Breaking News

పిఠాపురం నియోజక వర్గం అభివృద్ధి పనుల పురోగతిపై పవన్ కళ్యాణ్ సమీక్ష

-క్షేత్రస్థాయి పరిశీలనకు కార్యాలయ సిబ్బంది
-కొత్త రోడ్లు, నాగులాపల్లి తాగునీటి సరఫరా పథకం అభివృద్ధిపై ఆరా
-అభివృద్ధి పనుల నాణ్యతను పరిశీలించాలని స్పష్టీకరణ
-పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం పకడ్బందీగా అమలు సూచనలు
-నియోజకవర్గంలో 100 భజన మందిరాల నిర్మాణానికి ప్రణాళికలు
-పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య నిర్వహణపై వివరణ కోరిన ఉప ముఖ్యమంత్రి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
పిఠాపురం నియోజకవర్గంలో పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, ప్రజా సేవల అమలు తీరుపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. కార్యాలయ సిబ్బందిని నియోజకవర్గంలో క్షేత్ర స్థాయి పరిశీలనకు పంపారు. అంశాలవారీగా వారు సమర్పించిన నివేదికలను పరిశీలించారు. నియోజకవర్గవ్యాప్తంగా నూతనంగా నిర్మించిన రోడ్ల నాణ్యత, నాగులాపల్లి సమగ్ర రక్షిత తాగునీటి పథకం విస్తరణ పనులు, భజన మందిరాల నిర్మాణ పురోగతి, దేవాదాయ శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలపై శాఖలవారీగా అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
పిఠాపురం నియోజకవర్గవ్యాప్తంగా రహదారులన్నీ అభివృద్ధి చేయాలన్న పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో 288 సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు అధికారులు వివరించారు. క్షేత్రస్థాయికి వెళ్లి – నిర్మించిన రోడ్ల నాణ్యతను పరిశీలించాలని నియోజకవర్గ పర్యటనలో ఉన్న కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలకు నిర్మించిన ప్రహరీ గోడల పనులను కూడా పరిశీలించాలని సూచించారు.
యూ.కొత్తపల్లి మండల పరిధిలో తాగునీటి సరఫరాకు కీలకమైన నాగులాపల్లి సమగ్ర రక్షిత తాగునీటి పథక విస్తరణ పనులు పూర్తయ్యి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. త్వరలో చేపట్టబోయే పిఠాపురం పర్యటనలో ఈ పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా సన్నాహాలు చేయాలని స్పష్టం చేశారు. నూతనంగా నిర్మించిన ఓవర్‌హెడ్ ట్యాంకులు, పైప్‌లైన్లు, ఫిల్టర్ బెడ్లు, సంపుల నిర్మాణానికి సంబంధించి సమగ్ర నివేదిక రూపొందించాలన్నారు. యు.కొత్తపల్లి మండలంలోని 52 ఆవాసాలకు పూర్తి స్థాయిలో తాగునీరు అందించే లక్ష్యంతో ఈ తాగునీటి పథకం విస్తరణ పనులు చేపట్టారు.
• డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలుపై పర్యవేక్షణ
పిఠాపురం నియోజకవర్గవ్యాప్తంగా 191 పాఠశాలలు ఉండగా, సుమారు 18 వేల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో అందిస్తున్న ఆహార నాణ్యత ప్రమాణాలను కూటమి ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తోందని.. పథక నిర్వహణను పకడ్బందీగా నిర్వహించాలని పేషీ సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులకు మరింత నాణ్యమైన, పోషకాహారాన్ని అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య నిర్వహణ, గత పర్యటనలో పరిశీలించిన ఇందిరానగర్ డ్రెయిన్ అభివృద్ధి తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీల్లో చెత్త సేకరణ, పరిశుభ్రత కార్యక్రమాల అమలులో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా సహించబోమని హెచ్చరించారు.
నియోజకవర్గ పరిధిలోని ఏరియా ఆసుపత్రుల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, రోగులకు అందుతున్న సేవలు, 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పురోగతి తదితర అంశాలను సమీక్షించారు. సీజనల్ వ్యాధుల కాలంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న పిఠాపురంలోని ప్రధాన ఆలయాల్లో దేవాదాయ శాఖ సహకారంతో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. ముఖ్యంగా టీటీడీ సౌజన్యంతో నిర్మించ తలపెట్టిన భజన మందిరాల ఏర్పాటు ప్రణాళికలను సమీక్షించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 100 భజన మందిరాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, స్థల సేకరణ, ఆలయ కమిటీల ఏర్పాటు తదితర అంశాల్లో ఉన్న ఇబ్బందులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
ఎల్‌నినో కారణంగా ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నియోజకవర్గంలో నెలకొన్న సాగునీటి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి లభ్యత ఆధారంగా రైతులకు నీటి విడుదల క్యాలెండర్ రూపొందించి అందించాలని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *