-ప్రాజెక్టు పూర్తయ్యే వరకు నిధుల కొరత లేదు
-రాయలసీమకు శాశ్వత నీటి భద్రత..
-ఉత్తరాంధ్రకు తాగునీటి వరం:
-మంత్రి సత్యకుమార్
పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పోలవరం జాతీయ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్తును మలిచే ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల విషయంలో ఎలాంటి వెనుకంజ ఉండదని తెలిపారు. బీజేపీ నాయకులతో కలిసి గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి ప్రధాన డ్యాం, కొత్త డయాఫ్రం వాల్, కాఫర్‌డ్యాం, ఎడమ కాలువ, టన్నెల్లు, జలవిద్యుత్ కేంద్ర నిర్మాణ పనులను పరిశీలించారు. జలవనరుల శాఖ అధికారులతో నిర్మాణ పురోగతిని సమీక్షించి, మిగిలిన పనులపై ఆరా తీశారు.
జాతీయ ప్రాజెక్టుగా బీజేపీ కృషి
అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి… 1941లోనే పోలవరం ఆలోచన వచ్చినప్పటికీ దశాబ్దాలపాటు నిర్మాణం ముందుకు సాగలేదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎం. వెంకయ్యనాయుడు, ఎల్.కే. అద్వానీ, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ చేసిన కృషి వల్లే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా దక్కిందని గుర్తు చేశారు.
మోదీతో పూర్తి ఆర్థిక భరోసా
ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం నిర్మాణానికి ఇప్పటివరకు రూ.20,750 కోట్లకు పైగా విడుదల చేశారని తెలిపారు. గతంలో కేంద్ర–రాష్ట్ర భాగస్వామ్యంతో కొనసాగిన నిధుల విధానాన్ని మార్చి, ప్రాజెక్టు పూర్తి వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందన్నారు. దీంతో నిర్మాణానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. గత 12 ఏళ్లలో ప్రాజెక్టు పనులు సుమారు 90 శాతం పూర్తయ్యాయని వివరించారు.
మళ్లీ పుంజుకున్న నిర్మాణం
2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తొలి ఎన్డీయే ప్రభుత్వంలో పోలవరం పనులు వేగంగా సాగాయని, 2019–24 మధ్య ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించడంతో నిర్మాణం తిరిగి వేగం అందుకుందని పేర్కొన్నారు.
రాయలసీమకు జీవనాడి
పోలవరం పూర్తయితే గోదావరి జిల్లాలకే పరిమితం కాకుండా ఉత్తరాంధ్రకు తాగునీరు, పరిశ్రమలకు అవసరమైన నీరు అందుతుందని మంత్రి తెలిపారు. గోదావరి నుంచి 80 టీఎంసీల నీటిని కృష్ణా పరీవాహక ప్రాంతానికి మళ్లించడం ద్వారా శ్రీశైలం జలాశయంలో నీటి లభ్యత పెరిగి, కరవుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాయలసీమకు శాశ్వత నీటి భద్రత లభిస్తుందని వివరించారు.
పర్యాటకంగా తీర్చిదిద్దుతాం
పోలవరం నిర్మాణంతో పాటు ప్రాజెక్టు పరిసరాలను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రత్యేక నిధులను కేంద్ర ప్రభుత్వం, బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి పోలవరం కీలక ప్రాజెక్టుగా నిలుస్తుందని, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో త్వరలోనే పూర్తిచేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News