-ప్రగడ కోటయ్య జయంతి నిర్వహణ స్వాగతం.. ఆగస్టు 5న రాష్ట్రవ్యాప్త చేనేత సదస్సు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చేనేత రంగం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, అది భారతీయ సంస్కృతి, స్వావలంబన, ఆర్థిక స్వాభిమానానికి ప్రతీక అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చేనేత అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో ఓబిసి మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీ నివాస్ అధ్యక్షత వహించారు
సమావేశంలో మాధవ్ కీలక అంశాలు ప్రస్తావించారు
చేనేత రంగానికి విశిష్ట సేవలందించిన స్వర్గీయ ప్రగడ కోటయ్య జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం స్వాగతించదగ్గ పరిణామమని ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ స్వాగతించారు.చేనేత కార్మికుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత నాయకుడు ప్రగడ కోటయ్య అని మాధవ్ కొనియాడారు.
భారతదేశం ఒకప్పుడు ప్రపంచానికి వస్త్రాలను ఎగుమతి చేసి “బంగారు పిట్ట”గా ఎదగడానికి చేనేత రంగమే ప్రధాన ఆధారమని మాధవ్ గుర్తు చేశారు. సింధు లోయ నాగరికత కాలం నుంచే భారతీయ వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా విశిష్ట గుర్తింపు ఉండేదని, రోమన్, ఈజిప్ట్, గ్రీక్ వంటి దేశాలు భారతీయ వస్త్రాలకు బదులుగా బంగారం చెల్లించేవని చెప్పారు. అయితే బ్రిటిష్ పాలకులు తమ మిల్లు వస్త్రాల వ్యాపారం కోసం భారత చేనేత వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేశారని విమర్శించారు.
స్వదేశీ ఉద్యమంలో మహాత్మా గాంధీజీ చేనేతను స్వాతంత్ర్య సమరానికి శక్తివంతమైన ఆయుధంగా మలిచారని పేర్కొన్నారు. ప్రతి భారతీయుడు చేనేత వస్త్రాలను వినియోగించడం ద్వారా మన సంప్రదాయాన్ని, చేనేత కార్మికుల శ్రమను గౌరవించాలని పిలుపునిచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ 2015లో ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించడం ద్వారా చేనేత రంగానికి కొత్త ఊపు వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం “వోకల్ ఫర్ లోకల్”, “ఆత్మనిర్భర్ భారత్” వంటి కార్యక్రమాల ద్వారా చేనేత ఉత్పత్తులకు ప్రాధాన్యం కల్పిస్తోందని చెప్పారు.
రాష్ట్రంలో చేనేత కార్మికులకు విద్యుత్, నూలు, రంగుల సబ్సిడీలను పారదర్శకంగా అందించాలని, పెన్షన్, సంక్షేమ పథకాలు, ఉచిత విద్యుత్ వంటి హామీలను నిరంతరంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు ఖాదీకి లభించిన అంతర్జాతీయ గుర్తింపు రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు.
చేనేత రంగాన్ని ఆధునిక మార్కెటింగ్, ఈ-కామర్స్, ఎగుమతులతో అనుసంధానం చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మార్కండేయ జయంతిని అధికారికంగా నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం చేనేత సమాజానికి గౌరవప్రదమైనదని పేర్కొన్నారు.
ఆగస్టు 5న విజయవాడలో నిర్వహించే రాష్ట్రవ్యాప్త చేనేత సదస్సు ద్వారా రంగ అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని మాధవ్ సూచించారు. చేనేత కార్మికుల సంక్షేమం, ఉత్పత్తుల ప్రోత్సాహం, ప్రపంచ మార్కెట్లలో గుర్తింపు పెంపు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిట్ర శివ నారాయణ, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం, చేనేత సంఘాల నేతలు పుచ్చల రామకృష్ణ
జ్వాల నరసింహారావు , ఘనప వీరేశ శెట్టి సత్తి త్యాగరాజు మండి వీరాంజనేయులు, బిజెపి నేత కనిగిరి నీలకంఠం, పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News