విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ నగరంలో పారిశుద్ధ్యం, ప్రజారోగ్య పరిరక్షణకు విఘాతం కలిగించే చర్యలపై కఠిన చర్యలు కొనసాగిస్తోంది. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రజారోగ్య విభాగం అధికారులు శుక్రవారం సర్కిల్-1 కార్యాలయంలో సంచార న్యాయస్థానం (మొబైల్ కోర్టు) నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా ప్రజారోగ్య విభాగం అధికారులు నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, రహదారులపై చెత్తాచెదారం వేయడం, రోడ్లపై పశువులు మరియు పెంపుడు కుక్కలను విచ్చలవిడిగా వదిలేయడం, కాలువల్లో వ్యర్థాలు వేయడం ద్వారా మురుగునీటి పారుదలకు ఆటంకం కలిగించడం, డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారిని గుర్తించారు.
ఈ ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 22 కేసులు నమోదు చేసి నిందితులను మొబైల్ కోర్టులో జడ్జి టి.ఎ.ఎస్.ఎస్.ఆర్.ఎ. రిషిక్ ఎదుట హాజరుపరిచారు. కేసులను విచారించిన జడ్జి నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించగా, మొత్తం రూ.5,780 జరిమానా వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.
ప్రజారోగ్యానికి హాని కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులు సూచించారు. రహదారులు, కాలువలు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా, నిబంధనలను పాటించి నగర పరిశుభ్రతకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భవిష్యత్తులో కూడా మొబైల్ కోర్టుల ద్వారా కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, శానిటరీ సూపర్వైజర్లు డి. సోమరాజు, ఎస్.వి.ఎస్. శ్రీధర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు ప్రజారోగ్య విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News