Breaking News

విద్యుత్ సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలి

-భోగాపురంలో ప్రధాని పర్యటన, గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
-పీఎం సూర్యఘర్, పీఎం-కుసుమ్, ఆర్డీఎస్ఎస్ పనులను వేగవంతం చేయాలి
-విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
భోగాపురంలో ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా విద్యుత్ శాఖకు సంబంధించి ఎలాంటి అంతరాయాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులను ఆదేశించారు. అవసరాన్ని బట్టి అదనపు సిబ్బందిని క్షేత్రస్థాయిలో నియమించి నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో డైరెక్టర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లు, ప్రధాన కార్యాలయ అధికారులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ఆపరేషన్ సర్కిళ్ల సూపరింటెండింగ్ ఇంజనీర్లతో కలిసి వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని మంత్రి సమీక్షించారు.
పీఎం సూర్యఘర్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి, ఎక్కువ మంది గృహ వినియోగదారులు రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీతో పాటు అర్హులైన బీసీ లబ్ధిదారులకు కూడా సౌర విద్యుదీకరణ ప్రయోజనాలు అందేలా ప్రత్యేక కార్యాచరణను అమలు చేయాలని సూచించారు.
పీఎం-కుసుమ్ కాంపోనెంట్-సీ ఫీడర్ స్థాయి సోలరైజేషన్ పనులు, ఆర్డీఎస్ఎస్ కింద ఫీడర్ సెగ్రిగేషన్, బైఫర్కేషన్, స్మార్ట్ మీటర్లు, కవర్డ్ కండక్టర్లు, భూగర్భ కేబుళ్ల ఏర్పాటును నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ పంపిణీ నష్టాలను తగ్గిస్తూ, వ్యవస్థ విశ్వసనీయతను మరింత పెంచేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
గోదావరి పుష్కరాలు–2027 సందర్భంగా ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని, పుష్కరాల పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
గత ఏడాదిలో 12 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను వేగంగా మంజూరు చేసి అర్హులైన రైతులకు ఆలస్యం లేకుండా సేవలు అందించాలని సూచించారు.
ఇటీవల తీవ్ర గాలుల కారణంగా విద్యుత్ అంతరాయాలు ఎక్కువగా ఏర్పడుతున్న నేపథ్యంలో, విద్యుత్ పునరుద్ధరణకు పట్టే సమయాన్ని వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా వెంటనే తెలియజేసే వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని మంత్రి ఆదేశించారు.
విద్యుత్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసే దళారీలను నమ్మి ఎవరూ మోసపోవద్దని మంత్రి హెచ్చరించారు. అసిస్టెంట్ ఇంజనీర్ నియామకాలు పూర్తిగా పారదర్శకంగా, మెరిట్ ప్రాతిపదికన మాత్రమే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 450 మందికి కారుణ్య నియామకాలు కల్పించినట్లు తెలిపారు.
విద్యుత్ పంపిణీ నష్టాల నియంత్రణలో ఏపీఈపీడీసీఎల్ జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి ప్రశంసించారు. సంస్థ అమలు చేస్తున్న ఉత్తమ విధానాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి, ఇతర డిస్కమ్‌లలో కూడా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ మాట్లాడుతూ, ఇటీవల వీచిన తీవ్ర గాలుల కారణంగా విద్యుత్ లైన్లపై చెట్లు, కొమ్మలు విరిగి పడడంతో తరచూ 100 నుంచి 200 వరకు విద్యుత్ స్తంభాలు దెబ్బతింటున్నాయని, వాటిని అత్యంత వేగంగా పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. విద్యుత్ అంతరాయాలు ఏర్పడినప్పుడు పునరుద్ధరణకు పట్టే సమయాన్ని వినియోగదారులకు సోషల్ మీడియా ద్వారా నిరంతరం తెలియజేస్తున్నామని చెప్పారు.
పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా గత ఆర్థిక సంవత్సరంలో 30 కొత్త సబ్‌స్టేషన్లు ప్రారంభించామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50 సబ్‌స్టేషన్లు ప్రారంభించే లక్ష్యంతో ఇప్పటికే 12 సబ్‌స్టేషన్లను ఛార్జ్ చేసినట్లు తెలిపారు.
పీఎం-కుసుమ్, ఆర్డీఎస్ఎస్ పనులు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని పేర్కొన్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లాల్లో భూగర్భ కేబుళ్లు, కవర్డ్ కండక్టర్ల పనులు వేగంగా కొనసాగుతున్నాయని, వాటి అమలుతో విద్యుత్ అంతరాయాలు గణనీయంగా తగ్గాయని తెలిపారు.
ఆర్డీఎస్ఎస్, సోలారైజేషన్ పనులను సమర్థవంతంగా అమలు చేయడం వల్ల విద్యుత్ పంపిణీ నష్టాలు తగ్గి, డిస్కంపై రూ.100 కోట్లకు పైగా ఆర్థిక భారం తగ్గినట్లు వివరించారు.
గోదావరి పుష్కరాల నాటికి 19 కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్లు సిద్ధం చేయనున్నట్లు, రూ.830 కోట్లతో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మే నెల వరకు చెల్లింపులు చేసిన రైతులందరికీ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అందించామని, గత ఏడాదిలో 5,767 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. అలాగే ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 148 మందికి కారుణ్య నియామకాలు కల్పించినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్లు టి. వి. సూర్యప్రకాష్, టి. వనజ, ఎస్. హరిబాబు, సీవీఓ కె. రామకృష్ణ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *