గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జారీ చేసిన జీఓ ఎం.ఎస్. నం. 30 ప్రకారం అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో నివాస గృహాలు ఏర్పాటు చేసుకున్న పేదలకు నిబందనల ప్రకారం త్వరితగతిన క్రమబద్దీకరణ చేయడానికి వేగవంతంగా చర్యలు తీసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్‌లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి ఆయన ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అడవితక్కెళ్లపాడు, చౌడవరం మరియు ప్రగతి నగర్ ప్రాంతాల్లో జరుగుతున్న సర్వే వేగవంతం చేయాలని రెవెన్యూ సెక్రెటరీలు, ప్లానింగ్ కార్యదర్శులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసిన 35 బృందాల్లోని రెవెన్యూ మరియు ప్లానింగ్ కార్యదర్శులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ సర్వే ప్రక్రియలో లోపాలు లేకుండా పక్కా సమాచారంతో రికార్డ్ చేయాలన్నారు. నిర్దేశిత చట్టం నిబంధనల ప్రకారం అభ్యంతరం లేని ప్రభుత్వ భూములలో ఏళ్ల తరబడి నివాసముంటున్న పేదలకు త్వరితగతిన హక్కు పట్టాలు అందేలా పక్కా నివేదికలు సిద్ధం చేయడంలో జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు.
సమావేశంలో అదనపు కమిషనర్ ఐ.కిషోర్, సిటి ప్లానర్ డి.రాంబాబు, తహశీల్దార్లు సుభానీ, కిరణ్ కుమార్, సర్వేయర్లు లక్ష్మీనారాయణ, సుభానీ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News