-మూడేళ్లలో 13,803 కార్నియాల సేకరణ
-గత ఐదేళ్ల సేకరణలో ఇది 75 శాతం
-28 జిల్లాల్లో రేపటి నుంచి జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు
-విశాఖ, కర్నూలు కంటి ఆసుపత్రుల అవసరాలకు రూ.80 లక్షలతో అత్యాధునిక పరికరాలు
-వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో నేత్రదానంపై ప్రజల్లో అవగాహన క్రమంగా పెరుగుతోందని, అయితే ఇంకా మరింత విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా సోమవారం మంగళగిరిలోని ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో అవగాహన కరపత్రాన్ని ఆయన విడుదల చేశారు. నేత్రదానం ద్వారా కార్నియా సంబంధిత అంధత్వంతో బాధపడుతున్న వారికి చూపును అందించవచ్చని, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్‌బాబు, జాయింట్ సెక్రటరీ రోణoకి గోపాలకృష్ణ, ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ బి.స్వరణ్ రాజ్, డైరెక్టర్ జనరల్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అరుణ్ బాబు, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పద్మావతి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విష్ణువర్ధన్, NHM state project manager vihayalakshmi, జాయింట్ డైరెక్టర్, నోడల్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మూడేళ్లలో 13,803 కార్నియాలు
2019-20 నుంచి 2023-24 వరకు ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 18,400 కార్నియాలను సేకరించారు. 2024-25 నుంచి 2026-27 జూలై వరకు మూడు ఆర్థిక సంవత్సరాల్లోనే 13,803 కార్నియాలు సేకరించారు. ఇది గత ఐదేళ్లలో సేకరించిన మొత్తం కార్నియాల్లో 75 శాతానికి సమానం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సంవత్సరాల ప్రకారం పరిశీలించినప్పుడు…2023-24లో 5,039 కార్నియాలు సేకరించగా, 2024-25లో 6,112కు చేరాయి. ఏడాదిలో 1,073 కార్నియాలు అదనంగా సేకరించడంతో 21.3 శాతం వృద్ధి నమోదైంది. 2025-26లో 5,872, 2026-27లో జూలై వరకు 1,819 కార్నియాలు సేకరించారు.
కర్నూలు, విశాఖ కంటి ఆసుపత్రుల్లోనూ…
కర్నూలు, విశాఖపట్నంలోని ప్రాంతీయ కంటి ఆసుపత్రుల్లో ఐ బ్యాంకుల ఏర్పాటుకు అవసరమైన అత్యాధునిక పరికరాలను రూ.80 లక్షలతో సమకూరుస్తున్నట్లు మంత్రి తెలిపారు. సేకరించిన కార్నియాలను అక్కడ భద్రపరిచి, అవసరమైన వారికి అమర్చేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సంస్థల సమన్వయంతో రాష్ట్రవ్యాప్తంగా కార్నియా సేకరణ కొనసాగుతోందని చెప్పారు. బోధనాసుపత్రుల్లో వివిధ అనారోగ్య కారణాలతో మృతి చెందిన వారి నుంచి కుటుంబ సభ్యుల అంగీకారంతో కార్నియాలను సేకరిస్తున్నట్లు వివరించారు.
ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో మరణించిన వారి నుంచి సేకరణ
ముఖ్యంగా బోధనాసుపత్రుల్లో వివిధ అనారోగ్య కారణాలతో ప్రాణాలు విడిచిన వారి నుంచి కార్నియాలు సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆమోదంతో రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఎల్వీ ప్రసాద్, శంకర, పుష్పగిరి కంటి ఆసుపత్రుల ద్వారా కార్నియాల సేకరణ జరుగుతోంది. వీటిని ఐ బ్యాంకుల్లో భద్రపరచి అవసరమైన వారికి శస్త్ర చికిత్స ద్వారా కంటి వెలుగు (కెరటో ప్లాస్టి) ప్రసాదిస్తున్నారు.
రాష్ట్ర వైద్యారోగ్యశాఖతో ఒప్పందం కుదుర్చుకున్న ఎల్వీ ప్రసాద్, శంకర, పుష్పగిరి కంటి ఆసుపత్రుల సహకారంతో కార్నియాల సేకరణ జరుగుతోందని మంత్రి తెలిపారు. సేకరించిన కార్నియాలను ఐ బ్యాంకుల్లో భద్రపరిచి, అవసరమైన వారికి శస్త్రచికిత్స ద్వారా చూపును అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల ఆధారంగా కొనసాగుతున్న ఈ ప్రక్రియను ప్రభుత్వపరంగా కూడా అందుబాటులోకి తీసుకురావడానికి కర్నూలు, విశాఖపట్నంలోని ప్రాంతీయ కంటి ఆసుపత్రులను అత్యాధునిక పరికరాలతో సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు.
28 జిల్లాల్లో పక్షోత్సవాలు
41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు ఆగస్టు 25 నుంచి సెప్టెంబరు 8 వరకు రాష్ట్రంలోని 28 జిల్లాల్లో నిర్వహించనున్నారు. నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహలు, అపార్థాలను తొలగించి శాస్త్రీయ అవగాహన కల్పించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ప్రతిజ్ఞలు, ర్యాలీలు, సదస్సులతో పాటు పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు చేపట్టడంతో పాటు నేత్ర వైద్య నిపుణులు, నేత్ర బ్యాంకులు, స్వచ్ఛంద సంస్థలు, వైద్య సిబ్బంది, విద్యా సంస్థల భాగస్వామ్యంతో విస్తృత ప్రచారం చేపట్టనున్నారు. ఆత్మీయులను కోల్పోయిన విషాద సమయంలోనూ నేత్రదానానికి అంగీకరిస్తున్న కుటుంబాలను మంత్రి అభినందించారు. వారి మానవతా దృక్పథం మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.
Prajavartha Online Telugu News