Breaking News

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని మైనారిటీ యువతకు నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకువచ్చి వారిని స్వయం సమృద్ధి వైపు నడిపించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ తెలిపారు. విద్య ద్వారానే సమాజంలో శాశ్వత మార్పు సాధ్యమనే సంకల్పంతో ప్రభుత్వం మైనారిటీల విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.

మంగళగిరి సమీపంలోని వడ్డేశ్వరం వద్ద రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ బుధవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ మాట్లాడుతూ.. రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలు, సూచనల మేరకు సీఈడీఎం ద్వారా మైనారిటీ యువత కోసం ఉచిత కోచింగ్ కార్యక్రమాలను ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో నివసిస్తూ ప్రత్యక్ష తరగతులకు హాజరు కాలేని విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన అధ్యాపకులతో ఉచిత ఆన్‌లైన్ కోచింగ్‌తో పాటు ఆఫ్‌లైన్ తరగతులను కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు ఎక్కడ ఉన్నా నాణ్యమైన శిక్షణ అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

గత ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో మైనారిటీ యువత విద్యా, ఉద్యోగ శిక్షణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మైనారిటీల విద్యా సాధికారతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి స్పష్టం చేశారు. పోటీ పరీక్షలకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, కెరీర్ మార్గదర్శకత్వం వంటి కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మైనారిటీ జనాభా సుమారు 7.5 నుంచి 8 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో ఏకంగా 11.5 శాతం మంది మైనారిటీ అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించడం ప్రభుత్వ చర్యలకు నిదర్శనమని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు సాధించిన వారిలో దాదాపు 48 శాతం మంది మైనారిటీ మహిళలు ఉండటం మహిళా విద్య, సాధికారత దిశగా రాష్ట్రం సాధిస్తున్న పురోగతిని చాటుతోందన్నారు.

ఉర్దూ ఉపాధ్యాయ అభ్యర్థుల కోసం వక్ఫ్ బోర్డు స్వంత నిధులతో దాదాపు 7,000 మందికి ప్రత్యేక శిక్షణ అందించామని, అనంతరం పారదర్శకంగా నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచిన 250 మంది టాపర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభను ప్రోత్సహించడం ద్వారా మరింత మంది యువత ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు ముందుకు రావాలని ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మైనారిటీల ఆర్థికాభివృద్ధి కోసం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారని గుర్తు చేసిన మంత్రి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆ సంస్థను బహుళ ప్రయోజనకరంగా తీర్చిదిద్దామని తెలిపారు. అదే విజన్‌ను కొనసాగిస్తూ రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (PPP) విధానంలో స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, ఆధునిక శిక్షణ, ఆర్థిక సహాయ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వివరించారు.

మైనారిటీ యువతను ఉద్యోగార్థులుగానే కాకుండా పారిశ్రామికవేత్తలుగా, నవతరం నాయకులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఫరూక్ స్పష్టం చేశారు. సీఈడీఎం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది మైనారిటీ విద్యార్థులు, నిరుద్యోగ యువత ఉన్నత విద్య, పోటీ పరీక్షలు, ఉపాధి అవకాశాల పరంగా విశేషంగా లబ్ధి పొందనున్నారని ఆయన తెలిపారు.

మైనార్టీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ… సీఈడీఎమ్ ద్వారా మైనార్టీ విధ్యార్ధులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కనీసం 15 శాతం ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. గ్రామీణ విద్యార్ధులకు ముఖ్యంగా మైనార్టీ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్ధులకు ఇది ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు నా వంతు కృషి చేస్తానన్నారు.

ఎమ్మెల్యే ఎండీ నజీర్ మాట్లాడుతూ… సమాజంలో మార్పు విద్య ద్వారానే సాధ్యం అనే నమ్మకంతో రాష్ట్ర ప్రభుత్వం సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) ను ఏర్పాటు చేసిందన్నారు. మైనారిటీలు విద్యా రంగంలో వెనుకబడి ఉన్నారని సచార్ కమిటీ సూచించిన నేపథ్యంలో, ఆ సూచనలను ఆచరణలో పెట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం విదేశీ విద్యా దీవెన వంటి పథకాలతో ఉన్నత విద్యకు ప్రోత్సాహం లభిస్తోందన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు సీఈడీఎం ద్వారా మెరుగైన విద్యా అవకాశాలు అందనున్నాయన్నారు.

మైనార్టీ వ్యవహారాల సంక్షేమ శాఖ కార్యదర్శి సీహెచ్ శ్రీధర్ మాట్లాడుతూ… ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యత నిస్తుందన్నారు. సీఈడీఎం ను మైనార్టీ స్టడీ సర్కిల్ పేరుతో ప్రచారం కల్పిస్తే బాగుంటుందని అది సామాన్య ప్రజలకు కూడా అర్ధం అయ్యే అవకాశాలున్నాయన్నారు. ఎన్నో వినూత్న కార్యక్రమాల ద్వారా మైనార్టీ విద్యార్ధులకు అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.

సిఈడియం డైరెక్టర్ కె. యాకూబ్ బాషా మాట్లాడుతూ….2014 – 2019 కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ₹36 కోట్ల బడ్జెట్ కేటాయించగా, 22,000 మంది మైనార్టీ యువత కోచింగ్ పొంది పొందారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2024 వ సంవత్సరం నుంచి ప్రతి ఏడాది 4 కోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తూ వేలాది మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తోందన్నారు.

సీఈడీఎం-ఏపీ మొబైల్ అప్లికేషన్ యాప్ ను మంత్రి ఎన్.ఎమ్.డీ ఫరూక్ మరియు ఇతర కార్పొరేషన్ చైర్లన్లు సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా మైనార్టీ విద్యార్ధులు సీఈడీఎం ద్వారా పోటీ పరీక్షల పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది.

కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (APSMFC) చైర్మన్ మౌలానా షేక్ ముష్తాక్ అహ్మద్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ హాజీ అబ్దుల్ అజీజ్, ఉర్దూ అకాడమీ చైర్మన్ షేక్ ఫారూక్ షుబ్లీ, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా, నూర్ బాషా/దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, రాష్ట్ర షేక్ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వై.ఎస్. ముక్తియార్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

జూలై 31తో గడువు ముగుస్తుంది… రైతులందరూ వెంటనే పంటల బీమా చేయించుకోండి: మంత్రి అచ్చెన్నాయుడు

– ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతులకు పంటల బీమాయే భరోసా – చివరి రోజు వరకు వేచి చూడొద్దు… ఇప్పుడే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *