-మట్టిలో మాణిక్యాలు గుర్తించడమే ఈ అమరావతి ఛాంపియన్షిప్ -2026 యొక్క ప్రధాన లక్ష్యం.
-గత రెండు నెలల నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పోటీలను ఘనంగా నిర్వహిస్తున్నాము
-రేపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొంటున్నారు… శాప్ చైర్మన్ రవి నాయుడు
-ఈనెల 29వ తేదీన రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ చేతుల మీదుగా విజేతలకు రూ 91.90 లక్షలు బహుమతి ప్రధానం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈరోజు తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ తారకరామా గ్రౌండ్స్ లో అమరావతి ఛాంపియన్షిప్ – 2026 రాష్ట్రస్థాయి కి సంబంధించి తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవింద రావు IAS, పద్మావతి మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఉమా, ఎస్ వి యూనివర్సిటీ రిజిస్టర్ భూపతి నాయుడు తో కలిసి శాప్ చైర్మన్ రవి నాయుడు 26 జిల్లాలకు సంబంధించిన జెర్సీలను ఆవిష్కరించి, అనంతరం మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
అనంతరం శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ ., చరిత్రలోనే ఇంత భారీ స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించడం ఇదే తొలిసారి అని తెలిపారు. రెండు నెలల పాటు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో నిర్వహించిన అమరావతి ఛాంపియన్‌షిప్‌లో నియోజకవర్గ స్థాయిలో 2,07, 498 వేల మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారని చెప్పారు. జిల్లా స్థాయిలో 83,650 మంది క్రీడాకారులు పోటీపడ్డారని తెలిపారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారుల్లో 9, 911 మంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని, వారు 12 క్రీడాంశాల్లో పోటీపడనున్నారని వివరించారు.
ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా రూ.92 లక్షలకు పైగా నగదు ప్రోత్సాహకాలను అందించనున్నట్లు తెలిపారు. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి మండే పల్లి రాంప్రసాద్ రెడ్డి సహకారంతో అమరావతి ఛాంపియన్‌షిప్‌కు శ్రీకారం చుట్టామని రవి నాయుడు తెలిపారు. గత ఏడాది నిర్వహించిన పోటీల్లో సుమారు 28 వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారని, ఈ ఏడాది మంత్రి నారా లోకేష్ గారి సూచనల మేరకు ప్రతి పాఠశాల, కళాశాలలో పోటీలను నిర్వహించేలా కార్యక్రమాన్ని మరింత విస్తరించామని చెప్పారు.
అండర్–17 విభాగంలో బాలబాలికలకు, అండర్–23 విభాగంలో విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థులకు పోటీలు నిర్వహించామని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ క్రీడాభివృద్ధిపై ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
అమరావతి ఛాంపియన్షిప్ విజయవంతం కావడానికి విద్యాశాఖ, యువజన సర్వీసుల శాఖ, జిల్లా కలెక్టర్లు, జేసీలు, డీఈవోలు, ఎంఈవోలు, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, రిజిస్ట్రార్లు తదితరులు అందించిన సహకారం ఎంతో కీలకమని రవి నాయుడు అన్నారు. తిరుపతి జిల్లా యంత్రాంగం, ఎస్పీ, కలెక్టర్, జేసీ, మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.
తిరుపతిని అమరావతి ఛాంపియన్‌షిప్‌కు వేదికగా ఎంపిక చేయడానికి ఇక్కడ ఉన్న మౌలిక వసతులే ప్రధాన కారణమని రవి నాయుడు తెలిపారు. విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ తదితర ప్రాంతాలను పరిశీలించినప్పటికీ, ఏడు విశ్వవిద్యాలయాలతో పాటు అనేక క్రీడా మైదానాలు, కోచ్‌లు, రిఫరీలు, గ్రౌండ్ మేనేజర్లు, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్న తిరుపతి ఈ భారీ కార్యక్రమానికి అత్యంత అనుకూలమైన ప్రాంతంగా గుర్తించామని చెప్పారు.
అమరావతి ఛాంపియన్‌షిప్‌లో భాగంగా సుమారు 14 వేల మంది క్రీడాకారులు, కోచ్‌లు, సిబ్బంది తిరుపతికి రానున్నారని, వారికి వసతి, భోజనం తదితర ఏర్పాట్లు చేయడం పెద్ద సవాల్ అయినప్పటికీ జిల్లా యంత్రాంగం, టీటీడీ పూర్తి సహకారం అందిస్తున్నాయని తెలిపారు. టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, టీటీడీ అధికారులు అందిస్తున్న సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆగస్టు 24న ఉదయం 9 గంటలకు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమములో హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రవాణా మరియు క్రీడల శాఖ మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి, ప్రభుత్వ విప్ లు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, కలెక్టర్, ఎస్పీ, జేసీ, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, రిజిస్ట్రార్లు, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొననున్నారని తెలిపారు. మంత్రులు క్రీడాకారులతో కలిసి కబడ్డీ, వాలీబాల్, ఖోఖో తదితర క్రీడల్లో పాల్గొననున్నారని వెల్లడించారు.
