రూ.1.50కే విద్యుత్ అంటూ మరోవైపు మేత ధరల పెంపుతో రొయ్యల రైతుల నడ్డి విరచడం దుర్మార్గం!

-పెంచిన రొయ్యల మేత ధరలను తక్షణమే తగ్గించాలి
-ఫీడ్ కంపెనీల ధరల పెంపుపై ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టాలి-
-ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎ.కాటమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -పి.జమలయ్య డిమాండ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రొయ్యల రైతులకు విద్యుత్ యూనిట్‌ను రూ.1.50కే అందిస్తామని ఒకవైపు చెబుతూ, మరోవైపు రొయ్యల మేత ధరలను పెంచుకునేందుకు ఫీడ్ కంపెనీలకు అవకాశం కల్పించి రైతుల ఆదాయానికి గండి కొట్టడం దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎ.కాటమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్యలు రాష్ట్ర ప్రభుత్వం విధానాలను విమర్శించారు. పెంచిన మేత ధరలను సెప్టెంబర్ 1 నుంచే అమలు చేస్తామని కంపెనీలు ప్రకటిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుండటం అన్యాయమని వారు మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రొయ్యల సాగులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 6 లక్షల ఎకరాల్లో ఏటా 10 లక్షల టన్నులకు పైగా రొయ్యల ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. రొయ్యల ఎగుమతుల ద్వారా దేశానికి, రాష్ట్రానికి పెద్ద ఎత్తున విదేశీ మారకద్రవ్యం లభిస్తోందన్నారు. రైతులు ఏడాదికి సుమారు 15–17 లక్షల టన్నుల రొయ్యల మేతను వినియోగిస్తున్నారని, మేత ధరలను పెంచడం ద్వారా ఫీడ్ కంపెనీలు కోట్లాది రూపాయల అదనపు లాభాలు ఆర్జిస్తున్నాయని విమర్శించారు. “కష్టాలు, కన్నీళ్లు రైతులకు… రాసులు, కాసులు ఫీడ్ కంపెనీలకు” అన్న పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
రొయ్యల రైతులు ఇప్పటికే పెరుగుతున్న సాగు ఖర్చులు, మార్కెట్ ధరలలో తీవ్ర హెచ్చుతగ్గులు, వ్యాధులు, మందుల ఖర్చులు, విద్యుత్ చార్జీలు, కూలీల ఖర్చులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేత ధరలను మరోసారి భారీగా పెంచడం రైతులపై మరింత ఆర్థిక భారాన్ని మోపడమేనన్నారు.
2023లో టన్ను రొయ్యల మేత ధర రూ.82 వేల నుంచి రూ.92 వేల వరకు ఉండగా, గత రెండేళ్లలో వరుసగా ధరలు పెంచడంతో ప్రస్తుతం వెనామీ ఫీడ్ ధర టన్నుకు రూ.1.10 లక్షలకు, టైగర్ ఫీడ్ ధర రూ.1.23 లక్షలకు చేరిందన్నారు. తాజాగా టన్నుకు రూ.15 వేల చొప్పున పెంపు అమలైతే వెనామీ ఫీడ్ రూ.1.25 లక్షలకు, టైగర్ ఫీడ్ రూ.1.37 లక్షలకు చేరుతుందని తెలిపారు. అంటే రెండేళ్లలోనే రైతులపై టన్నుకు రూ.33 వేల నుంచి రూ.45 వేల వరకు అదనపు భారం పడుతోందన్నారు.
కష్టకాలంలో రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఫీడ్ కంపెనీలకు “జీ హుజూర్” అంటూ వారి అడుగులకు మడుగులొత్తుతున్నట్లు వ్యవహరించడం సరికాదని ఎ.కాటమయ్య, పి.జమలయ్య విమర్శించారు.
ప్రస్తుత సీజన్‌లో వైట్‌గట్, వైట్‌స్పాట్, లూజ్‌షెల్ తదితర వ్యాధుల కారణంగా రొయ్యల సాగు కూడా తగ్గుముఖం పట్టిందని తెలిపారు. మార్కెట్లో రొయ్యల ధరలు కొంత పెరిగినట్లు కనిపించడాన్ని సాకుగా చేసుకుని ఫీడ్ కంపెనీలు అమాంతంగా మేత ధరలు పెంచడం దుర్మార్గమన్నారు.
100 కౌంట్ వెనామీ రొయ్యల ఉత్పత్తి వ్యయం కిలోకు సుమారు రూ.280 వరకు ఉండగా, ప్రస్తుతం మార్కెట్ ధర కూడా దాదాపు రూ.280 మాత్రమే ఉందన్నారు. అదే విధంగా టైగర్ రకం రొయ్యల ఉత్పత్తి వ్యయం 40 కౌంట్‌కు కిలోకు సుమారు రూ.420 వరకు అవుతుండగా, మార్కెట్లో ప్రస్తుతం కిలోకు రూ.420 వరకు మాత్రమే ధర లభిస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో మేత ధరలు మరింత పెరిగితే రైతులకు మిగిలేది ఏమీ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని గత రెండేళ్లలో పెంచిన రొయ్యల మేత ధరలను తక్షణమే తగ్గించాలని
మేత తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలపై పన్నులను తగ్గించాలని
సాగు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని రొయ్యలకు మద్దతు ధర ప్రకటించి చట్టబద్ధత కల్పించాలని,
ఫీడ్ కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు పెంచకుండా ప్రభుత్వం ధరల నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని వారు కోరారు.
ఆక్వా రైతులపై భారంగా మారిన పవర్ ఫ్యాక్టర్ జీవోను ఉపసంహరించాలని,
పవర్ ఫ్యాక్టర్‌తో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ యూనిట్ విద్యుత్ రూ.1.50కే అందించాలని
రొయ్యల సాగును, లక్షలాది రైతుల జీవనోపాధిని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, తక్షణమే ఫీడ్ కంపెనీలతో చర్చించి సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయనున్న ధరల పెంపును అడ్డుకోవాలని ఎ.కాటమయ్య, పి.జమలయ్యలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *