అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పరమత సహనంతో మెలిగే సనాతన ధర్మాన్ని హేళన చేయడం కాంగ్రెస్‌తోపాటు ఇతర ప్రతిపక్షాలకు పరిపాటిగా మారడం దురదృష్టకరం. ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పవిత్రమైన పార్లమెంట్ ప్రాంగణంలో ప్రతిపక్ష ఎంపీలు శుక్రవారం సాధువుల వేషధారణతో చేసిన హేళన అత్యంత ఆక్షేపణీయం. సనాతన ధర్మం, పూజ్య సాధు-సంతులు, హిందూ సమాజం మనోభావాలను కించపరచేలా వీధి నాటకాలు ప్రదర్శించి యావత్ హిందూ సమాజాన్ని అవమానించారు. స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్, కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఇతర ఎంపీలు సాధువుల వేషధారణలో చేపట్టిన నిరసన జుగుప్సాకరంగా ఉంది. వీరి వేషధారణలు, హావభావాలు హిందూ మతాన్ని అవమానపరుస్తూ అహంకారపూరితంగా ఉన్నాయి. రామాయణంలో రావణుడు సీతాపహరణం కోసం మోసపూరితంగా సాధువు వేషంలో వచ్చినట్టుగా – ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ప్రజలను మోసం చేసే వేషధారణ ప్రదర్శించారు. కాంగ్రెస్ పార్టీకి వారి మిత్రపక్షాలకు హిందూ వ్యతిరేక వైఖరి కొత్తేమి కాదు, వారు అయోధ్య శ్రీరామ జన్మభూమి ఉద్యమం నాటి నుంచి సనాతన ధర్మంపై నిరంతరం విషాన్ని కక్కుతూనే ఉన్నారు. సనాతన ధర్మాన్ని అవమానపరిస్తే సహించేది లేదని జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పటికే పలు వేదికలపై స్పష్టం చేశారు. సనాతన ధర్మ పరిరక్షణకు జనసైనికులు కట్టుబడి ఉన్నారు. పార్లమెంట్ ప్రాంగణంలో సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు చేసిన నిరసన ప్రదర్శనలను జనసేన ఖండిస్తుంది.
అయోధ్యలో భవ్య శ్రీరామ మందిర నిర్మాణం పూర్తవడంతో అసహనంతో ఉన్న ప్రతిపక్షాలు హిందూ ధర్మాన్ని కించపరుస్తూ తరచూ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. సహనానికి మారుపేరైన సనాతన ధర్మం సహనాన్ని వీరు పరీక్షిస్తున్నారు. అత్యున్నత పవిత్రమైన పార్లమెంట్‌లో ప్రజల సమస్యలపై చర్చించాల్సిన వేదికను రాజకీయ నాటకాలకు, మతపరమైన అవహేళనలకు ఉపయోగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. దశాబ్దాల పోరాటం, నిరీక్షణ అనంతరం భారత అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు తీర్పుతో అనంతరం రాజ్యంగబద్దంగా అయోధ్యలో రామాలయం భవ్య నిర్మాణం చేపడితే ప్రతిపక్షాలు భరించలేకుండా బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తున్నాయి. రామాలయంలో విరాళాల్లో అవకతవకలపై ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి వేగవంతమైన చర్యలు చేపట్టింది. ఏ అంశంపైనా అయినా ప్రజాస్వామ్యబద్దంగా చర్చించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడే ఉంటుంది. అయితే సనాతన ధర్మంపై కక్ష పెంచుకున్న ప్రతిపక్షాలు హిందూ ధర్మాన్ని అవమానపరుస్తూ దిగజారుడు ప్రదర్శనలు చేపట్టడం దురదృష్టకరం.
పార్లమెంట్ ప్రాంగణంలో మతపరమైన ప్రదర్శనలు చేసిన ఎంపీలపై లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని జనసేన పార్టీ, లింగమనేని రమేశ్, ఎంపీ (రాజ్యసభ) విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News