ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్’ కు డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి అవార్డు – 2026 :’డాక్టర్ వైఎస్సార్ & డాక్టర్ కేవీపీ ఫౌండేషన్’

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ వ్యవసాయ రంగం, ఆహార భద్రత, సుస్థిర అభివృద్ధి, గ్రామీణ జీవనోపాధి రంగాలలో అందించిన అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా ‘ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్’ (ఎంఎస్ఎస్ఆర్ఎఫ్) కు ‘డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి అవార్డు – 2026’ ను ప్రకటించారు. ఈ అవార్డు కింద రూ. 25 లక్షల నగదు బహుమతిని అందజేస్తారు. 2026 సెప్టెంబర్ 2న న్యూఢిల్లీలోని ‘కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా’లో నిర్వహించే కార్యక్రమంలో ఎంఎస్ఎస్ఆర్ఎఫ్ తరఫున ఆ సంస్థ ఛైర్‌పర్సన్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఈ అవార్డును స్వీకరిస్తారు.

భారతరత్న, దివంగత డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ మహోన్నత వారసత్వాన్ని ఎంఎస్ఎస్ఆర్ఎఫ్ కొనసాగిస్తోంది. ఆయన శాస్త్రీయ నాయకత్వం మన దేశ హరిత విప్లవంలో, దేశాన్ని ఆహార కొరత నుంచి ఆహార స్వయం సమృద్ధి దిశగా నడిపించడంలో చారిత్రాత్మక పాత్ర పోషించింది. దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ నాయకత్వంలో, ఆమె రాజకీయ సంకల్పం, వ్యవసాయ రంగానికి అందించిన బలమైన మద్దతు, డాక్టర్ స్వామినాథన్ సైంటిఫిక్ విజన్, భారతీయ రైతుల కృషి కలిసి దేశ ఆహార భద్రతకు బలమైన పునాదులు వేశాయి.

సుస్థిర వ్యవసాయం, ఆహార-పోషకాహార భద్రత, జీవవైవిధ్యం, గ్రామీణ జీవనోపాధి రంగాలలో విజ్ఞాన ఫలాలను రైతులకు, గ్రామీణ ప్రజలకు అందిస్తూ ఎంఎస్ఎస్ఆర్ఎఫ్ ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి ప్రజా సంక్షేమ ఆశయాలను, రైతుపక్షపాత ఆలోచనలను కొనసాగించేందుకు ‘డాక్టర్ వైఎస్ఆర్ & డాక్టర్ కేవీపీ ఫౌండేషన్’ స్థాపించబడింది. వైఎస్సార్ ప్రజా జీవితం నిరంతరం రైతులు, పేదలు, సామాన్య ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సాగింది. ఈ నేపథ్యంలో వ్యవసాయం, నీటిపారుదల, వైద్యం, విద్య వంటి రంగాలలో విశేష సేవలందించిన ప్రముఖ వ్యక్తులను, సంస్థలను సత్కరించడం, సమాజ పురోగతికి ఉపయోగపడే వ్యవసాయం తదితర కోర్సులలో ప్రతిభావంతులైన విద్యార్థులకు చేయూతనందించడం, సామాజిక సేవకు జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తులను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా ఈ ఫౌండేషన్ ముందుకు సాగుతున్నది.

ఫౌండేషన్ చేపడుతున్న అవార్డులు, స్కాలర్‌షిప్‌లు, సంక్షేమ కార్యక్రమాలన్నీ డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి స్మృత్యర్థం నిర్వహిస్తున్నవే. ఆయన జీవితంలో చూపించిన కరుణ, ప్రజాసేవ, సమగ్ర అభివృద్ధి విలువల ఆధారంగా ఇవి కొనసాగుతున్నాయి.

2025లో ఈ ఫౌండేషన్ ప్రయాణం ప్రారంభమైంది. తొలి అవార్డును సుస్థిర, ప్రకృతి వ్యవసాయంలో విశేష కృషి చేసిన ‘సుభాష్ పాలేకర్ కృషి’ (ఎస్పీకే) కి ప్రధానం చేశారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్ ఎస్పీకే తరఫున రూ. 25 లక్షల నగదు అవార్డును స్వీకరించారు. అదే కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం, పరిశోధనలలో చేసిన కృషికి గాను ‘శ్రీ పద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్’ ను గౌరవంగా సత్కరించారు. ఈ సత్కారాన్ని ఫౌండేషన్ తరఫున డాక్టర్ చదలవాడ సుధ, డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు స్వీకరించారు.

2026లో, ఫౌండేషన్ ‘ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రూ. 21 లక్షలతో నిధిని ( స్కాలర్షిప్ కార్పస్) ఏర్పాటు చేసింది. దీని ద్వారా ప్రతి సంవత్సరం యూనివర్సిటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థికి స్కాలర్‌షిప్ అందజేస్తారు. వీటితో పాటు సమాజ సంక్షేమానికి కట్టుబడి సేవ చేస్తున్న పలువురు వ్యక్తులకు, సామాజిక కార్యక్రమాలు చేపట్టే సంస్థలకు కూడా ఫౌండేషన్ మద్దతుగా నిలుస్తోంది.

‘డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి అవార్డు – 2026’ ద్వారా గ్రామీణ భారతానికి విశేష సేవలందించిన ఇద్దరు మహానాయకుల వారసత్వాలు ఒకచోటకు చేరాయి. వ్యవసాయ రంగానికి, ఆహార భద్రతకు డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ అందించిన చారిత్రాత్మక శాస్త్రీయ సేవలను, రైతులు, పేదల సంక్షేమం పట్ల డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి అంకితభావాన్ని ఈ అవార్డు ప్రతిబింబిస్తుంది.

ట్రస్టీలు:

డాక్టర్ కేవీపీ రామచందర్ రావు (మాజీ రాజ్యసభ సభ్యులు)
డాక్టర్ జి. చిన్నారెడ్డి (వైస్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా బోర్డు)
డాక్టర్ ఎన్. రఘువీరారెడ్డి (సభ్యులు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ – సీడబ్ల్యూసీ)

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *