Breaking News

సీబీజి పరిశ్రమ కారణంగా ఎటువంటి సమస్యలు ఉండవు

-నూజివీడు నియోజకవర్గంలో అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి
-పరిశ్రమ ఏర్పాటు కాకుండా అసత్యపు ప్రచారాలతో బురద చల్లుతున్నాయి.అనవసర సమస్యలు సృష్టిస్తున్నారు
-పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి

ఏలూరు/అగిరిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
అగిరిపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు చేసే ప్రయత్నాలకు ప్రతిపక్షాలు అబద్దపు ప్రచారాలతో బురదచల్లుతూ వివాదాస్పదం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి చెప్పారు. అగిరిపల్లి మండలం తోటపల్లి లో బుధవారం గ్రామసభలో పాల్గొని ప్రజల సమస్యలను మంత్రి తెలుసుకున్నారు. అనంతరం పాత్రికేయులతో మంత్రి పార్థసారధి మాట్లాడుతూ ఏ ప్రాంతమైన అభివృద్ధి కావాలంటే పరిశ్రమల ఏర్పాటుద్వారా ఆ ప్రాంతం అభివృద్ధి చెందడంతోపాటు , ఆ ప్రాంతంలోని ఎంతో మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ క్లీన్, గ్రీన్ ఎనర్జీ విధానం ద్వారా అగిరిపల్లి మండలంలో 120 కోట్ల రూపాయలతో నితిన్ కృష్ణ కన్స్ట్రక్షన్స్ కంపెనీ కంప్రెస్డ్ బయో గ్యాస్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. 39 కోట్ల రూపాయలు ప్రమోటర్ల పెట్టుబడి, మిగిలిన మొత్తం బ్యాంకుల నుండి రుణంతో ఏర్పాటు చేస్తున్నారన్నారు. నూజివీడు మండలం తుక్కులూరు లో కూడా 200 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇటువంటి కర్మాగారం ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఈ కర్మాగారాల ఏర్పాటు ప్రధాన ఉద్దేశ్యం నూజివీడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పధంలో తీసుకువెళ్లడంతోపాటు ఈ ప్రాంతంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమన్నారు. రిలయన్స్ కంపెనీ 65 వేల కోట్ల రూపాయలతో దేశవ్యాప్తంగా ఇటువంటి కంప్రెస్డ్ బయో గ్యాస్ యూనిట్లను 500 యూనిట్లను ఏర్పాటుచేస్తున్నదన్నారు. కానీ ఎక్కడా వారి సమస్యలను అడిగి తెలుసుకునేందుకు ప్రజలతో గ్రామ సభలు నిర్వహించలేదని, కానీ తన కుమారుడు సామజిక బాధ్యతతో గ్రామ సభ నిర్వహించి ప్రజలకు పరిశ్రమ ఏర్పాటు లాభాలను తెలియజేశాడన్నారు. అంతేకాక పేరు పీ4 కార్యక్రమం కింద పలుగ్రామాలలో పేదల అభివృద్ధికి కుట్టు మిషన్లు, పాడి పశువులను అందించారన్నారు. పరిశ్రమలు వస్తే వాటి సిఎస్ ఆర్ నిధుల ద్వారా ఆయా ప్రాంతాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చన్నారు. కానీ అభివృద్ధిని అడ్డుకునే ప్రతిపక్షం నూజివీడు అభివృద్ధిని అడ్డుకునేందుకు కంప్రెస్డ్ బయో గ్యాస్ యూనిట్ల ఏర్పాటు కారణంగా ప్రజలకు సమస్యలు వస్తాయని, వంటి ఎన్నో అసత్యాలను ప్రచారం చేస్తున్నదన్నారు. ప్రజలను రెచ్చగొట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. సిబిజి నేపియర్ గ్యాస్, గడ్డి, మొక్కజొన్న వ్యర్థాలు, ఆవు పేడ వంటివి వినియోగిస్తారని, వీటి కారణంగా ప్రజలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవన్నారు. అగిరిపల్లి ప్రాంతాల్లోని వారిని పెద్దాపురం, కంచికిచర్లలో సిబిజి ప్లాంట్ నిర్వహణను పరిశీలించేందుకు తీసుకువెళ్లామని, వారు పరిశీలించి ఎటువంటి దుర్వాసన లేదని పరిశీలించారన్నారు. సిబిజి పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూమిని మంత్రివర్గ సమావేశంలో మంజూరు చేసారని, అప్పటివరకు తాను ఆ స్థలాన్ని పరిశీలించలేదన్నారు. తనకు కేటాయించిన భూమిని తప్ప ఒక్క ఎకరం కూడా తీసుకోలేదన్నారు. సిబిజి కంపెనీకి కేటాయించిన భూమిలో భూమిని తవ్వి భూమిని చదును చేస్తున్నామన్నారు. ప్రతిపక్షానికి చెందిన కొందరు తమ భూములు ఉన్నాయని తెలియజేస్తున్నారని, గత ప్రభుత్వ సమయంలో మాజీ ఎమ్మెల్యే అనుచరుడు బాబూరావుకు అక్రమ మట్టి తరలింపుపై ఖనిజాల శాఖ విచారణ చేసి 3 కోట్ల రూపాయలు పెనాల్టీ విధించిందన్నారు. విచారణలో గత ప్రభుత్వ సమయంలో ఆనాటి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మట్టి అక్రమ రవాణా చేసానని బాబురావు అధికారుల విచారణలో వెల్లడించారని ఈ సందర్భంగా మంత్రి గుర్తిచేసారు. అమ్మవారిగూడెంలో గెలాక్సీ మినరల్స్ కంపెనీపై 5గురిపై కేసులు కూడా నమోదు చేశారన్నారు. గత ప్రభుత్వ సమయంలో మాజీ ఎమ్మెల్యే 27 ఎకరాలకు అనుమతి తీసుకుని వేలాది ఎకరాలలో మట్టిని అక్రమంగా తవ్వి, తరలించారన్నారు. ఇందుకు సంబంధించి సాటిలైట్ చిత్రాలను మంత్రి పాత్రికేయులు చూపుతూ వీటిపై విచారణ చేసి ఆనాటి ప్రకృతి విధ్వంసానికి కారణమైన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. పరిశ్రమ ఏర్పాటుకు ఒక ప్రదేశంలో చర్చ్ తొలగించాల్సి వచ్చినప్పుడు చర్చ్ పెద్దలతో మాట్లాడి వేరే ప్రదేశంలో పెద్దస్థాయిలో నిర్మిస్తామని కోరామని, కానీ వారు అదే ప్రదేశంలో చర్చ్ ఉండాలని కోరడంతో వారి విన్నపాన్ని మన్నించామన్నారు. సిబిజి పరిశ్రమ ఏర్పాటులో అగిరిపల్లి ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తానన్నారు. అగిరిపల్లి ప్రాంత ప్రజలు తమకు అభివృద్ధి వద్దు, తమ ప్రాంత యువత ఉద్యోగ అవకాశాలు వద్దు అని తీర్మానం చేస్తే తన కుమారుడు నితిన్ కృష్ణ కనస్ట్రక్షన్స్ కంపెనీ సీబీజి కంపెనీని అక్కడ నుండి వేరే ప్రాంతంలో ఏర్పాటుచేసేందుకు తాము సిద్ధమన్నారు.

ఈ సందర్భంగా అగిరిపల్లి ఇవలాంజికల్ మినిస్ట్రీస్ చర్చ్ ఫాస్టర్ పెదబాబు మాట్లాడుతూ సిబిజి పరిశ్రమ ఏర్పాటుకు మంజూరు చేసిన భూమిలో తమ చర్చ్ లో కొంతభాగం ఉండడంతో వేరే ప్రదేశంలో పెద్ద చర్చ్ నిర్మిస్తామని మంత్రి పార్థసారథి కోరారని, కానీ తమవారితో చర్చించి తాము ఒప్పుకోలేదన్నారు. దాంతో మంత్రి వర్యులు తమ మాటను మన్నించారని, అంతేకాక మంచి మనసుతో ప్రస్తుతం ఉన్న చర్చ్ అభివృద్ధికి సహకరిస్తానని చెప్పారన్నారు. ఈ విషయాన్నీ బహిరంగంగా తెలియజేసినప్పటికీ కొంతమంది వ్యక్తులు, పత్రికల వారు కావాలని వివాదాస్పదం చేస్తున్నారన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *