-రాయలసీమకు శాశ్వత నీటి భద్రతకు ఇదే కీలకం: మంత్రి సత్యకుమార్
పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పోలవరం జాతీయ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి *సత్యకుమార్ యాదవ్* స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి దిశానిర్దేశం చేసే ఈ ప్రాజెక్టు నిర్మాణం వేగంగా సాగుతోందని, మిగిలిన పనులకూ అవసరమైన నిధులు సమకూర్చేందుకు కేంద్రం వెనుకాడబోదని చెప్పారు.
బీజేపీ నేతలతో కలిసి గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి.. లెఫ్ట్ కెనాల్, టన్నెల్లు, ప్రధాన డ్యాం, కొత్త డయాఫ్రం వాల్, కాఫర్ డ్యాం, తుది దశలో ఉన్న జలవిద్యుత్ కేంద్ర నిర్మాణ పనులను పరిశీలించారు. జలవనరుల శాఖ అధికారులు నిర్మాణ పురోగతిని వివరించగా, పనుల వేగం, మిగిలిన దశలపై మంత్రి ఆరా తీశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ… పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి పూర్తి వ్యయాన్ని కేంద్రం భరించే నిర్ణయం ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్నారని గుర్తు చేశారు. ఇప్పటివరకు రూ.20,750 కోట్లకు పైగా నిధులు విడుదల చేశారని, అవసరమైతే మరిన్ని నిధులు కూడా కేంద్రం అందిస్తుందని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్మాణం నిర్లక్ష్యానికి గురైందని, కేంద్రం విడుదల చేసిన నిధుల వినియోగంలోనూ తీవ్ర జాప్యం చోటుచేసుకుందని మంత్రి విమర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించడంతో పనులు మళ్లీ వేగం పుంజుకున్నాయని పేర్కొన్నారు.
“పోలవరం పూర్తయితే ప్రయోజనం గోదావరి జిల్లాలకే పరిమితం కాదు. శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను మరింత సమర్థంగా రాయలసీమకు తరలించే అవకాశం లభిస్తుంది. దశాబ్దాలుగా కరవుతో పోరాడుతున్న రాయలసీమకు ఇది శాశ్వత నీటి భద్రత కల్పించే ప్రాజెక్టు” అని మంత్రి సత్యకుమార్ అన్నారు.
పోలవరం నిర్మాణంతో పాటు ప్రాజెక్టు పరిసరాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక నిధుల అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి పోలవరం కీలకమైన ప్రాజెక్టు అని, దాని పూర్తి కోసం కేంద్రం-రాష్ట్రం సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News