-సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ లతో తైవాన్ ప్రతినిధి బృందం భేటీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు సహా అధునాత తయారీ, సాంకేతిక రంగాల్లో ఏపీతో భాగస్వామ్యాన్ని మరింత పెంచుకునే దిశగా తైవాన్ పారిశ్రామిక ప్రతినిధుల బృందం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యింది. తైవాన్ కంపెనీలు, పరిశ్రమలకు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రితో వివిధ అంశాలపై చర్చలు జరిపింది. తైవాన్ కు చెందిన డెల్టా ఎలక్ట్రానిక్స్, బెన్ క్యూ, సీబీటీసీ బ్యాంక్, డైమెర్కో, మాస్టర్ హిల్, నాన్ పావోరెసిన్స్, ఎవర్ క్లియర్ ఎన్విరానమెంటల్ ఇంజనీరింగ్, షెంగ్ హుయ్ టెక్, టెక్ టాప్ ఇంజనీరింగ్, కేఎస్ టెర్మినల్స్, శాండ్ సన్, జిలీ కనస్ట్రక్షన్స్ అండ్ ఇంజనీరింగ్, కపెల్లా స్టోర్స్ వంటి అంతర్జాతీయ స్థాయి దిగ్గజ సంస్థల కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, పోర్టులు, ఎయిర్ పోర్టులు, రైలు, రోడ్డు మార్గాల వంటి పటిష్టమైన లాజిస్టిక్స్ నెట్వర్క్ సహా ఏపీలోని తయారీ రంగ ఎకోసిస్టమ్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు తైవాన్ ప్రతినిధుల బృందానికి వివరించారు. ఎలక్ట్రానిక్స్, సెమికండక్టర్లు, ఐటీ, అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్ సహా ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు విధానపరమైన స్థిరత్వం, వేగంగా అనుమతులు జారీ చేయటంతో పాటు పూర్తి స్థాయి ప్రోత్సాహాన్ని అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. భారత్ లో తమ దేశానికి చెందిన సంస్థలు ఇప్పటికే తయారీ రంగంలో కీలకంగా ఉన్నాయని తైవాన్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఏపీలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. తయారీ రంగం, సాంకేతికత, పారిశ్రామికాభివృద్ధిలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని చర్చల సందర్భంగా ఏకగ్రీవంగా అంగీకారం కుదిరింది.
ఐటీ మంత్రితో తైవాన్ బృందం చర్చలు
అనంతరం ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ తో తైవాన్ ప్రతినిధుల బృందం ప్రత్యేకంగా భేటీ అయ్యింది. ఏపీలో మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాల కల్పన విద్యాపరమైన సహకారంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. తైవాన్‌కు చెందిన మాన్యుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ రంగాలలోని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా ఏపీకి చెందిన యువతకు తగిన నైపుణ్యం, టెక్నికల్ ట్రైనింగ్ సహా ఉన్నత విద్య భాగస్వామ్యాలపై తైవాన్ ప్రతినిధుల బృందంతో చర్చలు జరిగాయి. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీ, ప్రిసిషన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, హెల్త్‌కేర్, ఇతర హై-స్కిల్ రంగాలలో పరస్పర సహకారం అందించుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ప్రపంచ స్థాయి నైపుణ్య గ్రిడ్‌ను నిర్మించడంతో పాటు మాండరిన్ భాషలో శిక్షణ, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సర్టిఫికేషన్, ఇంటర్న్‌షిప్‌లు, విద్యార్థి-ఫ్యాకల్టీ మార్పిడి కార్యక్రమాలు, సంయుక్త పరిశోధనలు, ఉద్యోగ-సన్నద్ధత కార్యక్రమాలపై కూడా చర్చలు జరిగాయి. తైవాన్- ఏపీ మధ్య ఈ సమావేశం కీలక మైలు రాయిగా నిలవనుంది.
Prajavartha Online Telugu News