– 175 నియోజక వర్గాలలో ఘనంగా కార్యక్రమం నిర్వహణ
– తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో కార్యక్రమాల నిర్వహణకు సన్నాహాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ యువజన విభాగాన్ని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఆవిష్కరించనున్నారు. పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11 గంటలకి యువజన విభాగం ఆవిష్కరణ కార్యక్రమాన్ని జన సైనికులు, వీర మహిళలు, నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ , రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆ రోజు యువజన విభాగం లోగో, గీతాన్ని ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆన్ లైన్ ద్వారా పార్టీ శ్రేణులకు సందేశం ఇస్తారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కేరళలో చికిత్స తీసుకొంటున్న సంగతి విదితమే. యువజన విభాగం ఏర్పాటు ఉద్దేశం, విభాగం లక్ష్యాలు, యువతలో రాజకీయ చైతన్యం తదితర అంశాలపై దిశానిర్దేశం చేస్తారు.
యువజన విభాగం ఆవిష్కరణ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Prajavartha Online Telugu News