ను సందర్శించి వివిధ ప్రాంతాల నుంచి సేకరించి తీసుకొచ్చిన వ్యర్థాల వేరు చేసే ప్రక్రియ, తరలింపు విధానం, పారిశుద్ధ్య నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడంతో పాటు వాటిని సకాలంలో జిందల్ కు తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజల సహకారం లేకుండా ఘన వ్యర్థాల నిర్వహణలో ఆశించిన ఫలితాలు సాధించడం సాధ్యం కాదని కమిషనర్ పేర్కొన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్–2026 ప్రకారం ప్రతి ఇంటి వద్దనే వ్యర్థాలను నాలుగు రకాలుగా వేరు చేసి అందించాలని సూచించారు. తడి వ్యర్థాలు, పొడి వ్యర్థాలు, గృహ ప్రమాదకర వ్యర్థాలు, శానిటరీ వ్యర్థాలను వేర్వేరుగా నిర్దేశించిన చెత్తబుట్టల్లో వేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రతి చెత్తబుట్టలో ఏ రకమైన వ్యర్థాలు వేయాలో ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించే బాధ్యత సానిటరీ ఇన్స్పెక్టర్లదేనని పేర్కొంటూ, ప్రతి వార్డులో ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించాలని, అవసరమైన చోట సమాచార బోర్డులు, స్టిక్కర్లు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
వ్యర్థాలను శాస్త్రీయంగా వేరు చేయడం ద్వారా వాటి నుంచి పునర్వినియోగానికి అనువైన పదార్థాలను తిరిగి వినియోగించుకోవచ్చని, సేంద్రియ వ్యర్థాల నుంచి కంపోస్ట్, ఇతర ఉపయోగకర ఉత్పత్తులను తయారు చేసే ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎక్సెల్ ప్లాంట్లో వ్యర్థాల నుంచి సంపద (Waste to Wealth) సృష్టించే కార్యక్రమాలను ప్రతిరోజూ అధికారులు పర్యవేక్షిస్తూ, నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలంటే ప్రజలు, పారిశుద్ధ్య సిబ్బంది, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు.
తదుపరి అయోధ్య నగర్ అన్న క్యాంటీన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. త్రాగునీటి వాడకనీటి సరఫరాల ఎటువంటి అంతరాయం ఉండరాదని, పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని ఆహారంలో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News