విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సిటీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం 73వ మరియు 74వ డివిజన్లలో “గడపగడపకు కాంగ్రెస్” కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయా ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహిస్తూ స్థానిక ప్రజలను నేరుగా కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతిపత్రాలను స్వీకరించారు.
ముఖ్యంగా సచివాలయం సమీపంలోని 6వ బ్లాక్ మరియు 5వ బ్లాక్ ప్రాంతాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై స్థానిక ప్రజలు కాంగ్రెస్ నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యను అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ సీఐ దృష్టికి తీసుకెళ్లగా, సీఐ సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించి, తక్షణమే అక్కడ బీట్ కానిస్టేబుల్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేయడమే “గడపగడపకు కాంగ్రెస్” కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీసీసీ ఉపాధ్యక్షులు వి. గురునాథం, విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు , విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మీసాల రాజేశ్వరరావు, విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు షేక్ అబ్దుల్ అన్సారి, అశోక్ షారోన్, కుసుమంచి గణేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ నాయకులు సూరిబాబు , నేలపాటి సుభాష్ , పరుశురాం యాదవ్, బగ్గా రమణ , సాయి కృష్ణ , ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News