-భారీ పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలు, ఎగుమతుల విస్తరణకు ఏపీ పెవిలియన్ వేదిక
-చేనేత మరియు జౌళి శాఖ కమిషనర్ జి. రేఖా రాణి
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశపు అతిపెద్ద అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శన భారత్ టెక్స్–2026లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెవిలియన్ విశేష ఆదరణ పొందుతోంది. జూలై 14 నుంచి 17 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఈ ప్రదర్శనలో రాష్ట్ర చేనేత, జౌళి, దుస్తుల తయారీ, ఓడీఓపీ (ODOP), జీఐ ట్యాగ్ ఉత్పత్తులు, పెట్టుబడి అవకాశాలు, ఎగుమతి సామర్థ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా ప్రదర్శిస్తోంది.
చేనేత, జౌళి శాఖ కమిషనర్ జి. రేఖారాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌ను దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సందర్శించి రాష్ట్ర జౌళి రంగ సామర్థ్యాన్ని అభినందించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బైరెడ్డి జయ నాగేశ్వర రెడ్డి టెక్స్టైల్ పార్కులు, చేనేత కార్మికులకు కల్పిస్తున్న సదుపాయాలను ప్రశంసించడంతో పాటు ఎమ్మిగనూరు ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండ్ గుర్తింపు కల్పించే అంశంపై ప్రతినిధులతో చర్చించారు.
రాజ్యసభ సభ్యుడు వి. విజయేంద్ర ప్రసాద్ భారతీయ చేనేత ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణను ప్రస్తావిస్తూ, వర్చువల్ రియాలిటీ (VR) వంటి ఆధునిక సాంకేతికత ద్వారా ఆంధ్రప్రదేశ్ చేనేత ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు మరింత చేరువ చేయాల్సిన అవసరాన్ని సూచించారు.
ఫ్యాబిండియా, ఏఈపీసీ (AEPC), ఏసీడీటీ (ACDT), అరవింద్ లిమిటెడ్, ట్రైడెంట్ గ్రూప్, హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (HEPC), కాంచీపురం సిల్క్ పార్క్, వజీర్ అడ్వైజర్స్ తదితర ప్రముఖ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో సోర్సింగ్, పెట్టుబడులు, మార్కెట్ అనుసంధానాలు, ఎగుమతి అవకాశాలపై ఆసక్తి వ్యక్తం చేశాయి. ఉప్పాడ జాందాని, వెంకటగిరి చీరలు వంటి సంప్రదాయ చేనేత ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు మరింత విస్తరించే అంశంపై కూడా చర్చలు జరిగాయి.
ఈ సందర్భంగా విశాఖపట్నంలో రూ.4,000 కోట్ల పెట్టుబడితో సుస్థిర వస్త్ర రీసైక్లింగ్ యూనిట్, రూ.100 కోట్ల పెట్టుబడితో వస్త్ర తయారీ యూనిట్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 3,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
భారత ప్రభుత్వ చేనేత అభివృద్ధి కమిషనర్ డాక్టర్ ఎం. బీనా, కర్ణాటక ప్రభుత్వ ఎంఎస్ఎంఈ, గనులు, జౌళి, చక్కెర శాఖ కార్యదర్శి రోహిణి సింధూరి, కర్ణాటక జౌళి అభివృద్ధి కమిషనర్ బసవరాజు, తదితరులు పెవిలియన్‌ను సందర్శించి రాష్ట్ర జౌళి, చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను అభినందించారు.
పట్టు ఉత్పత్తిలో దేశంలో రెండో స్థానం, పత్తి ఉత్పత్తిలో ఆరో స్థానం, జనపనార ఉత్పత్తిలో ఏడో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 15 వేలకుపైగా ఎంఎస్ఎంఈలు, 140కు పైగా పెద్ద వస్త్ర పరిశ్రమలు, 35 వేలకుపైగా పవర్‌లూమ్‌లు, 36 లక్షల స్పిండిల్స్‌తో బలమైన జౌళి పరిశ్రమ వ్యవస్థ ఉందని అధికారులు తెలిపారు. విధానపరమైన ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఎగుమతి విస్తరణ, అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా రాష్ట్రాన్ని దేశంలోని అగ్రగామి వస్త్ర, చేనేత కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.
Prajavartha Online Telugu News