అమరావతి ఛాంపియన్షిప్ కేవలం ఒక క్రీడా కార్యక్రమం కాదని, రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే దిశగా చేపట్టిన ఒక మహత్తర కార్యక్రమమని రవి నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని క్రీడల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలన్న ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు లక్ష్యానికి అనుగుణంగా శాప్ పనిచేస్తోందన్నారు.
గతంలో ఆగస్టు నెల అంటే స్వాతంత్ర్య దినోత్సవం గుర్తుకు వచ్చేదని, భవిష్యత్తులో ఆగస్టు నెలను స్వాతంత్ర్య వేడుకలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా క్రీడల మాసంగా నిర్వహించాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం అనే విషయం ప్రతి పాఠశాల, కళాశాల విద్యార్థికి తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో పాఠశాల స్థాయి నుంచి క్రీడలను పండుగలా నిర్వహించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.16 కోట్ల క్రీడా ప్రోత్సాహక బకాయిలను ప్రభుత్వం ఇప్పటికే క్లియర్ చేసిందని, అదనంగా సుమారు రూ.8 కోట్లు అందించామని రవి నాయుడు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 29న మరో రూ.9 కోట్ల మేర క్రీడా ప్రోత్సాహకాలను అర్హులైన క్రీడాకారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు చెప్పారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, వారికి అండగా నిలిచే విధంగా ప్రభుత్వం నిరంతరం కార్యక్రమాలు చేపడుతోందన్నారు.
అమరావతి ఛాంపియన్‌షిప్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని రవి నాయుడు అన్నారు. 26 జిల్లాల నుంచి వేలాది మంది క్రీడాకారులు తిరుపతికి వస్తున్న నేపథ్యంలో మీడియా సంస్థలు, జర్నలిస్టులు, కెమెరామెన్లు, బ్యూరో ప్రతినిధులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. అమరావతి ఛాంపియన్షిప్ విజయాన్ని రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చాటిచెప్పేలా విస్తృత ప్రచారం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
“రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్‌గా మార్చాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యాన్ని సాకారం చేసేందుకు అందరి సహకారం అవసరం. అమరావతి ఛాంపియన్షిప్ క్రీడాకారుల పండుగగా మారాలి. క్రీడాకారుల ప్రతిభకు గుర్తింపు, ప్రోత్సాహం అందించడమే ప్రభుత్వ లక్ష్యం” అని రవి నాయుడు తెలిపారు.
తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు మాట్లాడుతూ అమరావతి ఛాంపియన్షిప్–2026 రాష్ట్రస్థాయి పోటీలను తిరుపతిలో విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని శాఖలతో సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. క్రీడాకారులకు వసతి, భోజనం, రవాణా, వైద్య సేవలు, భద్రత వంటి సదుపాయాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా కల్పిస్తాం. నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు రాష్ట్రస్థాయి వేదికగా ఈ పోటీలు గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నాయి. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తూ, రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే లక్ష్యానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
*పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వీసీ ఉమాగార మాట్లాడుతూ:* అమరావతి ఛాంపియన్షిప్–2026 రాష్ట్రస్థాయి పోటీలకు తిరుపతి వేదిక కావడం గర్వకారణం. క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అవసరమైన మైదానాలు, వసతి, ఇతర సదుపాయాల కల్పనలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పూర్తి సహకారం అందిస్తోంది. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో క్రీడలకు కీలక స్థానం ఉంది. ముఖ్యంగా బాలికలు క్రీడల్లో మరింతగా పాల్గొని, ఆత్మవిశ్వాసంతో ఉన్నత విజయాలు సాధించేలా ఈ ఛాంపియన్షిప్ ప్రేరణగా నిలవాలని ఆకాంక్షించారు.
ఎస్వీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ భూపతి నాయుడు మాట్లాడుతూ అమరావతి ఛాంపియన్షిప్–2026 రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణకు ఎస్వీ యూనివర్సిటీ పూర్తి స్థాయిలో సహకరిస్తోంది. క్రీడా మైదానాలు, వసతి సదుపాయాలు, శిక్షణకు అవసరమైన వనరులను అందుబాటులో ఉంచి పోటీలను సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాం. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే క్రీడాకారులకు తమ ప్రతిభను చాటుకునేందుకు ఈ పోటీలు గొప్ప వేదికగా నిలుస్తాయి. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో పాల్గొని, ఉన్నత స్థాయిలో రాణించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇదే విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
శాప్ బోర్డు సభ్యురాలు, డబుల్ ఒలింపియన్ ఈ. రజిని మాట్లాడుతూ, తాను కూడా తిరుపతిలోని విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని, క్రీడల్లో రాణించిన రోజులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఇలాంటి మహత్తర కార్యక్రమాలను నిర్వహిస్తున్న శాప్ చైర్మన్ రవినాయుడు కి, క్రీడాశాఖ మంత్రి కు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి ఛాంపియన్షిప్–2026లో క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని, ఈ ప్రతిష్టాత్మక క్రీడా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News