– వ్యాపార విజయానికి ఆర్థిక నిర్వహణ అత్యంత కీలకం
– అవగాహనతో అడుగులు వేస్తూ విజయాలను అందుకోండి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రభుత్వ శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటూ ఒక కుటుంబం–ఒక పారిశ్రామికవేత్త లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్నారని… అయితే మహిళలు వ్యాపారాలను ప్రారంభించడం మాత్రమే కాకుండా, వాటిని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఆర్థిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవడం చాలా ముఖ్యమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
శనివారం ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి రైజ్ కేంద్రంలో ఫిక్కీ ఎఫ్ఎల్వో విజయవాడ చాప్టర్ సహకారంతో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక అక్షరాస్యతపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మహిళా సాధికారతలో ఆర్థిక అక్షరాస్యత పోషించే కీలక పాత్రను ఫిక్కీ ఎఫ్ఎల్వో విజయవాడ చాప్టర్ ఛైర్పర్సన్ సుప్రియా మల్లినేని సమక్షంలో సంస్థ ట్రెజరర్, సీఏ తుల్జా భవానీ వివరించారు. ఉద్యమ్ రిజిస్ట్రేషన్, ఆదాయపు పన్ను, జీఎస్టీ, వ్యాపారానికి సంబంధించిన ఇతర చట్టపరమైన అంశాలపై ప్రాథమిక అవగాహన కలిగి ఉండటం ముఖ్యమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలు, రుణ సదుపాయాలు, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆర్థిక అంశాలపై పట్టుద్వారా వ్యాపారాలను మరింత విజయవంతంగా విస్తరించుకోవచ్చని వివరించారు. కార్యక్రమంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం, ఆదాయాన్ని పెంచుకోవడం ఎంత ముఖ్యమో, వచ్చిన ఆదాయాన్ని సమర్థంగా నిర్వహించడం, ఖర్చులను నియంత్రించడం, పొదుపు చేయడం, భవిష్యత్ అవసరాలకు ప్రణాళిక రూపొందించడం కూడా అంతే ముఖ్యమన్నారు. ఆర్థిక అక్షరాస్యత కలిగిన మహిళలు తమ వ్యాపారంలో లాభనష్టాలను అంచనా వేసుకోవడంతో పాటు, సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోగలుగుతారని పేర్కొన్నారు. ఆర్థికంగా అవగాహన కలిగిన మహిళలు కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లోనూ, వ్యాపార నిర్ణయాల్లోనూ మరింత ఆత్మవిశ్వాసంతో వ్యవహరించగలుగుతారని తెలిపారు. ఆర్థిక స్వాతంత్ర్యం మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు కుటుంబ స్థిరత్వానికి, పిల్లల భవిష్యత్‌కు, వ్యాపార అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో మహిళా వ్యాపారవేత్తలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, రైజ్ మేనేజర్ బి.తేజస్విని పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News