-పాత పట్టాలు ఉండి సరిఅయిన హక్కులు పొందలేని వారికి ప్రయోజనం
-భూముల సర్వే, రికార్డుల పరిశీలనతో అర్హత కలిగిన వారికి హక్కులు కల్పించాలి
-జిల్లాలో సుమారు 20 వేల మంది భూ యజమానులకు ప్రయోజనం
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పాత పట్టాలు కలిగి ఉండి భూమిపై పూర్తి స్థాయిలో చట్టబద్ధమైన హక్కులు పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న భూ యజమానులకు చట్టబద్ధమైన హక్కు కల్పించేందుకు సమగ్ర చర్యలు చేపట్టాలనిజిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఎన్‌టీఆర్ పట్టా అమలు, అర్హులైన భూ యజమానులకు చట్టబద్ధమైన హక్కు కల్పించే ప్రక్రియపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పాత పట్టాలు ఉన్నప్పటికీ భూమిపై పూర్తి స్థాయిలో హక్కులు పొందలేని భూ యజమానుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
జిల్లాలో గతంలో ఎన్ టి ఆర్ పట్టాలు పొందినప్పటికీ పూర్తి స్థాయిలో చట్టబద్ధమైన హక్కులు పొందలేకపోతున్న వారు సుమారు 20 వేల మంది ఉన్నట్లు తెలిపారు. అటువంటి భూ యజమానులకు హక్కులు కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
భూముల సమగ్ర సర్వే చేపట్టాలి
ఎన్‌టీఆర్ పట్టా భూములకు హక్కు కల్పించే ప్రక్రియలో భాగంగా సంబంధిత అధికారులు ముందుగా క్షేత్రస్థాయిలో భూములను సర్వే చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పాత పట్టాలో పేర్కొన్న భూమి, ప్రస్తుతం భౌతికంగా ఉన్న భూమి వివరాలను పరిశీలించి, విస్తీర్ణం, సరిహద్దులు, సర్వే నంబర్ తదితర అంశాలను నిర్ధారించాలి.
భూముల సర్వే సమయంలో సంబంధిత భూ యజమానులను భాగస్వామ్యం చేసి, వారి వద్ద ఉన్న పాత పట్టాలు, భూ హక్కులకు సంబంధించిన పత్రాలను పరిశీలించాలని సూచించారు. అవసరమైన చోట భూమి సరిహద్దులను గుర్తించి, భౌతిక పరిస్థితులను రికార్డుల్లోని వివరాలతో సరిపోల్చాలని ఆదేశించారు
రెవెన్యూ రికార్డులను పరిశీలించాలి
పాత పట్టాలు, రెవెన్యూ రికార్డులు, సర్వే రికార్డులు, భూమి విస్తీర్ణం, సర్వే నంబర్లు తదితర వివరాలను సమగ్రంగా పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. రికార్డుల్లో ఏవైనా వ్యత్యాసాలు ఉంటే వాటిని క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా నిర్ధారించి, నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
భూ యజమాని వాస్తవంగా భూమిని కలిగి ఉన్నారా, పట్టాలోని వివరాలు క్షేత్రస్థాయి పరిస్థితులతో సరిపోతున్నాయా, భూమికి సంబంధించి ఇతర అభ్యంతరాలు లేదా వివాదాలు ఉన్నాయా అనే అంశాలను కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
సర్వే, రికార్డుల పరిశీలన అనంతరం అర్హత కలిగిన భూ యజమానుల జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అర్హులైన వారికి ఎన్‌టీఆర్ పట్టా ద్వారా చట్టబద్ధమైన హక్కు కల్పించే ప్రక్రియను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలన్నారు.
భూముల సర్వే నుంచి ఎన్‌టీఆర్ పట్టా జారీ చేసే వరకు ప్రతి దశలో పారదర్శకత, ఖచ్చితత్వం, నిబంధనల పాటింపు ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మండలాల వారీగా ఎన్‌టీఆర్ పట్టా ద్వారా ప్రయోజనం పొందాల్సిన భూ యజమానుల వివరాలను సేకరించి, సర్వే పూర్తి చేయాల్సిన భూములను గుర్తించి, దశలవారీగా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత రెవెన్యూ, సర్వే అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
చిరకాలంగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న ఎన్‌టీఆర్ పట్టాదారులకు పరిష్కారం చూపి, అర్హులైన భూ యజమానులకు వారి భూమిపై చట్టబద్ధమైన హక్కును కల్పించడమే ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ ఆర్డీఓ లు వెన్నెల శ్రీను, జి అనిల్ కుమార్, జిల్లాకు చెందిన తహసీల్దార్లు, వేఎంసీ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News