Breaking News

జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను పరిశీలించిన వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం గుంటూరులోని నాయుడుపేట ప్రాంతంలో ఉన్న జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను ఇంజినీరింగ్, శానిటేషన్ విభాగాల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ ప్లాంట్‌లో వ్యర్థాల నిర్వహణ, వ్యర్థాలను వేరు చేసే విధానం, సెన్సార్ల సహాయంతో వివిధ రకాల వ్యర్థాలను గుర్తించే సాంకేతికత, ఆధునిక యంత్రాలు మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్రక్రియను అధికారులు, సిబ్బందితో కలిసి పరిశీలించారు.

జిందాల్ ప్లాంట్ జనరల్ మేనేజర్ రామకృష్ణ, తన సిబ్బందితో కలిసి ప్లాంట్‌లో జరుగుతున్న ప్రక్రియలను ముందుగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిషనర్‌కు వివరించారు. అనంతరం వ్యర్థాల స్వీకరణ నుంచి వాటి శుద్ధి, వేరు చేయడం, ప్రాసెసింగ్, విద్యుత్ ఉత్పత్తి వరకు ప్రతి దశను క్షేత్రస్థాయిలో స్వయంగా చూపించి వివరించారు.

ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, విజయవాడ నగరంలో ఉత్పత్తి అవుతున్న వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించుకుని వాటి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే విధంగా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలించాలని ఆదేశించారు.

విజయవాడలో సేకరించే వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెస్ చేసి విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు, భవిష్యత్తులో ఆ విద్యుత్‌ను విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, ఎస్టేట్ విభాగం తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించుకునే విధంగా ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

ప్రస్తుతం విజయవాడ నగరంలోని వ్యర్థాలను గుంటూరులోని ప్లాంట్‌కు తరలిస్తున్న విధంగానే, అవసరమైన సందర్భంలో ఇతర ప్రాంతాల నుంచి వ్యర్థాలను విజయవాడకు తీసుకువచ్చి నగరంలోనే వాటి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశాలను కూడా పరిశీలించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.

వ్యర్థాలను సమస్యగా కాకుండా వనరుగా మార్చే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని, విజయవాడను మరింత పరిశుభ్రంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించాలని కమిషనర్ సూచించారు.

ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ పి. సత్యకుమారి, పర్యవేక్షణ ఇంజనీర్ (ప్రాజెక్ట్స్) కే.దుష్యంత్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇంచార్జ్ డాక్టర్ గోపాల నాయక్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, జిందాల్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *