విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా హోటళ్లు, రెస్టారెంట్లు తమ వంటశాలలను (కిచెన్) పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఆహార భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారులు సూచించారు.
మంగళవారం ఉదయం నక్కల రోడ్డు, బందర్ రోడ్డు, వన్ టౌన్ ప్రాంతాల్లో ప్రజారోగ్య అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హోటళ్లు, రెస్టారెంట్లలోని కిచెన్లు, ఆహార పదార్థాల తయారీ ప్రదేశాలు, పారిశుద్ధ్య నిర్వహణ, ఆహార నిల్వ విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ప్రతి హోటల్, రెస్టారెంట్లో ఉపయోగించిన కప్పులు, ప్లేట్లు, గ్లాసులను వేడి నీటితో స్టెరిలైజేషన్ చేసే విధానాన్ని పాటిస్తున్నారా లేదా పరిశీలించారు. అలాగే రక్షిత తాగునీటిని నిల్వ చేసే పాత్రలకు బిగుతైన మూతలు ఉన్నాయా, తయారు చేసిన ఆహార పదార్థాలను మూతలతో భద్రపరుస్తున్నారా అనే అంశాలను తనిఖీ చేశారు.
ఆహార పదార్థాలను మూతలు లేకుండా ఉంచడం వల్ల ఈగలు, దుమ్ము, ఇతర కలుషిత పదార్థాలు చేరి ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉందని అధికారులు హోటల్ నిర్వాహకులకు సూచించారు. ప్రతి ఆహార పదార్థాన్ని పరిశుభ్రంగా, సురక్షితంగా నిల్వ చేయడంతో పాటు అన్ని ఆహార పాత్రలకు తప్పనిసరిగా మూతలు ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు కిచెన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ, పాత్రల శుభ్రత, రక్షిత తాగునీటి నిర్వహణ వంటి అంశాల్లో నిర్లక్ష్యం వహించరాదని అధికారులు సూచించారు.
పారిశుద్ధ్య మరియు ప్రజారోగ్య ప్రమాణాలను పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తే నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో వెనుకాడబోమని అధికారులు హెచ్చరించారు.
ఈ ఆకస్మిక తనిఖీలలో సానిటరీ సూపర్వైజర్లు సలీం అహ్మద్, రమేష్, సోమరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ప్రజారోగ్య విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News