అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 1391 వ (54వ) క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు.
1. పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ:
విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (VER) కార్యక్రమం కింద GVMC పరిధిలోని జోన్-IV, వార్డు నెం.35లో ఉన్న వెలంపేట మురికివాడ పునరాభివృద్ధిని డిజైన్, బిల్డ్, ఫైనాన్స్ అండ్ ట్రాన్స్‌ఫర్ (DBFT) పద్ధతిలో చేపట్టేందుకు GVMC కమిషనర్‌కు అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
GVMC యాజమాన్యంలోని 1,986.45 చ.మీ. స్థలంలో ప్రస్తుతం నివసిస్తున్న 177 EWS కుటుంబాలకు అక్కడికక్కడే పునరావాసం కల్పించేందుకు షేర్‌వాల్ టెక్నాలజీతో స్టిల్ట్ + 12 అంతస్తుల భవనం నిర్మించనున్నారు. PPP/DBFT విధానంలో 24 నెలల్లో ప్రాజెక్ట్ పూర్తి చేయడంతో పాటు, TDR ద్వారా రూ.17.07 కోట్ల నిధుల కొరతను భర్తీ చేస్తారు. ఈ ప్రాజెక్టును VER కార్యక్రమం కింద ఇతర మురికివాడల పునరావాసానికి పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు.
2. పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ:
ఆంధ్రప్రదేశ్ పెడెస్ట్రెయిన్ (పాదాచారులు) సేఫ్టీ అండ్ యునివర్సల్ ఆక్సెస్బిలిటీ పాలసీ -2026ను, దాని ఆపరేషనల్ మార్గదర్శకాలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఈ పాలసీ ప్రకారం పాదచారుల మరణాలను పూర్తిగా నివారించే లక్ష్యంతో జీరో టాలరెన్స్ విధానం అమలు చేసి, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించి అవరోధరహిత, సురక్షిత పాదచారి మార్గాలను ఏర్పాటు చేయాలి.
అన్ని పట్టణ రహదారులపై శాస్త్రీయ రోడ్ సేఫ్టీ ఆడిట్‌లు నిర్వహించి, గత 2–3 సంవత్సరాల ప్రమాద డేటా ఆధారంగా అధిక ప్రమాదాలు నమోదైన 15–20 బ్లాక్‌స్పాట్‌లు, కూడళ్లు, పాఠశాలలు మరియు అధిక పాదచారుల రద్దీ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తారు. IRC ప్రమాణాలకు అనుగుణంగా ఫుట్‌పాత్‌లు, క్రాసింగ్‌లు, సబ్‌వేలు, FOBలు, లైటింగ్ తదితరాలను భద్రతాపరంగా మెరుగుపర్చాలి.
ఆక్రమణల నియంత్రణకు GIS మ్యాపింగ్, CCTV మరియు కెమెరా ఆధారిత పర్యవేక్షణ చేపట్టి, ఏడాదిలో కనీసం 20% రోడ్లను దశలవారీగా సర్వే చేసి, గుర్తించిన లోపాలను వేగంగా పరిష్కరించాలి.
ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెంచేందుకు IEC ప్రచారాలు, సామాజిక పోలీసింగ్, RWAలు మరియు పౌరుల భాగస్వామ్యం ద్వారా ప్రవర్తనా మార్పును తీసుకురావాలి.
అలాగే C&D వ్యర్థాలను శాస్త్రీయంగా రీసైకిల్ చేసి ఫుట్‌పాత్ టైల్స్, కర్బ్‌లు, బొల్లార్డులు, వీధి ఫర్నిచర్ వంటి మౌలిక వసతుల తయారీలో వినియోగించేలా రాష్ట్రస్థాయి సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేయాలి. మౌలిక వసతుల వైఫల్యాలకు వ్యక్తిగత బాధ్యతను నిర్ధారించి, సెక్షన్ 198-A కింద అవసరమైన శిక్షలు, ₹1 లక్ష వరకు జరిమానాలు విధించేలా చర్యలు చేపట్టాలి.
3. న్యాయ & హోం శాఖ:
ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు – క్రిమినల్ లా (ఆంధ్రప్రదేశ్ సవరణ) బిల్లు, 2019ను ఉపసంహరించుకునేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాలపై వేగవంతమైన దర్యాప్తు, విచారణ కోసం ఉద్దేశించిన “ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు – క్రిమినల్ లా (ఆంధ్రప్రదేశ్ సవరణ) బిల్లు, 2019”ను రాష్ట్రపతి ఆమోదం కోసం గతంలో పంపిన ఈ బిల్లును పరిశీలించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. పలు నిబంధనలపై వివరణలు కోరడంతో పాటు, కేంద్ర ప్రభుత్వ శాఖల సూచనలు పొందుపరిచి కొత్త బిల్లును సమర్పించేలా ప్రస్తుత బిల్లును వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
మరోవైపు, పాత ఐపీసీ (IPC – 1860) మరియు సీఆర్‌పీసీ (CrPC – 1973) చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ‘భారతీయ న్యాయ సంహిత – 2023’, ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత – 2023’ చట్టాలు 01.07.2024 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి.
దిశ బిల్లు ద్వారా సాధించాలనుకున్న మహిళలు, చిన్నారుల రక్షణ లక్ష్యాలను, కఠిన చట్టపరమైన నిబంధనలను ఈ కొత్త కేంద్ర చట్టాలు ఇప్పటికే బలోపేతం చేశాయి. కేంద్ర హోం శాఖ సూచనలు, నూతన క్రిమినల్ చట్టాల అమలు నేపథ్యంలో దిశ బిల్లును ఉపసంహరించుకోవడమే సబబు అని రాష్ట్ర డీజీపీ (DGP) మరియు న్యాయ శాఖ ఇచ్చిన స్పష్టమైన అభిప్రాయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును వెనక్కి తీసుకునే ప్రతిపాదనకు క్యాబినెట్ అధికారికంగా ఆమోదముద్ర వేసింది.
4. ఇంధన శాఖ:
ఆక్వాకల్చర్ ఫామ్‌లకు యూనిట్‌కు రూ.1.50 చొప్పున ఇస్తున్న విద్యుత్ టారిఫ్ రాయితీను తే.01.06.2026 నుండి పొడిగించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల ఆక్వా రైతులకు దాదాపు రూ.1150 కోట్ల మేర విద్యుత్ రాయితీని అందించడం జరుగుతుంది.
5. ఇంధన శాఖ:
పారిశ్రామిక పార్కుల్లో విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనకు APIIC ఫెసిలిటేటర్‌గా మూలధన వ్యయాన్ని భరిస్తున్న పనులన్నింటికీ APTRANSCO/APDISCOMలు విధించే పర్యవేక్షణ ఛార్జీలను 2.5 శాతానికి తగ్గించేందుకు మరియు అభివృద్ధి ఛార్జీలను మినహాయించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
6. రెవెన్యూ (భూములు) శాఖ:
కండలేరు రిజర్వాయర్ నుండి శ్రీ సిటీలోని పారిశ్రామిక క్లస్టర్లకు నీటి సరఫరా కోసం DI నీటి పైప్‌లైన్ నిర్మాణానికి తిరుపతి జిల్లా రిజర్వ్ ఫారెస్టులో 1.76 హెక్టార్ల అటవీ భూమిని మళ్లించడం జరిగింది. దీనికి ప్రత్యామ్నాయంగా SPSR నెల్లూరు జిల్లా రాపూరు మండలం పంగిలి గ్రామంలో LPM నెం.1570లో ఉన్న 8.70 ఎకరాల ప్రభుత్వ భూమిని అటవీ శాఖకు కేటాయించేందుకు వీలుగా, సాధారణ నిబంధనలకు లోబడి ZM, APIIC, నెల్లూరుకు బదిలీ చేసేందుకు రెవెన్యూ (భూములు) శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
7. రెవెన్యూ (భూములు) శాఖ:
PM-కుసుమ్ ఫీడర్ లెవల్ సోలరైజేషన్ పథకం కింద సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం YSR కడప జిల్లా పోరుమామిళ్ల మండలం చెర్లోపల్లి గ్రామంలో 49.67 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన NREDCAP వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌కు బదిలీ చేసేందుకు రెవెన్యూ (భూములు) శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
8. రెవెన్యూ (భూములు) శాఖ:
PM-కుసుమ్ ఫీడర్ లెవల్ సోలరైజేషన్ పథకం కింద సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం YSR కడప జిల్లా వేముల (గ్రామం & మండలం)లో 51.37 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన NREDCAP వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌కు బదిలీ చేసేందుకు రెవెన్యూ (భూములు) శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
9. రెవెన్యూ (భూములు) శాఖ:
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం కప్పలబండ గ్రామంలో 2.00 ఎకరాల భూమిని జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో జిల్లా TDP కార్యాలయ నిర్మాణం కోసం లీజు ప్రాతిపదికన TDPకి బదిలీ చేసేందుకు రెవెన్యూ (భూములు) శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
10. రెవెన్యూ (భూములు) శాఖ:
శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం ఏదుల ముస్తూరు గ్రామంలో 19.56 ఎకరాల భూమిని ఎకరానికి రూ.30.00 లక్షల మార్కెట్ విలువ చెల్లింపుపై, SDR అందిన అనంతరం సాధారణ షరతులకు లోబడి APIICకి బదిలీ చేసేందుకు రెవెన్యూ (భూములు) శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
11. రెవెన్యూ (భూములు) శాఖ:
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం వలసపల్లె గ్రామంలో 2.00 ఎకరాల భూమిని జిల్లా కేంద్రంలో జిల్లా TDP కార్యాలయ నిర్మాణం కోసం లీజు ప్రాతిపదికన TDPకి బదిలీ చేసేందుకు రెవెన్యూ (భూములు) శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
12. రెవెన్యూ (భూములు) శాఖ:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం (గ్రామం & మండలం) నదిపూడి గ్రామ పంచాయతీలో 2.00 ఎకరాల ప్రభుత్వ భూమిని జిల్లా TDP కార్యాలయ భవన నిర్మాణం కోసం లీజు ప్రాతిపదికన TDPకి ఇచ్చేందుకు రెవెన్యూ (భూములు) శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
13. రెవెన్యూ (భూములు) శాఖ:
చిత్తూరు జిల్లా చిత్తూరు మండలం తిమ్మసముద్రం గ్రామంలో 13.47 ఎకరాల భూమిని లేఔట్ అభివృద్ధి కోసం సాధారణ నిబంధనలకు లోబడి చిత్తూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్‌కు బదిలీ చేసేందుకు రెవెన్యూ (భూములు) శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
14. రెవెన్యూ (భూములు) శాఖ:
నెల్లూరు జిల్లా కండలేరు రిజర్వాయర్ నుండి శ్రీ సిటీలోని పారిశ్రామిక క్లస్టర్లకు నీటి సరఫరా కోసం DI నీటి పైప్‌లైన్ నిర్మాణానికి నెల్లూరు డివిజన్ రిజర్వ్ ఫారెస్టులో 1.30 హెక్టార్ల అటవీ భూమిని మళ్లించడం జరిగింది. దీనికి ప్రత్యామ్నాయంగా 6.42 ఎకరాల ప్రభుత్వ భూమిని అటవీ శాఖకు కేటాయించేందుకు వీలుగా, సాధారణ నిబంధనలకు లోబడి ZM, APIIC, నెల్లూరుకు బదిలీ చేసేందుకు రెవెన్యూ (భూములు) శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
15. పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ:
నూతనంగా పునర్వ్యవస్థీకరించిన జిల్లాల పరిధికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థలను పునర్వ్యవస్థీకరించేందుకు ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీస్ (APMRUDA) చట్టం, 2016లోని సెక్షన్ 3 ప్రకారం ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారు.
16. పరిశ్రమలు & వాణిజ్య శాఖ:
విజయవాడ జవహర్ ఆటోనగర్‌లోని APIIC హౌసింగ్ కాలనీలో 404 గృహ యూనిట్లకు (MIG–64, LIG–108, EWS–232) అర్హులైన కేటాయింపుదారులు, తదుపరి కొనుగోలుదారులు, వారి చట్టబద్ధ వారసులు, వారసులు/సక్సెసర్లు మరియు ప్రస్తుత యజమానులకు సమాన ప్రాతిపదికన భూమి అవిభాజ్య వాటా, ఉమ్మడి స్థల హక్కులను క్రమబద్ధీకరించడం/కన్వేయన్స్ చేయడం, అలాగే అర్హత కలిగిన కేటాయింపుదారులు, చట్టబద్ధ వారసులు, సక్సెసర్లు, ప్రస్తుత యజమానుల విషయంలో అవసరమైన ర్యాటిఫికేషన్ డీడ్లను అమలు చేయడానికి ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
17. పరిశ్రమలు & వాణిజ్య శాఖ:
ఆమోదిత ప్రాజెక్టు ఆర్థిక వనరుల సమీకరణలో భాగంగా, రుణ వాటా కోసం HUDCO మంజూరు చేసిన రూ.680.21 కోట్ల టర్మ్ లోన్‌ను AP బల్క్ డ్రగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా పొందేందుకు ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
18. పరిశ్రమలు & వాణిజ్య శాఖ:
G.O.Ms.No.89, I&C శాఖ, తే.11.12.2024 ద్వారా నోటిఫై చేసిన ఆంధ్రప్రదేశ్ టెక్స్‌టైల్స్, అపారెల్ & గార్మెంట్స్ (TAG) పాలసీ (4.0) 2024-29లో ఉపాధి ఆధారిత ప్రోత్సాహకానికి సంబంధించిన క్లాజ్ 5.3(5)ను సవరించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
19. న్యాయ శాఖ:
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, వాణిజ్య కార్యకలాపాల నిర్వహణను మరింత సులభతరం చేసే (Ease of Doing Business) ఉద్దేశ్యంతో పలు చట్టాలను ఏకకాలంలో సవరించే లక్ష్యంతో ప్రతిపాదించిన “ఆంధ్రప్రదేశ్ ఆమ్‌నిబస్ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) చట్టం, 2026” రూపకల్పనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో పెట్టుబడిదారులకు మరింత అనుకూలమైన పారిశ్రామిక వాతావరణాన్ని సృష్టించడం, వ్యాపారాలకు ఆటంకంగా ఉన్న పాత నిబంధనలను సరళీకృతం చేయడం, అనుమతుల ప్రక్రియలో ఉన్న అడ్డంకులను తొలగించడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యం. ఒకే బిల్లు (ఆమ్‌నిబస్) ద్వారా వివిధ చట్టాల్లో అవసరమైన సంస్కరణలను తీసుకురావడం ద్వారా ప్రభుత్వ విధానాలను మరింత పారదర్శకంగా మార్చనున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోకి భారీగా జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేసి యువతకు విశేషంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరనుంది.
20. రెవెన్యూ శాఖ:
చిత్తూరు జిల్లా, కుప్పం మండలంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియను సజావుగా, వేగవంతంగా పూర్తి చేసేందుకు, డి-ఫారం పట్టాలు లేకుండా భూములను దీర్ఘకాలంగా సాగు చేస్తూ స్వాధీన అనుభవంలో ఉన్న రైతులు/సాగుదారులు భూముల అభివృద్ధికి చేసిన గణనీయ పెట్టుబడులు, భూసేకరణ వల్ల వారి జీవనోపాధిపై పడే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని, ఎకరాకు రూ.12.44 లక్షల చొప్పున నష్ట పరిహారం చెల్లించేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ చెల్లింపు భవిష్యత్ క్లెయిమ్‌లకు ఎటువంటి పూర్వనిదర్శనంగా పరిగణించకుండా, ఒకేసారి, కేసు-ప్రత్యేక చర్యగా అమలు చేయనున్నారు.
21. పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ:
2026-27 ఆర్థిక సంవత్సరానికి రైతులకు యాన్యుటీల చెల్లింపు కోసం ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి రూ.300.00 కోట్ల రుణాన్ని పొందేందుకు APCRDA కమిషనర్ తీసుకున్న చర్యను ధృవీకరించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
22. పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ:
అమరావతి క్యాపిటల్ సిటీలో అమరావతి ఐ (Amaravati Eye) అభివృద్ధిని PPP-డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (DBFOT) పద్ధతిలో చేపట్టేందుకు టెండర్‌ను తిరిగి పిలిచేందుకు అనుమతించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
23. పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ:
CRDA ప్రాంతంలోని వివిధ సంస్థలకు కొత్త భూ కేటాయింపులు మరియు గతంలో జరిపిన కేటాయింపుల సమీక్షకు సంబంధించిన కొత్త ప్రతిపాదనలపై GoM 28వ సమావేశం చేసిన సిఫార్సులను, APCRDA అథారిటీ తీర్మానం నెం.690/2026 ద్వారా ఆమోదించిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. జీఓఎం ప్రతిపాదనలు….
•GSI – కొత్త అనుమతులు: అనంతవరం సర్వే నం.221(P)లో 1.50 ఎకరాలు రాష్ట్ర ప్రధాన కార్యాలయం, ల్యాబొరేటరీ, మ్యూజియం కోసం ఎకరాకు రూ.4.1 కోట్ల చొప్పున 30 ఏళ్ల లీజుకు, మరో 0.57 ఎకరాలు అభివృద్ధి, పార్కు నిర్వహణ కోసం లీజుకు ప్రతిపాదించారు.
•CAG – అనుమతి సవరణ: ఐనవోలులో గతంలో కేటాయించిన 12 ఎకరాల నుంచి 5 ఎకరాలను ఫ్రీహోల్డ్ పద్ధతిలో, స్థల మార్పిడితో స్టాఫ్ క్వార్టర్స్ కోసం కేటాయించేందుకు ప్రతిపాదన.
•APIIC – కన్వెన్షన్ సెంటర్: ఐనవోలులో కేటాయించిన భూమిని 8 ఎకరాల నుంచి 5.09 ఎకరాలకు తగ్గించి, స్థల మార్పిడితో APCRDA పరిధిలో కేటాయించేందుకు ప్రతిపాదన.
•APIIC–HUDCO జాయింట్ వెంచర్: గతంలో HUDCOకు కేటాయించిన 9.17 ఎకరాల ఫ్రీహోల్డ్ కేటాయింపును రద్దు చేసి, MIC & మౌలిక వసతుల కోసం 10.20 ఎకరాలను CRDAకు పూర్తి హక్కులతో స్థల మార్పిడి ద్వారా కేటాయించేందుకు ప్రతిపాదన.
24. పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ:
G.O.Ms.No.330, పురపాలక & పట్టణాభివృద్ధి (CRDA) శాఖ, తే.11.10.2018 మేరకు రెండో దశ భూ సమీకరణ పథకం కింద పల్నాడు జిల్లా వైకుంఠపురం గ్రామంలోని దేవదాయ ఇనాం భూములకు సంబంధించిన పరస్పర వివాద దావాలను పరిష్కరించేందుకు దేవదాయ శాఖకు రూ.122.20 కోట్ల పరిహారం చెల్లించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
25. పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ:
అమరావతి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్‌లోని క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్‌కు ఇరువైపులా T1, T2 ట్విన్ ఆఫీస్ టవర్స్ నిర్మాణానికి సంబంధించి, EDGE అడ్వాన్స్‌డ్ సర్టిఫికేషన్ ప్రమాణాలకు అనుగుణంగా షెల్ & కోర్ నిర్మాణ పనులను డిజైన్ అండ్ బిల్డ్ లంప్‌సమ్ కాంట్రాక్ట్ (శాతం టెండర్) విధానంలో చేపట్టేందుకు L1 బిడ్డర్‌ను ఖరారు చేసే ప్రక్రియను నిర్వహించడానికి AGICL మేనేజింగ్ డైరెక్టర్‌కు అధికారం కల్పించే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
26. పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ:
హైకోర్టు భవనం నిర్మిత విస్తీర్ణం పెరగడం వల్ల విస్తరించిన కన్సల్టెన్సీ సేవల పరిధికి, తదనుగుణంగా పెరిగిన కన్సల్టెన్సీ ఫీజుకు, అలాగే శాసనసభ మరియు హైకోర్టు భవనాల కోసం అదనపు స్పెషలిస్ట్ కన్సల్టెంట్లను నియమించేందుకు మరియు వారికి సంబంధించిన అదనపు కన్సల్టెన్సీ ఫీజు చెల్లింపునకు GSTతో కలిపి రూ.206.59 కోట్లు మొత్తానికి సవరించిన పరిపాలనా అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
శాసనసభ–హైకోర్టు భవనాల కన్సల్టెన్సీ: APCRDA, Hafeez Contractor, Foster + Partners (UK), Foster + Partners India కన్సార్టియంను 10.07.2025న నియమించింది. హైకోర్టు కోర్టు హాళ్లు 40 నుంచి 52కు పెరగడంతో 87,543.36 చ.అ. అదనపు బిల్ట్-అప్ ఏరియా, కన్సల్టెన్సీ పరిధి మరియు నిపుణుల వనరులు పెరిగాయి. వేగవంతమైన నిర్మాణ షెడ్యూల్‌కు అదనపు వనరులు వినియోగించాల్సి రావడంతో పాటు, GBP మారకపు రేటు ₹109 నుంచి ₹128.215కు పెరగడం వల్ల £1,910,177 చెల్లింపులకు అదనపు బడ్జెట్ అవసరం ఏర్పడింది.
27. ఆర్థిక శాఖ:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య (PPP) విధానం, 2026 ముసాయిదా బిల్లును ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చే లక్ష్యంగా రవాణా, లాజిస్టిక్స్, పోర్టులు, విమానాశ్రయాలు, పట్టణ మౌలిక వసతులు, వైద్యం, విద్య, పారిశ్రామికాభివృద్ధి, పునరుత్పాదక ఇంధనం, పర్యాటకం తదితర కీలక రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ నూతన పాలసీని తీసుకొస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రూ. 1.23 లక్షల కోట్ల విలువైన పీపీపీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పైప్‌లైన్ లో ఉండగా, ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆకర్షించి ఈ ప్రాజెక్టులను త్వరితగతిన పట్టాలెక్కించేందుకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 1,500 కోట్లను కేటాయించింది. ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించిన స్టేట్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ VGF తో పాటు, ప్రారంభ దశలో లాభదాయకంగా లేకపోయినా భవిష్యత్తులో ఆదాయం వచ్చే అవకాశమున్న ప్రాజెక్టులకు వడ్డీ లేని రుణాలు అందించేందుకు ఒక ప్రత్యేకమైన ‘బ్రిడ్జ్ ఫండ్’ను (Bridge Fund) కూడా ఈ పాలసీలో పొందుపరిచారు. పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచే పారదర్శక విధానాల ద్వారా భారీ ఎత్తున ప్రైవేట్ పెట్టుబడుల సమీకరణ, పీపీపీ ప్రాజెక్టుల సత్వర అమలు, ప్రాజెక్టుల పర్యవేక్షణ (governance) మరియు ప్రజలకు మెరుగైన నాణ్యమైన సేవలందించడం ఈ పాలసీ ప్రధాన ఉద్దేశం.
28. ఉన్నత విద్యా శాఖ:
ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీల (స్థాపన, నియంత్రణ) చట్టం, 2016 (2016 నాటి చట్టం నం.3)లోని షెడ్యూల్‌కు సవరణలు చేసి, “RVS యూనివర్సిటీ”, “ప్రగతి యూనివర్సిటీ” పేర్లను చేర్చడంతో పాటు, సంబంధిత స్పాన్సరింగ్ బాడీలకు బ్రౌన్‌ఫీల్డ్ కేటగిరీ కింద ఈ రెండు ప్రైవేట్ యూనివర్సిటీలను స్థాపించేందుకు అనుమతిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలన్న ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
29. పాఠశాల విద్యా శాఖ:
నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాలకు అనుగుణంగా 15 జిల్లా విద్యాశాఖాధికారి (DEO) పోస్టులను సృష్టించడంతో పాటు, మొత్తం DEO పోస్టుల్లో 50 శాతం పోస్టులను ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేయడానికి, రాబోయే గ్రూప్–I నోటిఫికేషన్‌లో 14 DEO ఖాళీలను చేర్చి భర్తీ చేసేందుకు అవసరమైన ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీస్ రూల్స్, 1998లో తగిన సవరణలు చేయాలన్న ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
జిల్లా విద్యాశాఖాధికారి (DEO) పోస్టుల్లో 50 శాతం పోస్టులను రాబోయే APPSC గ్రూప్–1 నోటిఫికేషన్‌లో జాబ్ క్యాలెండర్‌లో భాగంగా భర్తీ చేయనున్నారు.
30. జల వనరుల శాఖ:
రాబోయే గోదావరి పుష్కరాలు-2027 దృష్ట్యా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పోలవరం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, కాకినాడ మరియు ఏలూరు జిల్లాల్లో 238 “స్నాన ఘట్టాల పనులు” మరియు ఇతర పనుల కోసం రూ.210.06 కోట్లకు పరిపాలనా అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
31. ఐ.టి.ఇ & సి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ టవర్లు మరియు అనుబంధ టెలికాం మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రభుత్వ భూమిని అద్దె రుసుము లేకుండా అందించడంతో పాటు, రాయితీతో కూడిన విద్యుత్ సరఫరా కల్పించేందుకు ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
32. పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ:
గుంటూరు జిల్లా తాడికొండ మండలం, మోతడక గ్రామంలోని మొత్తం 2344.12 ఎకరాల భూమిలో, అమరావతి మీదుగా ఎర్రుపాలెం – నంబూరు మధ్య కొత్త బ్రాడ్ గేజ్ (BG) రైల్వే లైన్ (ఇరువైపులా 50 మీటర్ల చొప్పున మొత్తం 100 మీటర్ల బఫర్ జోన్‌తో) నిర్మాణం మరియు ఇన్నర్ రింగ్ రోడ్ (IRR) ఏర్పాటు కోసం గ్రామసభ తీర్మానానికి అనుగుణంగా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (LPS) చేపట్టేందుకు APCRDA కమిషనర్‌కు అనుమతినిచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది
రైల్వే మంత్రిత్వ శాఖ రూ. 2,047.40 కోట్ల అంచనా వ్యయంతో 56.53 కి.మీ మేర ఈ కొత్త రైల్వే లైన్‌ను ప్రతిపాదించగా, భూసేకరణకు బదులుగా ల్యాండ్ పూలింగ్ (LPS) విధానంలో తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చేందుకు మోతడక గ్రామ సభ తీర్మానించడం విశేషం. ఈ ప్రాజెక్టుల ద్వారా రాజధాని అమరావతికి నేరుగా రైలు మరియు రోడ్డు అనుసంధానం ఏర్పడి ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. అంతేకాకుండా పారిశ్రామిక, వాణిజ్య, ఐటీ, విద్య, వైద్య, పర్యాటక రంగాల్లో భారీగా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఆర్థిక వృద్ధికి, అలాగే శాటిలైట్ టౌన్ల అభివృద్ధికి ఇది విశేషంగా దోహదపడుతుంది. ఈ పథకం కింద స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు, యాన్యుటీ, ఒకేసారి వ్యవసాయ రుణ మాఫీ, పెన్షన్లు తదితర ప్రయోజనాలు LPS నిబంధనల ప్రకారం అందనున్నాయి.
33. జల వనరుల శాఖ:
శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో “హంద్రీ-నీవా సుజల స్రవంతి (HNSS) ప్రాజెక్ట్ ఫేజ్-II” కింద 400.500 కి.మీ నుండి 485.300 కి.మీ వరకు ఉన్న ప్రధాన కాలువకు సంబంధించిన మిగిలిపోయిన పనులకు (5 పనులు) రూ. 600.48 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతి మంజూరు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్.విశ్వనాథన్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News