Breaking News

తిరుపతి జిల్లాలో చెరకు సాగు క్షీణత ఆందోళనకరం

-చెరకు సాగు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరిన ఎంపీ గురుమూర్తి

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లాలో చెరకు సాగు విస్తీర్ణం, ఉత్పత్తి క్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో ఎంపీ గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి కారణాలు, రైతులకు అందిస్తున్న సహాయం, చెరకు పరిశ్రమ పునరుద్ధరణకు తీసుకుంటున్న చర్యలపై తిరుపతి ఎంపీ గురుమూర్తి మంగళవారం లోక్‌సభలో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల వారీగా చెరకు సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, దిగుబడి వివరాలను కేంద్రం సభకు సమర్పించింది. తిరుపతి జిల్లాలో చెరకు సాగు, ఉత్పత్తి తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. చెరకు ఉత్పత్తి పెంపు, సాగు పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. ఐసీఏఆర్‌ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌కు అనువైన అధిక దిగుబడి, వ్యాధి నిరోధక లక్షణాలు కలిగిన Co09004 చెరకు రకాన్ని విడుదలకు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

జాతీయ ఆహార భద్రత మరియు పోషకాహార మిషన్ ద్వారా రైతులకు శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహిస్తూ చెరకు ఉత్పాదకత పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ ఉపమిషన్ కింద ఆంధ్రప్రదేశ్‌కు 2014-15 నుంచి 2026-27 వరకు రూ.955.28 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ నిధులతో వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పంపిణీ చేయడంతో పాటు, కస్టమ్ హైరింగ్ సెంటర్లు, హైటెక్ హబ్‌లు, ఫార్మ్ మెషినరీ బ్యాంకులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

‘పర్ డ్రాప్ మోర్ క్రాప్’ పథకం ద్వారా డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. చిన్న, సన్నకారు రైతులకు యూనిట్ ఖర్చులో 55 శాతం, ఇతర రైతులకు 45 శాతం వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు. ప్రతి పంట సీజన్‌కు చెరకు ఫెయిర్ అండ్ రిమ్యునరేటివ్ ప్రైస్ ను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని, ఆ ధర కంటే తక్కువకు చెరకు కొనుగోలు చేసే అవకాశం చక్కెర కర్మాగారాలకు లేదని మంత్రి స్పష్టం చేశారు.

అలాగే సహకార చక్కెర కర్మాగారాల ఆధునికీకరణ, పునరుద్ధరణ కోసం జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ద్వారా 2023-24, 2024-25 సంవత్సరాల్లో రూ.10,005 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ, తిరుపతి జిల్లాలో చెరకు సాగు క్షీణత ఆందోళన కలిగించే అంశమని, కేంద్రం వెల్లడించిన పథకాల ప్రయోజనాలు జిల్లా రైతులకు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని, చెరకు రైతులు, చక్కెర పరిశ్రమకు మరింత ప్రత్యేక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్ & బీ శాఖ పురోగతిపై క్షేత్రస్థాయి అధికారులతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమీక్ష

-రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశం. -రూ.2,500 కోట్లతో చేపట్టిన 6,061 కి.మీ రహదారి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *