-కోడూరులో ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రం – 48 మంది విముక్త కార్మికులకు త్వరలో బ్యాంకు ఖాతాల ప్రారంభం
-పరిహారం, పునరావాసం, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా జిల్లా యంత్రాంగం చర్యలు
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
కోడూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వెట్టిచాకిరి నుంచి విముక్తులైన యానాది కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం, పునరావాసం, జీవనోపాధి అవకాశాలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా అందేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి తెలిపారు. కోడూరు మండల ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ క్యాంపును బుధవారం జిల్లా కలెక్టర్ సందర్శించారు.
గతంలో కొంతమంది యానాదులు వెట్టిచాకిరికి గురవుతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసు, రెవెన్యూ, కార్మిక శాఖల అధికారులు సంయుక్తంగా విచారణ చేపట్టి వారిని వెట్టిచాకిరి నుంచి విముక్తి చేసిన విషయం తెలిసిందే. అనంతరం వారికి ప్రభుత్వం నుంచి అందించాల్సిన పరిహారం, పునరావాసం, జీవనోపాధి అవకాశాల కల్పనకు సంబంధించి అధికారులు సమగ్ర పరిశీలన నిర్వహించారు.
ఈ పరిశీలనలో విముక్తులైన 48 మంది వెట్టిచాకిరి బాధితులకు బ్యాంకు ఖాతాలు లేకపోవడం, మరికొందరికి ఆధార్ కార్డులు కూడా లేకపోవడం గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. దీంతో ప్రభుత్వ ఆర్థిక సహాయం, పరిహారం, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో బాధితుల సౌకర్యార్థం కోడూరులో ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అర్హులందరికీ ఆధార్ నమోదు, ఆధార్ నవీకరణ ప్రక్రియ చేపట్టడంతో పాటు సంబంధిత బ్యాంకుల సమన్వయంతో బ్యాంకు ఖాతాల ప్రారంభ ప్రక్రియను కూడా చేపట్టినట్లు చెప్పారు. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు మచిలీపట్నం ఆర్డీవో, సంబంధిత బ్యాంకుల నోడల్ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆధార్ నమోదు, బ్యాంకు ఖాతాల ప్రారంభ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రభుత్వం నుంచి అందించాల్సిన పరిహారం, ఇతర ఆర్థిక సహాయాలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
అదేవిధంగా వెట్టిచాకిరి నుంచి విముక్తులైన కుటుంబాలు తిరిగి అటువంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా వారి జీవనోపాధి మెరుగుపడేలా సంబంధిత శాఖల సమన్వయంతో అవసరమైన పునరావాస చర్యలు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రతి అర్హుడికి ప్రభుత్వం అందించే పరిహారం, సంక్షేమ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో చేరేలా జిల్లా యంత్రాంగం కట్టుబడి పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు.
కార్యక్రమంలో బందరు ఆర్డిఓ కే సాంబశివరావు, అవనిగడ్డ డీఎస్పీ అభిషేక్, లీడ్ బ్యాంకు మేనేజర్ రవీంద్రారెడ్డి, స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సచివాలయాల జిల్లా సమన్వయ అధికారి రవికాంత్, యానాది కమ్యూనిటీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News