-వలస కార్మికులు, బంధిత కార్మికుల మధ్య వ్యత్యాసంపై స్పష్టమైన అవగాహన అవసరం
-జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో బంధిత కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
విజయవాడ కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బాండెడ్ లేబర్ సిస్టమ్ (అబాలిషన్) సమావేశంలో అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. సమావేశం ప్రారంభంలో కమిటీ సభ్యులు బంధిత కార్మిక వ్యవస్థ (నిర్మూలన) చట్టం-1976 నిబంధనలు, అమలు విధానం, బాధితులను గుర్తించే ప్రక్రియ, పునరావాస చర్యలు తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులకు సమగ్ర అవగాహన కల్పించారు. బంధిత కార్మిక వ్యవస్థ నిర్మూలనలో ప్రతి శాఖ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ వలస కార్మికులు స్వచ్ఛందంగా ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి పనిచేస్తారని, బంధిత కార్మికులు మాత్రం అప్పులు, బెదిరింపులు, బలవంతం లేదా ఇతర పరిస్థితుల కారణంగా యాజమాన్యానికి లోబడి పనిచేయాల్సిన పరిస్థితిలో ఉంటారని వివరించారు. ఈ రెండు వర్గాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అధికారులు స్పష్టంగా గుర్తించి, వాస్తవ పరిస్థితులను నిర్ధారించిన తర్వాతే చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని క్వారీలు, ఇటుక బట్టీలు, ఇసుక బట్టీలు, ఇతర కార్మికులు అధికంగా పనిచేసే ప్రాంతాల్లో కార్మిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు తరచూ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బంధిత కార్మిక వ్యవస్థకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. క్వారీ యాజమాన్యాలు, ఇటుక బట్టీల నిర్వాహకులు, ఇతర పరిశ్రమల యజమానులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బంధిత కార్మిక వ్యవస్థ (నిర్మూలన) చట్టంపై సమగ్ర అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే ఎదురయ్యే శిక్షలు, చట్టపరమైన పరిణామాలపై కూడా వారికి స్పష్టంగా వివరించాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ మాట్లాడుతూ బంధిత కార్మిక వ్యవస్థ నిర్మూలనలో స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. సంబంధిత వ్యక్తులు వలస కార్మికులా, బంధిత కార్మికులా అన్న అంశాన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు. రెవెన్యూ, కార్మిక, పోలీసు, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలతో పాటు అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే బంధిత కార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యాన్ని సమర్థవంతంగా సాధించగలమని పేర్కొన్నారు.
సమావేశంలో జిల్లా కార్మిక శాఖ అధికారి జి.ధనలక్ష్మి, వాసవ్య మహిళా మండలి సోషల్ వర్కర్ కె.విజయ, దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ప్రతినిధి రమాదేవి, ఎస్‌సి సభ్యులు బూరుగు నారాయణ, సోషల్ వర్కర్ జి.తిరుపతిరావు, డీపీఓ మహాలక్ష్మి, సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి.శివరాం ప్రసాద్, డీఆర్‌డీఏ అధికారి, వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News