డిసెంబ‌ర్ నాటికి ల‌బ్ధిదారుల‌కు టిడ్కో ఇళ్లు

-గృహ స‌ముదాయంలో రూ.9.70 కోట్లతో మౌలిక సదుపాయాలు
-రూ.5.10 కోట్ల‌తో ఊరచెరువు అభివృద్ధి
-ఇంధ‌న‌శాఖ‌ మంత్రి గొట్టిపాటి

అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త :
అద్ధంకి మున్సిపాలిటీలోని శింగ‌ర‌కొండ వ‌ద్ద నిర్మిస్తున్న‌ టిడ్కో గృహ స‌ముదాయాల‌ను డిసెంబ‌ర్ నాటికి ల‌బ్ధిదారుల‌కు అంద‌జేస్తామ‌ని ఇంధ‌న‌శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. టిడ్కో స‌ముదాయంలో రూ.9.70 కోట్ల‌తో ఏర్పాటు చేయ‌బోయే మౌలిక సదుపాయ‌ల ప‌నుల‌కు సోమ‌వారం ఆయ‌న భూమి పూజ చేశారు. అదే విధంగా రూ.5.10 కోట్ల‌తో చేప‌ట్టే ఊరచెరువు పునరుద్ధరణ పనులకు శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.., 960 ఇళ్ల‌కు పైగా ఉన్న టిడ్కో గృహ సముదాయంలో వ్యర్థ జలాల శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. తాగునీటి అవసరాల కోసం 2 లక్షల లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్యాంకు నిర్మిస్తున్నామని చెప్పారు. గృహ సముదాయాల చుట్టూ పక్కా ప్రహరీ గోడ, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్ల‌డించారు. వీటితో పాటు టిడ్కో ఇళ్ల సముదాయంలో విద్యుత్ సమస్యలు లేకుండా రూ.4.50 కోట్లతో ప్రత్యేక సబ్‌స్టేషన్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. లబ్ధిదారులకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్ర‌భుత్వ‌ లక్ష్యమన్నారు. టిడ్కో ఇళ్ల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను లబ్ధిదారులకు చూపించాలని ఈ సంద‌ర్భంగా గుత్తేదారులకు.. మంత్రి సూచించారు. అదే విధంగా అభివృద్ధి ప‌నుల్లో నాణ్య‌త లోపం లేకుండా ప‌నులు పూర్తి చేయాల‌ని ఆదేశించారు.

అమృత్ 2.0 నిధుల‌తో ఊరచెరువును త్వ‌రలోనే పూర్తి స్థాయిలో పున‌రుద్ధ‌రిస్తామ‌ని మంత్రి గొట్టిపాటి స్ప‌ష్టం చేశారు. వాకింగ్ ట్రాక్ లు, ప‌చ్చ‌ద‌నం, రంగు రంగుల పూల మొక్క‌ల‌తో ఆ ప్రాంతంలో పార్కుల‌ను అభివృద్ధి చేసి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకు వ‌స్తామ‌ని తెలిపారు. అద్దంకి ప‌ట్ట‌ణాన్ని మ‌రింత సుంద‌రంగా, ఆధునికంగా తీర్చిదిద్దేంకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లూ చేప‌డుతున్నామ‌న్నారు. అద్దంకి ప‌ట్ట‌ణ ప్రాంత స‌మ‌గ్ర అభివృద్ధికి సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలోని కూట‌మి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని మంత్రి గొట్టిపాటి స్ప‌ష్టం చేశారు. కార్య‌క్ర‌మంలో కూట‌మి నేత‌లు, అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *