-ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి: ఎస్.టి.యు రాష్ట్ర అధ్యక్షులు మల్లు రఘునాథ రెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల సమస్యలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం విడుదల చేసిన స్పెషల్ టెట్ నోటిఫికేషన్‌ను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ ఎస్.టి.యు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట జిల్లా అధ్యక్షులు వేముల భిక్షమయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు మల్లు రఘునాథ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నోసంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో సేవలందిస్తూ, అర్హత కలిగిన ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులపై సాధారణ టెట్ నిబంధనలను యథాతథంగా వర్తింపజేయడం అన్యాయమన్నారు. ఉపాధ్యాయుల అనుభవం, ఇప్పటికే పొందిన వృత్తిపరమైన శిక్షణను ప్రభుత్వం గుర్తించాలని కోరారు.
స్పెషల్ టెట్‌ను ఆన్‌లైన్‌కు బదులుగా ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించాలని, ఉత్తీర్ణత మార్కులను డిపార్ట్మెంటల్ పరీక్షల తరహాలో 40 శాతానికి పరిమితం చేయాలని, బోధించే సబ్జెక్టు వరకే టెట్ పరీక్ష సిలబస్ ను పరిమితం చేయాలని ఎస్.టి.యు గతంలో పలుమార్లు ప్రభుత్వాన్ని కోరిందన్నారు. అయితే తాజా నోటిఫికేషన్లో ఈ అంశాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. ప్రక్కనున్న తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయించాలని అసెంబ్లీలో తీర్మానం చేసిందని గుర్తు చేశారు.ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులపై అదనపు పరీక్షా భారం మోపకుండా, వారి సుదీర్ఘ సేవా అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని స్పెషల్ టెట్ నిబంధనలను పునఃపరిశీలించాలని, అసెంబ్లీలో తీర్మానం చేసి ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష ఉత్తీర్ణత నుండి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నోటిఫికేషన్లో అవసరమైన సవరణలు చేసి ఉపాధ్యాయులకు న్యాయం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని మల్లు రఘునాథ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వినతిపత్రాన్ని డి.ఆర్.ఓ గారికి సమర్పించడం జరిగింది. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జి అనుగ్రహ ప్రసాద్, రాష్ట్ర కౌన్సిలర్లు కొడాలి కిషోర్, ఎస్.మస్తాన్ రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు బి.అమర్ నాయక్, బాబురావు, గోపాలకృష్ణ, రవి,సుంకి రెడ్డి, మండల శాఖల బాధ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News