Breaking News

సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన లంకా దినకర్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని ఈరోజు రాష్ట్ర సచివాలయంలో ఇరవై సూత్రాల కార్యక్రమాలు (వికసిత్ భారత్ – స్వర్ణ ఆంధ్రప్రదేశ్) అమలు ఛైర్మెన్ లంకా దినకర్ మర్యాదపూర్వకంగా కలిసి, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రెండు దశలుగా నిర్వహించిన సమీక్ష సమావేశాల నివేదికను సమర్పించారు. అలాగే రాష్ట్రస్థాయిలో నిర్వహించిన వివిధ అంశాల సమీక్షలు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలును అధ్యయనం చేసేందుకు వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన అధ్యయన పర్యటనల వివరాలను కూడా ముఖ్యమంత్రికి అందజేశారు.

ఈ సందర్భంగా కొడుమూరు మరియు మదనపల్లి పర్యటనల్లో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలపై గతంలో తాను లేఖ ద్వారా చేసిన సూచనలను గుర్తు చేస్తూ, ముఖ్యమంత్రి వాటిని సంబంధిత శాఖలకు పరిశీలన కోసం పంపినందుకు లంకా దినకర్ కృతజ్ఞతలు తెలిపారు. చేనేత కార్మికుల ఆరోగ్య రక్షణ కోసం ప్రత్యేక చర్యలు, గృహనిర్మాణ పథకాలలో స్థలానికి సంబంధించిన నిబంధనల్లో అవసరమైన వెసులుబాట్లు, స్వయం సహాయక సంఘాల తరహాలో సూక్ష్మ చేనేత గ్రూపుల ఏర్పాటు చేసి రివాల్వింగ్ ఫండ్ రుణ సదుపాయం కల్పించడం, టీటీడీ వంటి ప్రభుత్వ సంస్థల వస్త్రాల కొనుగోళ్లలో ఈ సూక్ష్మ గ్రూపులకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలను ముఖ్యమంత్రికి మరోసారి వివరించారు.

రాష్ట్ర భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని, దీర్ఘకాలిక నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు అదనపు సామర్థ్యంతో కొత్త రిజర్వాయర్ల నిర్మాణం, ఇప్పటికే ఉన్న రిజర్వాయర్లలో పూడిక తొలగింపు (డీసిల్టింగ్) కార్యక్రమాలను జాతీయ స్థాయి మిషన్‌గా చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని ముఖ్యమంత్రికి లంకా దినకర్ సూచించారు.

అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన తూర్పు మరియు పశ్చిమ భారతదేశాన్ని రహదారి, రైల్వే, జలమార్గాల ద్వారా అనుసంధానించే సమగ్ర మౌలిక సదుపాయాల ప్రణాళిక దేశ ఆర్థికాభివృద్ధికి కొత్త దిశను చూపుతుందని లంకా దినకర్ పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన ద్వారా విశాఖపట్నం–ముంబై మధ్య పారిశ్రామిక, వాణిజ్య అనుసంధానం బలోపేతమై, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు, అలాగే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంకల్పించిన వికసిత్ భారత్–2047 దిశగా కీలకమైన ముందడుగు పడుతుందని ఆయన అన్నారు.

ఇప్పటికే ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌వే దేశ ఆర్థిక ప్రగతికి బలమైన పునాది వేస్తోందని, అలాగే రాయలసీమ మీదుగా నిర్మాణంలో ఉన్న సూరత్–చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే పూర్తయిన తర్వాత ఢిల్లీ నుంచి చెన్నై వరకు ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య వేగవంతమైన అనుసంధానం ఏర్పడుతుందని లంకా దినకర్ తెలిపారు. అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తూర్పు–పశ్చిమ భారత అనుసంధాన ప్రణాళిక దేశవ్యాప్తంగా సమతుల్య పారిశ్రామికాభివృద్ధికి, రవాణా సామర్థ్య పెంపుకు, పెట్టుబడుల ఆకర్షణకు మరియు ఉపాధి అవకాశాల విస్తరణకు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తిరుపతిలో జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాటు వేగవంతం చేయండి

-కేంద్ర పాఠశాల విద్యా కార్యదర్శిని కోరిన తిరుపతి ఎంపీ గురుమూర్తి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *