Breaking News

దేశానికే దిక్సూచిగా ‘స్వర్ణాంధ్ర పర్యాటక విజన్ 2047’:మంత్రి కందుల దుర్గేష్

-ఢిల్లీ ‘ఫెయిత్’ కాన్ క్లేవ్-2026లో ఏపీ టూరిజం వైభవం..జాతీయ వేదికపై ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రగతి ప్రస్థానాన్ని చాటిచెప్పిన పర్యాటక మంత్రి కందుల దుర్గేష్
-భారత దేశంలో అన్ని అద్భుతాలు ఏపీలో కొలువయ్యాయి అంటూ ఫెయిత్ కాన్ క్లేవ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆంధ్రప్రదేశ్.. జీడీపీ వృద్ధి, ఉద్యోగాలే లక్ష్యంగా మంత్రి కందుల దుర్గేష్ రోడ్ మ్యాప్ ప్రకటన
-పెట్టుబడుల స్వర్గధామంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు రండి.. భాగస్వామ్యాలు నెలకొల్పండి.. ప్యాకేజీలు రూపొందించండి.. పెట్టుబడులు పెట్టండి.. మీతో కలిసి ప్రయాణించేందుకు ఏపీ టూరిజం సిద్ధంగా ఉందని ఇన్వెస్టర్లకు మంత్రి దుర్గేష్ ఆహ్వానం

న్యూఢిల్లీ/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు అన్నట్లుగా.. “పర్యాటకమే భవిష్యత్ ప్రగతి చక్రం” అని నమ్ముతూ ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. జులై 16,17 తేదీల్లో న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్ లో ఇన్ క్రెడిబుల్ ఇండియా..ఇన్ వ్యాలబుల్ ఎకనామిక్స్ అంశంపై (Incredible India: Invaluable Economics) అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న “ఫెయిత్ (FAITH)టూరిజం కాన్ క్లేవ్ 2026” సదస్సులో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని ప్రసంగించారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధు,జమ్మూ అండ్ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా,అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక, విద్యా, గ్రామీణ పనులు, పార్లమెంటరీ వ్యవహారాలు మరియు గ్రంథాలయాల శాఖ మంత్రి పాసాంగ్ దోర్జీ సోనా, కేంద్ర పర్యాటక శాఖ అదనపు కార్యదర్శి & డైరెక్టర్ జనరల్ సుమన్ బిల్లా (IAS) మరియు జాతీయ, అంతర్జాతీయ పర్యాటక రంగ విధాన నిర్ణేతలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హాజరైన ఈ ఉన్నత స్థాయి వేదికపై ఆంధ్రప్రదేశ్ అద్భుత పర్యాటక సామర్థ్యాన్ని, భవిష్యత్ కార్యాచరణను ఆయన అత్యంత సమర్థవంతంగా ప్రదర్శించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో రూపొందించిన ‘స్వర్ణాంధ్ర పర్యాటక విజన్ 2047’ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ పర్యాటక పటంలో అగ్రగామిగా నిలపడమే తమ సంకల్పమని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న ‘వికసిత్ భారత్’ లక్ష్యాలకు అనుగుణంగా, స్థానిక సమాజాల భాగస్వామ్యంతో పర్యావరణహిత, సుస్థిర పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక వైవిధ్యాన్ని వివరిస్తూ, భారతదేశంలోని అన్ని అద్భుతాలు ఏపీలో కొలువై ఉన్నాయని (“ఎవ్రీ బిట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్”)పేర్కొన్నారు.

1,054 కి.మీ.లతో దేశంలోనే 3వ అతిపెద్ద సముద్ర తీరం, 283 బీచ్ లున్నాయని,తిరుమల సహా 80,000కు పైగా దివ్య ఆలయాలు తమ సొంతమని పేర్కొన్నారు. అంతేగాక 13 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, 3 జాతీయ పార్కులు, దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్, విస్తారమైన బ్యాక్ వాటర్స్ (దేశంలో 2వ స్థానం) కలిగిన రాష్ట్రం ఏపీ అని తెలిపారు.లేపాక్షి, తిరుమల కొండలు, ఎర్రమట్టి దిబ్బలు వంటి ప్రాంతాలు యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్నాయని వివరించారు. ప్రధానంగా ఆధ్యాత్మిక (తిరుపతి, అహోబిలం, శ్రీశైలం, సింహాచలం), బౌద్ధ (అమరావతి, నాగార్జునకొండ, తొట్ల కొండ, బొజ్జన కొండ), వారసత్వ (లేపాక్షి, గండికోట, ఉండవల్లి గుహలు, చంద్రగిరి కోట), ఎకో టూరిజం (అరకు, మారేడుమిల్లి, కొండకర్ల ఆవ,పులికాట్ సరస్సు), అరుదైన రుచులు (పూతరేకులు, చేపల పులుసు, రాగి సంగటి, బొంగు చికెన్), కళలు-చేనేత (కొండపల్లి బొమ్మలు, కలంకారీ, నిమ్మలకుంట తోలుబొమ్మలాట,కోనసీమ ప్రభల తీర్థం), సాహస క్రీడల్లో భాగంగా రాక్ క్లైంబింగ్, స్కూబా డైవింగ్, సర్పింగ్, బౌల్డరింగ్, బీచ్ టూరిజం(సూర్యలంక, విశాఖ, పేరుపాలెం,సీతపాలెం, కోనసీమ బ్యాక్ వాటర్) వంటి సకల పర్యాటక అనుభూతుల సమాహారమే ఆంధ్రప్రదేశ్ అని మంత్రి కందుల దుర్గేష్ ఢిల్లీ వేదికగా గర్వంగా ప్రకటించారు.

గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వ తీసుకున్న విప్లవాత్మక చర్యల వల్ల పర్యాటకుల రాక రికార్డు స్థాయికి చేరిందని మంత్రి కందుల దుర్గేష్ గణాంకాలతో వివరించారు.2023–24లో 28.58 కోట్లుగా ఉన్న పర్యాటకుల సంఖ్య, 2025–26 నాటికి 36.42 కోట్లకు చేరిందని తెలిపారు. దేశీయ పర్యాటకుల సంఖ్య 28.56 కోట్ల నుండి 36.39 కోట్లకు పెరిగిందని, దేశంలోనే 4వ స్థానంలో ఉన్నామన్నారు. విదేశీ పర్యాటకుల సంఖ్య 1.70 లక్షల నుండి రికార్డు స్థాయిలో 2.72 లక్షలకు పెరిగిందని, గత ఏడాదిలోనే ఏకంగా 48.63% వృద్ధి నమోదు కావడం విశేషమని పేర్కొన్నారు.

ఏపీలో టూరిజం ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు, అత్యంత పారదర్శకమైన ‘నూతన పర్యాటక పాలసీ 2024-29’ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రూ. 19,693 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించగా.. ఇప్పటికే రూ. 9,200.73 కోట్ల విలువైన ప్రాజెక్టులకు అనుమతులు మంజూరయ్యాయని తద్వారా 7,994 క్లాసిఫైడ్ హోటల్ గదులు అందుబాటులోకి రానున్నాయని స్పష్టం చేశారు..క్యాపిటల్ సబ్సిడీ, 100% స్టాంప్ డ్యూటీ రీయింబర్స్‌మెంట్, 100% భూ మార్పిడి ఛార్జీల మినహాయింపు, పారిశ్రామిక ధరలకే విద్యుత్ సరఫరా, జీఎస్టీ రీయింబర్స్‌మెంట్, సింగిల్ విండో అనుమతులను అందిస్తున్నామన్నారు. పర్యాటక రంగాన్ని అన్ని రంగాలతో అనుసంధానిస్తూ దేశంలోనే మొట్టమొదటిసారిగా సమగ్ర పాలసీ వ్యవస్థను తీసుకొచ్చినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

అడ్వెంచర్ టూరిజం గైడ్‌లైన్స్ 2025 ద్వారా ల్యాండ్, వాటర్, ఎయిర్ స్పోర్ట్స్ కోసం కఠినమైన భద్రతా ప్రమాణాలు తెచ్చామని, క్యారవాన్ టూరిజం పాలసీ ద్వారా 25 క్యారవాన్ పార్కుల నిర్మాణం, 150 క్యారవాన్ల మొబిలైజేషన్ ద్వారా 5,000 స్థానిక ఉపాధి అవకాశాలు కల్పించినట్లు పేర్కొన్నారు. హోమ్‌స్టేలు మరియు బీ&బీ పాలసీ ద్వారా ఐదేళ్లలో 10,000 హోమ్‌స్టేల ఏర్పాటు, 50,000 ఉద్యోగాలు, 20,000 కుటుంబాలకు ఉపాధి నైపుణ్యాల శిక్షణ అందించనున్నామన్నారు. ఎంప్లాయ్‌మెంట్ ఇన్సెంటివ్ పాలసీ ద్వారా రాబోయే ఐదేళ్లలో పర్యాటక రంగాన్ని నమ్ముకుని 3 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పెట్టుకున్నామన్నారు. పర్యాటక రంగంలో కొత్తగా ఉద్యోగాలు కల్పించే సంస్థలకు, ఆయా సంస్థలు చెల్లించాల్సిన ఈపీఎఫ్, ఈఎస్ఐ యజమాన్య వాటాను ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందని తెలిపారు. ఇవే గాక బీచ్ షాక్స్ పాలసీ, రాష్ట్రంలో పెద్ద ఎత్తున అంతర్జాతీయ, జాతీయ సంగీత కచేరీలు, ఈవెంట్లను నిర్వహించడానికి కాన్సెర్ట్ పాలసీ, ఫిల్మ్ టూరిజం పాలసీ, చారిత్రక కట్టడాల పరిరక్షణలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ అడాప్ట్ ఎ మాన్యుమెంట్ గైడ్‌లైన్స్ మరియు పర్యాటక ప్రాంతాల సహజ సిద్ధమైన అందాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ల్యాండ్‌స్కేప్‌ను కాపాడుతూ డెస్టినేషన్ వ్యూ ప్రొటెక్షన్ గైడ్‌లైన్స్ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.పర్యావరణానికి హాని కలగకుండా పర్యాటకాన్ని ప్రోత్సహించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పర్యాటకులకు స్థానిక సంస్కృతిని దగ్గరుండి పరిచయం చేసే గైడ్‌లు/హోస్ట్‌ల వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు.పర్యాటక రంగంలో ఉన్న ఏజెన్సీలు, ఆపరేటర్లను నేరుగా పర్యాటక శాఖతో అనుసంధానం చేస్తూ ఒక అధికారిక “వెరిఫైడ్ పార్ట్నర్ నెట్‌వర్క్”ను ఏర్పాటు చేశామన్నారు.

పర్యాటకులు ఎక్కువ రోజులు రాష్ట్రంలో గడిపేలా విశాఖపట్నం, అరకు వ్యాలీ, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతిలను ఏడు ప్రధాన ‘యాంకర్ హబ్‌లుగా’ మార్చామని మంత్రి దుర్గేష్ తెలిపారు. టెంపుల్, క్రూయిజ్, బౌద్ధ, ఎకో, బీచ్, రివర్ మరియు సీప్లేన్ సర్క్యూట్ల ద్వారా పర్యాటకాన్ని సుసంపన్నం చేస్తున్నామన్నారు. అదే విధంగా చేనేత, జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఈ క్రమంలో ధర్మవరం, మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ చీరలు, శ్రీకాళహస్తి-మచిలీపట్నం కలంకారీ కళలు, ఏటికొప్పాక-కొండపల్లి బొమ్మలు, బొబ్బిలి వీణ, అరకు కాఫీ, ఆత్రేయపురం పూతరేకులు వంటి జీఐ (GI) గుర్తింపు పొందిన మన సంస్కృతీ వారసత్వ ఉత్పత్తులను పర్యాటక అనుభూతిలో భాగం చేస్తున్నామన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో 3 అంతర్జాతీయ (విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి), 3 దేశీయ (రాజమహేంద్రవరం, కడప, కర్నూలు) విమానాశ్రయాలతో పాటు, 700కు పైగా రైల్వే స్టేషన్లు, బలమైన జాతీయ రహదారుల నెట్‌వర్క్ ఉందన్నారు. కృష్ణా, గోదావరి నదులపై రివర్ క్రూయిజ్ టూరిజంను వేగంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

సంవత్సరమంతా పర్యాటక పండుగ వాతావరణం ఉండేలా క్యాలెండర్‌ను సిద్ధం చేశామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. “హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్” ప్రచారంలో భాగంగా… వెడ్డింగ్స్ (డెస్టినేషన్ వెడ్డింగ్స్), ఎక్స్పీరియన్సెస్, కల్నరీ (వంటకాలు), మరియు మైస్ (MICE – మీటింగ్స్) అనే నాలుగు ప్రధాన స్తంభాలపై దృష్టి పెట్టామన్నారు.

“ఆంధ్రప్రదేశ్ కేవలం చూడదగిన ప్రదేశం కాదు.. అదొక పరిపూర్ణ జీవన అనుభూతి. ఆధ్యాత్మికత, సముద్రతీరం, సంస్కృతి, ప్రకృతి సంపద, రుచులు మరియు వ్యాపార అనుకూలత కలిసిన అద్భుత వేదిక. ఆంధ్రప్రదేశ్‌కు రండి.. భాగస్వామ్యాలు నెలకొల్పండి.. ప్యాకేజీలు రూపొందించండి.. పెట్టుబడులు పెట్టండి. మీతో కలిసి ప్రయాణించేందుకు ఏపీ టూరిజం సిద్ధంగా ఉంది” అని మంత్రి కందుల దుర్గేష్ ఢిల్లీ వేదికగా ఇన్వెస్టర్లను ఆత్మీయంగా ఆహ్వానించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *