ప్రజా రాజధాని అమరావతిలో ఏర్పాటు కానున్న “Sancta Maria” ఇంటర్నేషనల్ స్కూల్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతిలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు “సెయింట్ మేరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ” ఆధ్వర్యంలో “Sancta Maria” ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు కానుంది. APCRDA.. సదరు సంస్థకు తుళ్లూరులో కేటాయించిన 7.97 ఎకరాల భూమికి సంబంధించి శనివారం, ఆగస్టు 29న అగ్రిమెంట్ పూర్తయ్యింది.

అమరావతిలో నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. APCRDA ఎస్టేట్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ జుబిన్ రాయ్..అగ్రిమెంట్ పత్రాలను “సెయింట్ మేరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ” ప్రతినిధులకు మందడం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అందజేశారు. రూ.120 కోట్ల పెట్టుబడితో అమరావతిలో అత్యుత్తమ సదుపాయాలతో పాఠశాల నిర్మించనున్నట్లు “సెయింట్ మేరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ” ప్రతినిధులు ఈ సందర్భంగా వెల్లడించారు. అమరావతిలో విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధికి “Sancta Maria” ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు మరో కీలక ముందడుగుగా నిలవనుందన్నారు.

45 ఏళ్లుగా విద్యారంగంలో సేవలందిస్తున్న సెయింట్ మేరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ.. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాల క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నట్లు, ఈ ప్రాజెక్టుకై సుమారు రూ.120 కోట్ల పెట్టుబడి పెట్టడంతో పాటుగా, అవసరమైన అదనపు వర్కింగ్ క్యాపిటల్‌ను సమకూర్చకోనున్నట్లు సెయింట్ మేరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. తొలి దశలో రెండేళ్లలో సుమారు 1.70 లక్షల చదరపు అడుగుల నిర్మాణాన్ని చేపట్టి, అనంతరం ఈ క్యాంపస్‌ను 2.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణానికి అభివృద్ధి చేస్తామన్నారు. కే-12 స్థాయిలో ఏర్పాటు కానున్న ఈ రెసిడెన్షియల్ క్యాంపస్‌లో CAIE/IB వంటి అంతర్జాతీయ విద్యా విధానాలతో బోధన అందిస్తామన్నారు. సుమారు 800 మంది విద్యార్థులకు విద్య, వసతి, క్రీడలు తదితర అన్ని సౌకర్యాలను అమరావతి క్యాంపస్‌లో అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు. పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ఈ సంస్థ ద్వారా సుమారు 200 మందికి ప్రత్యక్షంగా, మరో 100 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థలు అమరావతిలో ఏర్పాటవడం ద్వారా స్థానిక విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు అందడంతో పాటు, దేశ విదేశాల నుంచి విద్యార్థులు, విద్యా రంగ నిపుణులను ఆకర్షించే అవకాశం ఈ తరహా పాఠశాలల ఏర్పాటుతో పెరగనున్నాయి. తద్వారా అమరావతి విద్య, నైపుణ్యాలు, ప్రతిభకు కేంద్రంగా అభివృద్ధి చెందేందుకు మరింత ఊతం లభించనుంది. విద్యా రంగంలో పెట్టుబడులు, నాణ్యమైన విద్యాసంస్థలు, ఉపాధి అవకాశాలను ప్రోత్సహిస్తూ రాజధాని అమరావతిని సమగ్రంగా అభివృద్ధి చేయడంలో APCRDA తన కృషిని కొనసాగిస్తోంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *