-విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌ను స్వచ్ఛ ఇంధన, విద్యుత్ రంగ ఆవిష్కరణలకు దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ (CoEET) ఇప్పటికే పలు వినూత్న కార్యక్రమాలతో ముందుకు సాగుతోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. ఆవిష్కరణలు, పరిశోధనలు, స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందిస్తూ భవిష్యత్ విద్యుత్ రంగ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో సీఒఈఈటి కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం, విశాఖపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) మరియు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ (CoEET) మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమక్షంలో ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి, మరియు ఆర్ టి ఐ హెచ్ సీఈఓ ఇ. రవి కుమార్ అవగాహన ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకొన్నారు. అనంతరం ఈ భాగస్వామ్య కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సీఒఈఈటి ప్రారంభమైన నాటి నుంచి విద్యుత్ రంగంలో నూతన సాంకేతికతలను ప్రోత్సహించే దిశగా పలు కీలక కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. పరిశ్రమలు, విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వినూత్న ఆలోచనలను కార్యరూపం దాల్చేలా చేయడమే ప్రధాన లక్ష్యంగా సీఒఈఈటి కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. సీఒఈఈటి ఆధ్వర్యంలో ఇప్పటికే కృత్రిమ మేధస్సు, డిజిటల్ గ్రిడ్లు, స్మార్ట్ విద్యుత్ పంపిణీ వ్యవస్థలు, పునరుత్పాదక ఇంధన సమీకరణ, డిమాండ్ రెస్పాన్స్, ఇంధన నిల్వ వ్యవస్థలు, విద్యుత్ రంగ డిజిటలైజేషన్ తదితర అంశాలపై జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి సదస్సులు, శిక్షణ కార్యక్రమాలు, హ్యాకథాన్లు, సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారని గుర్తు చేశారు. విద్యుత్ రంగంలో యువత, స్టార్టప్‌ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు సీఒఈఈటి ఇప్పటికే వినూత్న కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర విద్యుత్ రంగాన్ని మరింత ఆధునికంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో సీఒఈఈటి ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని అన్నారు. ఆర్ టి ఐ హెచ్ తో కుదిరిన తాజా ఒప్పందం ద్వారా ఎనర్జీ టెక్నాలజీ కో-ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా స్వచ్ఛ ఇంధన రంగంలో పనిచేసే స్టార్టప్‌లకు ఇంక్యుబేషన్, మెంటరింగ్, సాంకేతిక నిపుణుల మార్గదర్శకత్వం, పరిశ్రమలతో అనుసంధానం, పెట్టుబడిదారులతో అనుసంధానం, పరిశోధనలను వాణిజ్యీకరించే అవకాశాలు కల్పించబడతాయని చెప్పారు. ఈ భాగస్వామ్యం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో స్వచ్ఛ ఇంధన రంగంలో కొత్త స్టార్టప్‌లు వెలుగులోకి రావడంతో పాటు, స్థానిక యువతకు ఉపాధి, పారిశ్రామిక అవకాశాలు పెరుగుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ, ఎనర్జీ ట్రాన్సిషన్, ఆవిష్కరణలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సీఒఈఈటి వంటి సంస్థలు ఆ దిశగా రాష్ట్ర అభివృద్ధికి కీలక వేదికలుగా నిలవాలని ఆకాంక్షించారు.
ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ మాట్లాడుతూ, సీఒఈఈటి ను దేశంలోనే అత్యుత్తమ ఎనర్జీ ఇన్నోవేషన్ వేదికగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆర్ టి ఐ హెచ్ తో భాగస్వామ్యం ద్వారా స్టార్టప్‌లకు పరిశోధన నుంచి మార్కెట్ వరకు అవసరమైన సహకారం అందించే సమగ్ర వ్యవస్థగా ఏర్పడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, డైరెక్టర్లు టి. వి. సూర్యప్రకాష్, టి. వనజ, ఎస్. హరిబాబు, సీజీఎం డి.సుమన్ కళ్యాణి, సీవీఓ కె. రామకృష్ణ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News