-హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉత్తర్వులు తగదు
-పాత జీవో 151 జారీ యథాతథంగా ఉండాలి
-రిజర్వేషన్ వర్గాలకు అన్యాయం లేకుండా చూడాలి
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నిర్వహిస్తున్న వైద్య సీట్ల ప్రవేశాల్లో జీవో 102 రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు తీవ్ర నష్టదాయకమని, తక్షణమే ప్రభుత్వం దానిని రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. వైద్య కళాశాలల ప్రవేశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం. 102 (30.7.2026)న జారీచేయడం ఈ విద్యా సంవత్సరంలో నీట్ ద్వారా ఎంబీబీఎస్ తదితర కోర్సుల ప్రవేశాలు గందరగోళంగా మారనున్నాయని తెలిపారు. ఈ మేరకు నేడు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ జీవో రాష్ట్ర హైకోర్టు డబ్ల్యూపీ నంబరు 11018 (2029) కేసులో ఇచ్చిన సూచనలకు విరుద్ధంగా ఉందన్నారు. 2019లో ఎన్టీఆర్ హెల్త్ యనివర్శిటీ ద్వారా జరిగిన వైద్య సీట్ల ప్రవేవాల్లో రిజర్వేషన్ వర్గాల విద్యార్థులకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఆనాడు ఆయా విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారని గుర్తుచేశారు. దీంతో హైకోర్టు అడ్మిషన్లు పారదర్శకంగా నిర్వహించేలా, రిజర్వేషన్ల స్ఫూర్తి దెబ్బ తినకుండా ఉండేలా, ఆరుగురు నిపుణులతో ఒక కమిటీ వేసి వారు చేసిన సూచనలకు అనుగుణంగా అడ్మిషన్ నిర్వహించాలని సూచించిందన్నారు. దానికి అనుగుణంగా ఆనాటి ప్రభుత్వం 16.3.2020వ తేదీన ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను, ఇద్దరు ఉన్నత విద్యావేత్తలను, ఇద్దరు సీనియర్ హైకోర్టు న్యాయవాదులతో ఒక కమిటీని వేశారని వివరించారు. వారిచ్చిన సూచనల మేరకు 4.12.2020 వ తేదీన జీఓ ఎంఎస్ నంబరు`151 జారీ చేసిందన్నారు. అప్పటి నుంచి ఆ జీవోని అనుసరించే వైద్య సీట్ల కు ప్రవేశాలు కొనసాగుతున్నాయని తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో జీవో 151 అమలు చేయడం వలన ఎవరికీ, ఎలాంటి నష్టం జరిగినట్లు ఇంతవరకు ఫిర్యాదులు లేవన్నారు. అప్పటి వరకు వైద్య సీట్ల భర్తీలో అనేక సమస్యలు తలెత్తడంతో జీవో 151 రావడానికి కారణమైందని తెలిపారు. అంటే చాలా మంది రిజర్వేషన్ వర్గాలు మంచి ర్యాంక్ తెచ్చుకుని వాళ్లు ఓపెన్ కేటగిరిలో మంచి సీటు సాధించే అవకాశం ఉన్నప్పటికీ..వారు ఆప్షన్లు సరిగ్గా పెట్టుకోకపోవడంతో చివరకు ర్న్పిర్వేషన్ కేటగిరీలోనే సీట్లు కేటాయించే వారని వివరించారు. దానివల్ల అనేక మంది రిజర్వేషన్ వర్గాల వారు నష్టపోయేవారని వివరించారు. ఐదారు సంవత్సరాల నుంచి ఆ జీవో ప్రకారమే ఎంబీబీఎస్ ప్రవేశాలు కొనసాగుతున్నాయని, ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా ఆల్ ఆప్షన్లు పెట్టే విధానాన్ని తొలగించినట్లయితే..ఆ జీవో స్ఫూర్తి దెబ్బతింటుందని తెలిపారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జారీజేసిన జీవో ప్రకారం, జనరల్ కేటగిరీలో సీటు పొందగలిగిన రిజర్వేషన్ అభ్యర్థి, తాను అన్ని ఆప్షన్లు పెట్టినప్పుడు అతడ్ని జనరల్ కేటగిరీ కింద కేటాయించకుండా తీసుకెళ్లి రిజర్వేషన్ కేటగిరీలో కేటాయించేలా ఉంటుందన్నారు. అంటే ర్యాంక్ చూస్తే ఓపెన్ కేటగిరిలో ఉన్నప్పటికీ, సీట్ మాత్రం రిజర్వేషన్‌లో ఇస్తారని పేర్కొన్నారు. దీని ఆధారంగా రిజర్వేషన్‌లో రావాల్సిన ఒక సీటు పోతుందన్నారు. రాబోయే వైద్య సీట్ల ప్రవేశాల్లో ఈ జీవో వల్ల తక్కువ ఆప్షన్లు పెట్టే రిజర్వేషన్ విద్యార్థులకు అనేక సమస్యలు తలెత్తే ప్రమాదముందని తెలిపారు. అన్ని వర్గాల విద్యార్థులకు న్యాయం జరగాలంటే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 102 జీవోను రద్దు చేసి, పాత జీవో 151ను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
Prajavartha Online Telugu News